ఆ రాష్ట్రం దుర్గామాత ఆలయాల నిలయం... అక్కడి ప్రాముఖ్యతల గురించి తెలిస్తే...

ABN , First Publish Date - 2022-09-26T15:01:15+05:30 IST

శారదా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో...

ఆ రాష్ట్రం దుర్గామాత ఆలయాల నిలయం... అక్కడి ప్రాముఖ్యతల గురించి తెలిస్తే...

శారదా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో దేశంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. రాజస్థాన్‌లో అమ్మవారి దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఆయా ఆలయాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అర్బుదా దేవి ఆలయం 

అర్బుదా దేవి ఆలయాన్ని అధర్ దేవి శక్తిపీఠంగా పిలుస్తారు. ఈ ఆలయం రాజస్థాన్‌లోని మౌంట్ అబూకు 3 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది. పార్వతీ దేవి పెదవులు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే దీనిని శక్తిపీఠంగా పిలుస్తారు. ఇక్కడ మాత అర్బుదా దేవిని కాత్యాయనీ దేవి రూపంలో పూజిస్తారు. నవరాత్రుల సమయంలో ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 


నౌసర్ మాతా ఆలయం 

అజ్మీర్‌లోని నౌసర్ లోయలో ఈ ఆలయం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయ ప్రస్తావన పద్మ పురాణంలో కనిపిస్తుంది. అమ్మవారు నాగ కొండ ప్రధాన ద్వారం వద్ద తొమ్మిది రూపాలలో దర్శనమిస్తారు. 

త్రిపుర సుందరి ఆలయం 

మాతా త్రిపుర సుందరి ఆలయం బన్స్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని తల్వారా గ్రామంలోని ఆరావళి శ్రేణుల మధ్య ఉంది. సింహవాహినిగా కనిపించే త్రిపుర సుందరి అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు.

మణిబంధ శక్తిపీఠం 

మణిబంధ శక్తిపీఠం పుష్కర్‌లో ఉంది. ఇది పర్వతపైభాగంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ సతీమాత రెండు మణికట్లు నేల రాలాయి. ఇక్కడ మాతా సతీదేవిని మణివేదిగా, గాయత్రిగా పూజిస్తారు. ఈ ఆలయం గాయత్రీ మంత్ర సాధనకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. 

అంబికా పీఠం 

జైపూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిరాట్‌నగర్‌లో అంబికా మాత ఆలయం ఉంది. సతీదేవి ఎడమ పాదం బొటనవేళ్లు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అందుకే ఇది శక్తిపీఠం అయ్యిందని అంటారు. ఇక్కడ అమ్మవారు అంబికా రూపంలోనూ, శివుడు అమృతేశ్వరుని రూపంలోనూ పూజలందుకుంటారు. 

Updated Date - 2022-09-26T15:01:15+05:30 IST