‘వ్యయ’సాయం!

ABN , First Publish Date - 2021-05-07T04:28:15+05:30 IST

2008లో రూ.485 ఉన్న డీఏపీ ధర 2021కి మూడింతలు పెరిగి రూ.1900కు చేరుకోగా ఆ ఏడాదిలో ఉన్న దాన్యం ధర రూ.10వేలు కాగా ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధరే రూ.16048 ఉంది. ఇదికూడా 80శాతం మంది రైతులకు లభించగాక చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.

‘వ్యయ’సాయం!
కాంప్లెక్స్‌ ఎరువులు

భారీగా పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధర

బస్తా డీఏపీ రూ.1200 నుంచి 1900లకు..

అన్ని రకాల పాస్ఫేట్‌ ధర రూ.350 నుంచి 700 పెంపు

ఎన్నికలు పూర్తయ్యాక బాంబు పేల్చిన కేంద్రం

డీజిల్‌ ధర పెంపుతో భారీగా పెరిగిన పెట్టుబడులు

అందుకు తగ్గట్టు ఉత్పత్తులకు అందని ‘మద్దతు’

 

2008లో 50కిలోల డైథియమ్‌ పాస్పేట్‌ (డీఏపీ) కాంప్లెక్స్‌ ఎరువు ధర రూ.485. అప్పట్లో పుట్టి ధాన్యం (850కిలోలు) ధర రూ.10వేలు. తాజాగా ఇదే రకం ఎరువు  ధర రూ.1900. పుట్టి దాన్యం ప్రభుత్వ మద్దతు ధర రూ.16,048.  కానీ ఈ మద్దతు ధరకు కూడా రకరకాల ఆంక్షలు పెట్టడంతో 20 శాతం మంది రైతులకు మాత్రమే దక్కుతోంది... మిగిలిన 80శాతం మంది రైతులకు దక్కే ధర కేవలం రూ.13వేలు మాత్రమే. ఇప్పుడయితే రూ.10వేలు మాత్రమే. ఈ ధరకు కూడా బతిమలాడి దళారులకు ఇవ్వాల్సి వస్తోంది. ఇదీ ధాన్యం పండించే రైతు ప్రస్తుత పరిస్థితి. 

జలదంకి, మే 6 : 2008లో రూ.485 ఉన్న డీఏపీ ధర 2021కి మూడింతలు పెరిగి రూ.1900కు చేరుకోగా ఆ ఏడాదిలో ఉన్న దాన్యం ధర రూ.10వేలు కాగా ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధరే  రూ.16048 ఉంది. ఇదికూడా 80శాతం మంది రైతులకు  లభించగాక చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్క వరిసాగులోనే కాదు.. ఆపరాలు, కూరగాయలు, పండ్లతోటలు, పత్తి తదితర అన్ని పంటల సాగులో పెట్టుబడులు అమాంతం పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది. నిన్నటివరకు ఉన్న కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు చూసుకుంటే డీఏపీ రూ.1200 నుంచి ఏకంగా బస్తాకు రూ.700 పెరిగి రూ.1900కు చేరుకుంది. మిగతా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలూ భగ్గుమంటున్నాయి. 20-20-0-13 రకం ఽరూ.975 ఉండగా రూ.1350లకు, 12-32-16  రకం రూ.1185 నుంచి రూ.1800లకు, 10-26-26  రకం రూ.1175 నుంచి రూ.1775లకు, 16-20-0-13 రకం రూ.935 నుంచి రూ.1310లకు, బోరానేటెడ్‌ ఎన్‌పికె-12 రకం రూ.1230 నుంచి రూ.1845కు పెంచుతూ కేంద్ర ఫర్టిలైజర్‌ మార్కెంటింగ్‌ డివిజన్‌ అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరుగుదల కారణంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచినట్లు కేంద్రం పేర్కొంది. ఇక వ్యవసాయంలో ప్రదానంగా ఉపయోగించే పురుగుమందులు విషయానికొస్తే  2008 నాటికి 2021కి ధరలు లీటరు క్రిమిసంహారక మందుకు రెట్టింపు అటుంచి 300శాతం పెరిగిపోయాయి.


పెరిగిన పెట్టుబడులు


ఏ పంట సాగు చేసినా ఎరువులు వాడకం తప్పనిసరి. అదేవిధంగా భూమి దుక్కులు దున్నేందుకు, పురుగుమందుల పిచికారీ దగ్గర నుంచి వ్యవసాయ కూలీలను పొలాల్లోకి తరలించడం నుంచి ప్రతి పనికి పంట కోత, పంట దిగుబడులు  ఇళ్లకు చేర్చడం మండీలకు వెళ్ళి అమ్ముకునేంత వరకు ట్రాక్టర్‌ వాడకం తప్పనిసరి. ఈ ట్రాక్టర్‌ బాడుగ డీజిల్‌ ధరతో పోల్చుతూ అధికంగా వసూలు చేస్తారు. అంటే డీజిల్‌ ధర పెరిగినప్పుడల్లా పెట్టుబడులు దానంతట అవే పెరిగిపోతున్నాయి. ఇలా ఎరువులు, పెట్రోధరలు తరచూ పెరుగుదల కారణంగా వ్యవసాయంలో పెట్టుబడులు మూడింతలు పెరిగి ఎకరా వరిసాగుకు గత ఏడాది రబీసీజన్‌లో రూ.30వేలు కాగా ఈ దఫా రూ.40వేలు దాకా కానున్నాయి. ఈ రకంగా చూస్తే ఎకరం భూమిలో వరిసాగు చేపడితే 3పుట్ల ధాన్యం దిగుబడి వస్తుంది. మూడు పుట్ల ధాన్యం అమ్మితే ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రూ.48వేలు. అదే బయట దళారికి అమ్మితే  రూ.39 వేలు.


కౌలు రైతులదీ మరీ దారుణం


 ఇక కౌలురైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒక ఎకరాలో వచ్చిన దిగుబడిలో పుట్టి ధాన్యం కౌలు ఇవ్వగా మిగిలిన రెండు పుట్లు అమ్మితే వచ్చేది రూ.26వేలు. కొంత మందికి రూ.20 వేలు కూడా రావడం లేదు. పెట్టుబడులు కూడా దక్కకపోగా నష్టాలే మిగులుతున్నాయి. 




Updated Date - 2021-05-07T04:28:15+05:30 IST