ltrScrptTheme3

ఫంగస్‌ తిరగబెట్టదు

Jun 8 2021 @ 10:18AM

ఆంధ్రజ్యోతి(08-06-2021)

బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌లను అణచివేసే సమర్థమైన చికిత్సలు హోమియోలో ఉన్నాయి. శరీర తత్వం, ఇన్‌ఫెక్షన్‌ దశలను బట్టి హోమియో మందులతో ఈ రెండు రకాల ఫంగస్‌లకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చు.


హోమియోలో యాంటీ ఫంగల్‌ రెమెడీలు ఉన్నాయి. అయితే ఈ ఫంగస్‌లు సోకిన వ్యక్తులందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా వ్యక్తి శరీర తత్వం, వ్యాధి నిరోధకశక్తి, సోకిన ప్రదేశం, ఫంగస్‌ రకాలను బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. అలాగే సిటి స్కాన్‌ రిపోర్టుతో పాటు, లక్షణాలను పరిగణలోకి తీసుకుని మందును ఎంచుకోవలసి ఉంటుంది. ఫంగస్‌ సోకిన వ్యక్తుల ముఖంలో చోటుచేసుకునే మార్పులు కూడా కీలకమే! కంటికి సోకినప్పుడు కనుగుడ్డు పైకి, లేదా కిందకు తిరుగుతుంది. దీన్ని బట్టి కూడా చికిత్సలో మార్పులు ఉంటాయి. 


వైట్‌, బ్లాక్‌ ఫంగస్‌లు ఇలా...

ఈ రెండింట్లో వైట్‌ ఫంగస్‌ను నయం చేయడం తేలిక. ఈ రెండు ఫంగస్‌లు పేరుకు తగ్గట్టే తెలుపు, లేదా నలుపు రంగుల్లో ఉంటాయి. నాలుక, దవడ లోపలి భాగాలు, బుగ్గల లోపల ఈ ఫంగస్‌లు తలెత్తుతాయి. నాలుక మీద వైట్‌ ఫంగస్‌ తలెత్తితే చిక్కటి పాచి లాగా, బ్లాక్‌  ఫంగస్‌ అయితే నల్లని తివాచీ పరిచినట్టు కనిపిస్తుంది. బుగ్గల లోపల కూడా నల్లని చుక్కల్లా ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్‌ సైనసైటిస్‌ ఎలాగైతే ముఖంలోని సైనస్‌లలోకి చేరుకుని చిక్కని, ఆకుపచ్చని కఫం రూపంలో బయటకు వస్తుందో, ఈ ఫంగల్‌ సైనసైటిస్‌ కూడా ముఖంలోని సైనస్‌లే లక్ష్యంగా దాడి చేస్తుంది. అయితే కఫం నలుపు రంగులో వెలువడుతుంది. కొవిడ్‌తో సంబంధం లేకుండా బ్యాక్టీరియల్‌ సైనసైటిస్‌తో పాటు సెకండరీ ఇన్‌ఫెక్షన్‌గా కూడా మ్యూకార్‌మైకోసిస్‌ బయల్పడుతూ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న మ్యూకార్‌మైకోసిస్‌ కొవిడ్‌ చికిత్సలో వాడిన స్టిరాయిడ్ల మూలంగా ఇమ్యూనిటీ తగ్గడంతో శరీరంలోకి తేలికగా ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తోంది. 


హోమియో చికిత్స

ప్రారంభ దశ మొదలు అంతిమంగా మెదడులోకి చేరుకుని, కోమాలోకి చేరుకున్న పరిస్థితిలో కూడా హోమియో మందులతో చికిత్స చేయవచ్చు. హోమియో మందులు శక్తి ప్రధానంగా పని చేస్తాయి. బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్సలో 1000, 10 వేల పొటెన్సీ కలిగిన హోమియో మందులు సమర్థవంతంగా పని చేస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతలను బట్టి డోసుల మోతాదు, సంఖ్య పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. బ్లాక్‌ఫంగస్‌తో పూర్తిగా పాడైపోయిన భాగాన్ని సర్జరీతో తొలగించినా, తిరిగి అదే ఫంగస్‌ రెండోసారి సోకకుండా ఉంటుందనే భరోసా లేదు. కానీ హోమియో చికిత్సతో బ్లాక్‌ లేదా వైట్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గడంతో పాటు తిరిగి రెండోసారి సోకే వీలు లేని వాతావరణం శరీరంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ తిరగబెడుతుందని భయపడవలసిన అవసరం లేదు. 

ఆహారం ప్రధానం 

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినవాళ్లకు ఆహారం రుచించకపోవచ్చు. ఘనాహారం తినలేరు. కాబట్టి తీసుకునే ద్రవాహారం బలవర్ధకమైనదై ఉండాలి. ఇందుకోసం పండ్ల రసాలతో పాటు అంబలి తాగడం మంచిది. ఉదయం వండి వార్చిన గంజిని రాత్రికి, రాత్రి వండిన గంజిని మరుసటి రోజు ఉదయాన తాగడం అలవాటు చేసుకోవాలి. పులిసిన గంజితో శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. వ్యాధినిరోధకశక్తి కూడా మెరుగవుతుంది. అలాగే రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలతో జావ కాచి తీసుకోవచ్చు. 40 రోజుల పాటు పులిసిన గంజి తాగితే బోలెడన్ని వ్యాధులు తగ్గుముఖం పడతాయి. 


- డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు

హోమియో వైద్యులు, హైదరాబాద్‌.


Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.