నాటికీ, నేటికీ.. తేడా చూడండి!

ABN , First Publish Date - 2022-05-17T09:17:19+05:30 IST

‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం నాది. రైతులకు హామీ ఇచ్చి మాట తప్పిన నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి తగునా’ అని సీఎం..

నాటికీ, నేటికీ.. తేడా చూడండి!

ఈ మూడేళ్లలో కరువే లేదు!!

ఏటా 50 లక్షల మందికి రైతు భరోసా

రైతుకు మాటిచ్చి తప్పిన నాయకుడు అవసరమా?

మా పారదర్శక పాలనలో దత్తపుత్రుడి పరామర్శలా?

ఏలూరు సభలో సీఎం జగన్‌ ఆగ్రహం


ఏలూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం నాది.  రైతులకు హామీ ఇచ్చి మాట తప్పిన నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి తగునా’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలన-తన మూడేళ్ల పాలన మీరే చూడాలని ప్రజలను కోరారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలోని మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం-2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కొక్కరికీ రూ.7,500కు గాను రూ.5,500ను బటన్‌ నొక్కి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన కంటే మూడేళ్లలో తన ప్రభుత్వం గొప్పగా పాలన చేసిందని ఆయన చెప్పారు. ‘రైతు భరోసా రూ.13,500ను ఏటా మూడు విడతల్లో అందిస్తున్నాం.


ఏటా 50 లక్షల మందికి సుమారు రూ.7 వేల కోట్లు ఇస్తున్నాం. ప్రస్తుతం ఇస్తున్న రూ.3,758 కోట్లతో కలిపి ఇప్పటిదాకా రూ.23,875 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి మళ్లించాం. నా ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో ఎక్కడా కరువు లేదు. ఏ ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించలేదు. కరువు జిల్లా అయిన అనంతపురంలోనూ భూగర్భ జలాలు పెరిగాయి. చంద్రబాబు హయాంలో 154 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు 170 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు మంచి చేయాలని ఆలోచిస్తున్నా.. దురదృష్టవశాత్తు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ఆ కుటుంబాలను వదిలేయలేదు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న అందరికీ రూ.7 లక్షలు ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో అప్పటికీ, ఇప్పటికీ తేడా చూడండి’ అని ప్రజలను కోరారు. ప్రసంగం ఆసాంతం.. రెండు పాలనల్లో తేడా గుర్తించాలని ఆయన పదేపదే కోరడం గమనార్హం.


పరిహారం అందని వారు లేరు!

సీఎం మరోసారి ‘ఆంధ్రజ్యోతి’, పవన్‌ కల్యాణ్‌పై అక్కసు వెళ్లగక్కారు. మూడేళ్లగా పారదర్శక పాలన అందిస్తున్నా.. ఆంధ్రజ్యోతి, కొన్ని మీడియా సంస్థలు తనపై బురద జల్లుతున్నాయని.. దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ‘చంద్రబాబుకు దత్తపుత్రుడైన ఓ పెద్దమనిషి రైతుల పరామర్శకు బయల్దేరాడు. ఆ పరామర్శలో పట్టాదారు పాస్‌ పుస్తకం ఉండి, రూ.7 లక్షలు నష్టపరిహారం దక్కని ఒక్క కుటుంబాన్నీ చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా.. ఈ రోజు ప్రశ్నిస్తున్నానని చెప్పుకొంటోన్న ఆ దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు’ అని సీఎం అడిగారు. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పవన్‌, లోకేశ్‌కు పది రకాల పంటలు చూపిస్తానని.. వాటిలో ఏ ఐదు పంటల పేర్లయినా చెప్పగలరా అని ప్రశ్నించారు.


సభ కోసం పరీక్ష కేంద్రం మార్పు

సభ ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలో సోమవారం నుంచే ఆంధ్రా యూనివర్సిటీ డిగ్రీ తొలి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే సభను ఈ కళాశాల మైదానంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్షలను మూడు రోజుల కిందే స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలోకి మార్చారు. వర్సిటీ అధికారుల అనుమతి తీసుకున్నాకే పరీక్షా కేంద్రాన్ని మార్చామని కళాశాల ప్రిన్సిపాల్‌ మధురాజు తెలిపారు.

Updated Date - 2022-05-17T09:17:19+05:30 IST