ltrScrptTheme3

రైతు‘బంద్‌’

Oct 21 2021 @ 23:52PM
మార్టూరులోని ఏఎంసీ గోదాము (ఫైల్‌)

అన్నదాతకు పంట ఉత్పత్తుల నిల్వ కష్టాలు

ఏఎంసీల్లో అటకెక్కిన రైతుబంధు పథకం

2020--21 ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా దక్కని రుణం

నిధుల సాకుతో అన్నదాతలకు మొండిచేయి

గోడౌన్లకు తప్పనిసరిగా రైతులు అద్దె చెల్లించాల్సిందే

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 21: 

 సాగుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలకు కోతపెట్టిన ప్రభుత్వం పైకి మాత్రం రైతు సంక్షేమం అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోంది. రైతు పథకాలు ఒక్కొక్కటిగా నిలిపేస్తోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రైతుబంధు పథకం. ఇంతటి బృహత్తర పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిధుల సాకుతో మూలన పడేసింది. పైగా ఉన్న గోడౌన్లను ఆదాయం కోసం టెండర్ల రూపంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు ఆర్‌బీకేల పరిధిలో ఒక్కో గిడ్డంగిని రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామనే వంచన మాటలు చెబుతోంది. కొవిడ్‌ సంక్షోభంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అంతోఇంతో ప్రయోజనం చేకూర్చే రైతుబంధు లాంటి పథకాలకు కూడా ప్రభుత్వం మంగళం పాడుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు అధికంగా చెల్లించి తమ ఉత్పత్తులను ప్రైవేటు గోడౌన్లలో నిల్వ చేసుకోలేక అయినకాడికి అమ్ముకుంటున్నామని చిన్న, సన్నకారు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

 

పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో సరైన ధర లేకపోతే అందిన కాడికి తమ ఉత్పత్తులను అన్నదాత అమ్ముకోకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొన్ని సవరణలతో రైతుబంధు పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏఎంసీ గోడౌన్లలో తమ ఉత్పత్తులను నిల్వ చేసుకున్న రైతులకు రుణ సదుపాయాన్ని కల్పించేది. నిల్వ చేసిన దిగుబడుల విలువలో 75శాతం వరకు రుణాన్ని అందించేవారు. ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ కూడా ఈ రుణంపై ఉండేది కాదు. వడ్డీ లేని రుణం కూడా అందడంతో గిట్టుబాటు ధర వచ్చేవరకు చిన్న, సన్నకారు రైతాంగం ధీమాగా ఉండేది. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పక్కనపడేసింది.  2019-20 సంవత్సరంలో నామమాత్రంగా 37మంది రైతులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తే, 2020-21లో పూర్తిగా అటకెక్కించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుబడులు చేతికొచ్చేటప్పటికీ అయినా రైతుబంధును పునరుద్ధరించకపోతారా.. అని జిల్లా రైతాంగం ఆశగా  ఎదురుచూస్తోంది

గడచిన నాలుగేళ్లలో పథకం తీరిలా......

జిల్లాలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంతమాగులూరు, పర్చూరు, దర్శి, అద్దంకి, చీరాల, కొండపి, మార్కాపురం మార్కెట్‌ కమిటీల్లో రైతుబంధు పథకాన్ని అమలుచేశారు. 163మంది రైతులకు రూ.1.79కోట్లను రుణాలుగా అప్పటి ప్రభుత్వం అందించింది. 2018-19కు గాను కందుకూరు, పర్చూరు, దర్శి, అద్దంకి, చీరాల, కొండపి, మార్కాపురం కమిటీల పరిధిలోని 311మంది రైతులకు లబ్ధి చేకూరింది. వారికి అందించిన రుణాల మొత్తం రూ.2.90 కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరిన 2019--20 విషయానికొస్తే కేవలం పర్చూరు, అద్దంకి మార్కెట్‌ కమిటీలకే రైతుబంధును పరిమితం చేశారు. మొక్కుబడిగా 37మంది రైతులకు రూ. 49లక్షలను మాత్రమే అందించి రైతుల ప్రయోజనాలకు గండికొట్టారు. 2020-21లో పూర్తిగా పథకాన్ని మూలన పడేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో దిగుబడులు రావడం ప్రారంభమయ్యాయి. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలో అయినా మళ్లీ పథకాన్ని అమలులోకి తీసుకువస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా రైతాంగం ఆశపడుతోంది.

గోడౌన్లలో నిల్వ చేసుకుంటే రుణాలు

రైతుబంధు పథకం కింద తమ దిగుబడులను ఏఎంసీ గోడౌన్లలో నిల్వ చేసుకోవడం వల్ల రైతులకు రుణసౌకర్యం అందేది. పంట విలువలో 75శాతం వరకు రుణాన్ని గత ప్రభుత్వం అందించేది. నిల్వచేసిన నాటి నుంచి ఆరునెలల కాలం వరకు ఎలాంటి వడ్డీ భారం లేకపోవడంతో పాటు ఆపై మూడు నెలల వరకు నామమాత్రపు వడ్డీని మాత్రమే తీసుకునేవారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వంటి వాటితో గోడౌన్‌లోని పంట దెబ్బతింటే బీమా పొందే వెసులుబాటు సైతం గత ప్రభుత్వం కల్పించింది..

ఆదాయం కోసం రైతాంగం ప్రయోజనాలకు పాతర...

ప్రభుత్వం ఆదాయం కోసం రైతాంగ ప్రయోజనాలకు నిలువునా పాతరేస్తోంది. జిల్లాలో ఏఎంసీల పరిధిలో మొత్తం 78 గోదాములు ఉన్నాయి. వీటిలో సగంపైనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ అద్దెకు తీసుకుని ఉపయోగించుకుంటున్నాయి. మిగతావి రైతుబంధు పథకం కింద అన్నదాతలకు గతంలో ఉపయోగపడేవి. ప్రస్తుత ప్రభుత్వం ఆదాయం కోసం వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చే ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే  ఉన్న గిడ్డంగులను  ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఆర్‌బీకేల పరిధిలో గోదాములు అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకివ్వడం దేనికో..., కొత్తవి నిర్మాణం ఎందుకో పాలకులకే అర్థం కావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలకు చెల్లుచీటి ఇచ్చి జిల్లాలోని రైతాంగం ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా రైతుబంధు పథకాన్ని తిరిగి ఉనికిలోకి తేవడంతోపాటు గోదాములను కూడా రైతాంగ ప్రయోజనాలకోసమే ఉంచాలని అన్నదాతలు, రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు

రైతుబంధు పథకం అవసరం ఉంది 

ప్రస్తుత పరిస్థితుల్లో రైతుబంధు లాంటి పథకం అవసరం రైతాంగానికి ఎంతైనా ఉంది. ఈ విధంగా నిర్వీర్యం చేయడం తగదు. సరైన ధర వచ్చేవరకు గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవడంతో పాటు రుణం పొందే అవకాశాన్ని కూడా జిల్లా రైతాంగం కోల్పోతోంది. రైతులకు తిరిగి ఆ వెసులుబాటు కల్పించే విధంగా పథకం పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

-చుండూరి రంగారావు, సంయుక్త కిసాన్‌మోర్చా జిల్లా కన్వీనర్‌ 

గిట్టుబాటు ధర లభించడం లేదు 

రైతులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు. గతంలో ధర వచ్చే వరకు రైతుబంధు పథకం కింద చిన్న, సన్నకారు రైతులు ఏఎంసీల్లో తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేవారు. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు. ఇప్పటికే కరోనాతో రైతాంగం కుదేలైంది. ఉపయుక్తమైన ఇలాంటి పథకాలను సైతం ప్రభుత్వం విస్మరించడం భావ్యం కాదు.

 -దుగ్గినేని గోపీనాథ్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.