గణపతికి వీడ్కోలు

Sep 19 2021 @ 00:53AM

  1. కేసీ కెనాల్‌లో నిమజ్జనం
  2. రాంభొట్ల ఆలయం వద్ద తొలి పూజ
  3. పరిపాలన గణపతికి తొలి నిమజ్జనం
  4. హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు


కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 18: తొమ్మిది రోజులపాటు అశేష భక్తుల నుంచి పూజలు అందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనానికి తరలిపోయాడు. కర్నూలు నగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవాలు శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కన్నుల పండువగా సాగాయి. వేలాది భక్తగణం ఉత్సవమూర్తుల వెంట తరలి రాగా, ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై బొజ్జ గణపతి చిద్విలాసంగా ఊరేగాడు. కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద గంగమ్మ తల్లి ఒడికి చేరుకున్నాడు. కర్నూలు నగరంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు 39 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత కర్నూలు రెండో స్థానంలో ఉంటుంది. ఈ ఏడాది కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో భక్తులు పరిమిత సంఖ్యలో విగ్రహాలను నెలకొల్పాల్సి వచ్చింది. నగరంలో ఈ ఏడాది సుమారు 900 విగ్రహాలను నెలకొల్పారు. రాంభొట్ల దేవాలయం వద్ద వివేకానంద యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన విగ్రహానికి కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి, మేయర్‌ బీవై రామయ్య, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కపిలేశ్వరయ్య, సందడి సుధాకర్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు హరీష్‌బాబు తదితరులు తొలి పూజలు చేశారు. ఊరేగింపుతో ఉత్సవాలను ప్రారంభించారు. కృష్ణానగర్‌, బళ్లారి చౌరస్తా, నంద్యాల చెక్‌పోస్టు, ప్రకాశ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి మొదలైన ఊరేగింపు, కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వరకు సాగింది. అక్కడ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద విగ్రహాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి గంగమ్మ ఒడిలోకి విడిచి పెట్టారు.


వినాయక ఘాట్‌లో సందడి 


గణేశ్‌ నిమజ్జనోత్సవానికి కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌లో జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వినాయక ప్రతిమలను నీటిలోకి విడిచేందుకు మూడు పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. కెనాల్‌ ఒడ్డున చిన్న చిన్న విగ్రహాలను నీటిలోకి జార విడిచేందుకు ఆరు ప్రాంతాలను సిద్ధం చేశారు. కెనాల్‌లో ప్రవాహం ఉధృతంగా ఉన్నందున మత్స్యశాఖ ఆధ్వర్యంలో బోట్లతోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం 11.52 గంటలకు ఘాట్‌లో నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ కార్యకర్త జి. రఘురామయ్య, జిల్లా గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు కె. కపిలేశ్వరయ్య, కె. క్రిష్టన్న, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం. నాగఫణిశాస్త్రి జ్యోతిప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల కరోనాతో మృతిచెందిన గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. తర్వాత కలెక్టరేట్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన పరిపాలన గణపతి విగ్రహాన్ని తొలి నిమజ్జనం చేశారు. 


సమష్టిగా వేడుక


గణేశ్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కేసీ కెనాల్‌కు రెండు వైపులా ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ దీపాలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, గణేశ్‌ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన కాషాయ పతాకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేసీ కెనాల్‌ ఘాట్‌ నుంచి అటు సి.క్యాంపు వరకు, ఇటు రాజ్‌విహార్‌ వైపు దారి వెంట మైక్‌లు ఏర్పాటు చేశారు. ఘాట్‌లో జరిగే సన్నివేశాల గురించి వ్యాఖ్యాతలు వివరించారు. విగ్రహాలు వచ్చే ప్రాంతాలు, వాటి నిర్వాహకుల పేర్లు చెబుతూ భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఘాట్‌ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎస్పీ కేవీ మహేశ్‌ పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి నగర అధ్యక్షుడు సందడి సుధాకర్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కాళింగి నరసింహ వర్మ, ప్రతినిధులు డాక్టర్‌ కొట్టే చెన్నయ్య, శ్రీనివాస్‌, రంగస్వామి, గూడా సుబ్రహ్మణ్యం, రామస్వామి, ఏవీ ప్రసాద్‌, టి. ప్రతాపరెడ్డి, ఎలమర్తి రమణయ్య, రామకృష్ణశర్మ తదితరులు ఉత్సవ కమిటీకి సూచనలు ఇచ్చారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.