ఇక వ్యవసాయ పనులు ముమ్మరం

ABN , First Publish Date - 2021-07-24T06:47:39+05:30 IST

విస్తారంగా వానలు కురిసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి.

ఇక వ్యవసాయ పనులు ముమ్మరం
భువనగిరి మండల పరిధిలో పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు

అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు ఫ పెరిగిన భూగర్భజలాలు 

వ్యవసాయ పనుల్లో రైతులు ఫ ఇటీవలి వర్షాలతో చేకూరనున్న లబ్ధి

తుర్కపల్లి మండలంలో అత్యధికంగా 42.6 మి.మీ వర్షపాతం నమోదు 

విస్తారంగా వానలు కురిసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. భూగర్భజలాలు పెరిగి బోరు, బావుల్లో నీరు ఉబికివస్తోంది. వారం క్రితం వరకు వానల కోసం ఎదురుచూస్తున్న రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు మెట్టపంటలకు మేలు చేస్తుండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నాటిన వరి నారుకు ఎరువులు చల్లుతున్నారు. పలుచోట్ల నాటు వేసే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుమండలాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి జూలై 22 వరకు సాధారణ వర్షపాతం 5,807.8 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 10,177.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 75.2 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. 

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి, సూర్యాపేట)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలోని పలు మండలాల్లో సరిపడా వర్షాలు లేకపోవడంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. భారీ వర్షాలకోసం ఎదురుచూశారు. నాలుగు రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం సీజన్‌లో సాధారణంగా జిల్లాలో జూలై నెల 20వ తేదీ నాటికి 200.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి గానూ 381.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో భరోసా కలిగింది. జూలై నెలాఖరు నాటికి పంటలు విత్తుకునే వీలుండటంతో వరితోపాటు పత్తి, ఇతర ఆరుతడి పంటలను సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా వరినాట్లు ఊపందుకున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరినాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పంటలను సాగుచేసిన రైతులు కలుపుతీయడం, ఎరువులు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 4.50లక్షల వరకు పలు పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనావేశారు. ఇప్పటివరకు దాదాపు 3లక్షల ఎకరాల వరకు పంటలను సాగుచేశారు. వీటిలో వరి 1,09,682 ఎకరాలు, కందులు 29,934 ఎకరాలు, పెసర 139ఎకరాలు, ఉలువలు 5.2ఎకరాలు, వేరుశనగ 4ఎకరాలు, ఆముదం రెండు ఎకరాలు, జొన్నలు 441ఎకరాలు, కూరగాయలు, గడ్డి, తదితర పంటలు 1765 ఎకరాల్లో సాగుచేశారు. వారం పది రోజుల్లోగా 1.50లక్షల ఎకరాల్లోనూ పంటలు సాగు చేసే అవకాశం ఉందని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి కె.అనురాధ పేర్కొంటున్నారు. 


1156.2 ఎకరాల్లో నీట మునిగిన పంటలు

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటపొలాల్లోకి నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా 1156.2 ఎకరాల్లో వరి, పత్తిపంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు నివేదికను రూపొందించారు. వర్షాలతో బీబీనగర్‌లో 732 ఎకరాల వరి పంట నీటమునిగింది. వలిగొండలో 120 ఎకరాలు, పోచంపల్లిలో 53 ఎకరాలు, యాదగిరిగుట్టలో 22 ఎకరాలు, చౌటుప్పల్‌లో 185 ఎకరాలు, ఆత్మకూరులో 9.2ఎకరాలు, భువనగిరిలో 15 ఎకరాలు, రామన్నపేటలో 20ఎకరాల వరకు వరిపంట నీట ము నిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 15ఎకరాల్లో పత్తిపంట నీట మునిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పొలాల్లో అధికంగా నీరు చేరితే, వరి కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సగటున 27.8మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తుర్కపల్లి మండలంలో 42.6 మి.మీ, అత్యల్పంగా బీబీనగర్‌లో 14.8మి.మీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలంలో 80 మి.మీలు, అనంతగిరి మండలంలో 85, నడిగూడెం మండలంలో 109 మి.మీల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే సెల్‌:6281492368, 6300957120కు సమాచారం ఇవ్వాలని వివరించారు. వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి కత్వలు, కాల్వల ద్వారా నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో మూసీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాల్లోని చెరువులు అలుగుపోస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షాలకు పట్టణాల్లోని అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 


సూర్యాపేట జిల్లా నుంచి యాదాద్రికి కూలీలు

కరోనా కారణంగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనుల్లేక సుమారు 100 కిలోమీటర్ల దూరం వెళ్లి పనులు చేస్తున్నారు. వానాకాలంలో ప్రాజెక్టుల కింద పంటల సాగు ఆలస్యం కానుండటంతో కూలీలు సూర్యాపేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతాలకు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ కింద పొలాలను సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడేనికి చెందిన కూలీలు ఎకరాకు రూ.5వేలకు గుత్తకు తీసు కొని నాట్లు వేస్తున్నారు. సమీపంలోని రేకుల షెడ్లలో ఆవాసం ఉండి వరినాట్లు ముగిసే వరకు ఇక్కడే ఉపాధి పొందుతామని కూలీలు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-07-24T06:47:39+05:30 IST