అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-01T04:45:52+05:30 IST

పంటల సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో మనస్థాపం చెందిన అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మృతి చెందిన రైతు మారపరెడ్డి (ఫైల్‌)

బంగారువాండ్లపల్లెలో విషాదం

ములకలచెరువు, జూన్‌ 30: పంటల సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో మనస్థాపం చెందిన అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలోనే గడ్డి మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కఽథనం మేరకు... ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దవుల మారపరెడ్డి (52)కు మూడెకరాల పొలం ఉంది. తన మూడు ఎకరాల పొలంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాలలో సాగు చేసిన మల్బరీ (రేషన్‌) పంట సాగు చేసి మిగిలిన రెండెకరాల్లో టమోటా పంట సాగు చేశాడు. మల్బరీ పంటలో నష్టం రావడంతో ఏడాది క్రితం పంటను దున్నేశాడు. అలాగే ఐదు నెలల క్రితం సాగు చేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పట్లో పంటను కోయకుండా పొలంలోనే వదిలేశాడు. పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. ప్రస్తుతం టమోటాకు గిట్టుబాటు ధర ఉండడంతో సాగు చేసేందుకు సన్నద్ధమయ్యాడు. రెండు ఎకరాలను సిద్ధం చేశాడు. మూడు సంవత్సరాలుగా పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు భారంగా మారడంతో మనస్థాపం చెంది బుధవారం పొలంలోనే గడ్డి మందు తాగి అపస్మారక స్ధితికి చేరాడు. గమనించిన కుటుంబీకులు చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంలో వైద్యుల సూచనల మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని గురువారం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సరోజమ్మ, కుమారుడు బయ్యారెడ్డి ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డీవై స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-01T04:45:52+05:30 IST