సాగుబాట అప్పుల వేట!

ABN , First Publish Date - 2022-06-26T05:04:37+05:30 IST

వానాకాలం ప్రారంభమైంది. తొలకరి పలకరించింది.

సాగుబాట అప్పుల వేట!


  • పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్న రైతులు
  • పాత బకాయి చెల్లిస్తేనే కొత్త రుణాలంటున్న బ్యాంకర్లు
  • ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేయకపోవడంతో పేరుకున్న బకాయి
  • ధాన్యం అమ్మిన డబ్బులూ రాలే
  • తొలకరి కురిసినా అందని రైతుబంధు
  • పంట పెట్టుబడి కోసం తప్పని తిప్పలు

వానాకాలం ప్రారంభమైంది. తొలకరి పలకరించింది. కొత్త పంట వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. కానీ, తొలకరికి ముందే వారికి పెట్టుబడి కష్టాలు మొదలయ్యాయి. పాత అప్పులు తీర్చలేదని బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారుల ఇళ్లచుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారు అధిక వడ్డీలతో పాటు సవాలక్ష నిబంధనలు పెట్టి అప్పులు ఇస్తున్నారు. కొందరు బంగారం తాకట్టు పెడితేనే అప్పు ఇస్తామంటున్నారు. దీంతో సాగు ఎలా చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

రంగారెడ్డి అర్బన్‌/ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, జూన్‌ 25: తొలకరి కురిసింది. రైతన్నలు సాగుబాట పట్టారు. ఇప్పటికే దుక్కులు దున్నుకున్నారు. పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధమయ్యారు. సాగుకు సిద్దమైన రైతులకు పెట్టుబడి ఖర్చు పెద్ద భారంగా పరిణమించింది. గతంలో బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు ఇస్తే వాటితో సాగు ప్రారంభించేవారు. కానీ, గతంలో చేసిన అప్పు బ్యాంకుల్లో అలాగే ఉంది. ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తామని గడువు పెడుతున్నా ఇప్పటి వరకు మాఫీ చేయలేదు. దీంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగుకు దిగారు. పంట పెట్టుబడి కోసం కొందరు రైతులు బంగారు ఆభరణాలు తాకట్టుపెడుతున్నారు. ఽధాన్యం అమ్మిన సొమ్ము సకాలంలో అందక.. బ్యాంకర్లు అప్పులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడంతో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు 

ప్రతి ఏటా వానకాలం ముందు రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, వార్షిక రుణ ప్రణాళిక ఇంకా తయారు చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా బ్యాంకర్లు రుణ ప్రణాళికను తయారు చేసి కొత్త రైతులకు రుణాలివ్వాలని వారు కోరుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.

అందని రైతుబంధు

వానాకాలం సీజన్‌ ప్రారంభమై పదిరోజులు గడిచిపోయింది. ఏటా జూన్‌ మొదటివారంలోనే రైతుబంఽధు సాయం అందేది. కానీ, ఈ సారి సమయానికి రైతుబంధు డబ్బులు పడే పరిస్థితులు కనిపించడం లేదు. రైతుబంధు డబ్బులతోనైనా కొంత ముందుకు లాగుదామనుకున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని రైతులు వాపోతున్నారు. 

రుణమాఫీ కోసం ఎదురుచూపులు!

రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు తమ రుణం మాఫీ అవుతుందనే ఆశతో నాలుగేళ్లుగా రుణాలను చెల్లించకుండా ఎదురు చూస్తున్నారు. 2018 డిసెంబర్‌ 11నాటికి ఉన్న పంట బకాయిలను రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని 2002 మార్చిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది విడతల వారీగా అంటే మొదట రూ.25వేల లోపు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి తొలి విడతలో చెల్లించేందుకు నిర్ణయించగా.. ఆ తర్వాత రూ.50 వేలు, రూ.75వేలు, చివరన లక్షలోపు తీసుకున్న వారికి ఇలా నాలుగు వాయిదాల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రూ. 25 వేలు తీసుకున్న రైతుల రుణం మాఫీ చేశారు. రూ.50వేల లోపు తీసుకున్న రైతులవి గతేడాది ఆగస్టు 16 నుంచి 31లోపు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేవలం రూ.30 వేలు రుణం ఉన్న రైతులకు మాత్రమే మాఫీ అయినట్లు తెలుస్తోంది. మిగతావారికి ఇప్పటి వరకు కాలేదు. ఇందుకు సంబంధించి కారణాలు ఎవరూ చెప్పడం లేదు. లక్షలోపు రుణం తీసుకుని రెన్యూవల్‌ చేయించుకోని రైతులకు తిరిగి రుణం ఇవ్వడం లేదు. రైతుబంధు డబ్బులు కూడా బ్యాంకర్లు వడ్డీ కింద ఉంచేసుకుంటున్నారు. 

ధాన్యం డబ్బులూ ఇవ్వలే..

కనీసం ధాన్యం అమ్మిన డబ్బులు వస్తే వాటితోనైనా వానాకాలం సాగు ప్రారంభిద్దామనుకున్న రైతులకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. యాసంగి పంట అమ్మిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 91,251 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ ధాన్యానికి రూ.25 కోట్ల 41 లక్షల రూపాయలు చెల్లించారు. ఇంకా రూ. 164.88 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తుండడంతో రైతులు వానాకాలం పెట్టుబడి కోసం నానా అవస్థలు పడుతున్నారు. రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేలు వచ్చినా అవి ఏ మూలకూ సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. 

భారమవుతున్న ఖర్చులు

రోజు రోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలతో రైతులకు దిగులు పట్టుకుంది. ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు తడిసి మోపడవుతుండటంతో పెట్టుబడులు పెరిగి వ్యవసాయ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దుక్కి దున్నడం మొదలు పంటకోత వరకు, మందుల పిచికారీ కోసం కూడా యంత్రాలపైనే ఆధారపడక తప్పడం లేదు. నిత్యం పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి. దుక్కులు దున్నడం మొదలుకుని పంట చేతికి వచ్చేంత వరకు ఎకరం సాగుకు పంట పెట్టుబడి రూ. 25,000 నుంచి రూ.30,000 పైగానే ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు అధిక వడ్డీలకు తెచ్చి సాగుచేస్తే గిట్టుబాటు కూడా కావడం లేదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు వాపోతున్నారు.

ఎరువుల వ్యాపారుల దగ్గర..

బ్యాంకుల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు పుట్టని కొంత మంది రైతులు ఎరువుల వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో కలుపు,కూలీల ఖర్చుల కోసం కూడా వారినే ఆశ్రయిస్తున్నారు. పండిన పంటలను వ్యాపారులకే అమ్ముతామని రాయించుకుని అప్పులు తీసుకుంటున్నారు. ఎరువుల వ్యాపారులు ఎరువులు, విత్తనాలను రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నారు. అయినా, గత్యంతరం లేక వారివద్ద అప్పుగా తీసుకుంటున్నారు. దీనికి వ్యాపారులు వడ్డీకూడా వసూలు చేస్తారు. తాము తీసుకున్న ఎరువులు, పురుగుమందులకు అయ్యే  ఖర్చులు, వాటికి వడ్డీ కలిపి లెక్కిస్తారని.. పండిన పంట మొత్తం తీసుకున్నా వారి డబ్బులకు సరిపోకుంటే మరో పంట కూడా ఇస్తామని కాగితాలు రాసి ఇవ్వాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువుల ధరల పెరుగుదల ఇలా (రూపాయల్లో)

ఎరువు     2021 2022 పెరుగుదల

16:20:0:13    900 1,400 500

14:35:14     830 1,800 970

20:20     1,050 1,450 400

28:28:0     830 1,800 970

20:20:0:13    1,050 1,450 400

డీఏపీ     1,200 1,350 150

పొటాష్‌     850 1,700 850

మొత్తం     6,710 10,950 4,240

ధాన్యం కొనుగోలు వివరాలు

            రంగారెడ్డి       వికారాబాద్‌     మేడ్చల్‌

కొనుగోలు లక్ష్యం (టన్నులు)         1,18,000    80,000 1,616

ఇప్పటి వరకు కొన్నది (టన్నులు)    20,000    60,251 11,000

ఇవ్వాల్సిన డబ్బులు         40.90 కోట్లు     103.53 కోట్లు 20.45 కోట్లు

ఇచ్చిన డబ్బులు         3.05 కోట్లు    11.91 కోట్లు 10.45 కోట్లు

రైతులు, సాగు విస్తీర్ణం వివరాలు

        రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌

మొత్తం రైతులు 2,82,094 2,57,148 40,291

సాగు విస్తీర్ణం(అంచనా) 4,88,579 6,81,009 14,642

సాగు ఖర్చు వివరాలు (ఎకరానికి)

పని         2021         2022

దున్నకం 2,200 2,500

కల్టివేటర్‌ 1,200 1,500

రోటావేటర్‌         1,200 1,500

ప్లవ్‌         2,000 2,400

మినీ ప్లవ్‌         1,300 1,500

గుంటుక 800         1,200

కరిగెటు 1,500 1,700

విత్తేందుకు         1,000 1,200

ఎరువులు,మందులు 9,000 12,000

మొత్తం         20,200 25,500

బ్యాంకుకు వెళితే రుణం ఇవ్వనన్నారు

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం కంకల్‌ గ్రామానికి చెందిన చంద్రయ్య సన్నకారు రైతు.  ఆయనకు మూడెకరాల పొలం ఉంది. ఇప్పటికే బ్యాంకులో రూ. లక్షకు పైగా పంటరుణం ఉంది.  ప్రభుత్వం చెప్పినట్టుగా రుణం మాఫీ చేయలేదు. రుణమాఫీ అవుతుందని ఆ రుణం తిరిగి చెల్లించలేదు. అయితే, వానాకాలం సాగుకు డబ్బులు అవసరం ఉంది. దీంతో అతడు రుణం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లాడు. కానీ, ఇప్పటికే మీరు బాకీ చెల్లించలేదు.. మళ్లీ మీకు రుణం ఇవ్వడం కుదరదని చెప్పారు. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళితే బంగారమో, పొలం పాస్‌బుక్కో కుదువబెట్టమంటున్నారు. మాది పేద కుటుంబం. కుదువపెట్టేందుకు మా దగ్గర బంగారం లేదు. పాస్‌బుక్‌ బ్యాంకులోనే ఉంది. దీంతో గత్యంతరం లేక ఎరువుల వ్యాపారి వద్ద పత్తి విత్తనాలు, ఎరువులు అరువు తీసుకున్నాడు. దీనికింద పంట అతడికే అమ్ముతానని కాగితం కూడా రాసిచ్చాడు. వడ్డీ కూడా ఎక్కువగానే చెల్లించేందుకు సిద్ధమై సాగును షురూ చేశాడు.

రూ.5 వడ్డీకి రూ.30 వేలు తీసుకున్నా

నాకు నాలుగెకరాల భూమి ఉంది. బ్యాంకులో రూ.1.20 లక్షల అప్పు ఉంది. కొత్త అప్పు మాట అటుంచితే రెన్యువల్‌ చేయమంటున్నరు. కొత్తరుణం ఇవ్వరట. రైతుబంధు డబ్బులు పడలేదు. విత్త్తనాలు విత్తుకునే కాలం వచ్చింది. విత్తనాలు, మందు సంచులకు డబ్బులు లేక ఓ వ్యక్తి దగ్గర రూ.5 మిత్తికి రూ.30 వేల అప్పు తీసుకున్నా. ఇంకా మధ్యలో పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. వాటి కోసం మళ్లీ వెతకాలి. 

                                               - కిషన్‌నాయక్‌, రైతు, బొంపల్లితండా, దోమ మండలం

బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు

పాత బకాయిలు చెల్లించిన వెంటనే రైతులకు కొత్తగా పంట రుణాలు మంజూరు చేస్తాం. తీసుకున్న రుణం ఏడాది లోపు చెల్లిస్తేనే ఆ రుణానికి 7శాతం వడ్డీ వర్తిస్తుంది. గడువు దాటితే వడ్డీ పెరిగి రైతుపై భారం పడుతుంది. బకాయిలు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందో లేదో అని కొందరు అలాగే ఉండి పోయారు. పంట రుణాలు చెల్లించినా రుణమాఫీ సొమ్ము రైతు ఖాతాలో జమవుతుంది. మా బ్రాంచిలో 50 శాతం మంది బకాయిలు చెల్లిచలేదు. వీరు కొత్తగా రుణాలు పొందలేకపోతున్నారు.

                                                       - కె.సురేష్‌, ఎస్‌బీఐ మేనేజర్‌, ఇబ్రహీంపట్నం

రూ.3 వడ్డీకి తెచ్చిన

నాకు 4.11 ఎకరాల భూమి ఉంది. అందులో పత్తి, వరి, జొన్న సాగు చేస్తా. వీటి సాగుకు గతంలో బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కొత్తరుణం ఇవ్వనం టుండ్రు. దీంతో వానాకాలం సాగుకు ఇప్పటివరకు రూ.50 వేలను వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చా. దీనికి మూడు రూపాయల వడ్డీ ఇస్తనంటేనే ఆ డబ్బులు ఇచ్చారు.

                                                        - ఒగ్గు చిన జంగయ్య, పోలేపల్లి, ఆమనగల్లు

Updated Date - 2022-06-26T05:04:37+05:30 IST