మళ్లీ మునిగారు!

ABN , First Publish Date - 2020-09-23T07:26:25+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కోన సీమలోని వివిధ ప్రాంతాల్లో పంట చేలు ముంపులో ఉన్నాయి. దాంతో అన్న దాతలు విలవిల్లాడిపోతున్నారు. చేలల్లో ఎక్కడ

మళ్లీ మునిగారు!

భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలు

మొన్న వరద కష్టం.. నేడు వర్షాల నష్టం..

ముంపులోనే వందల ఎకరాల పంటచేలు

రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల వినతి


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కోన సీమలోని వివిధ ప్రాంతాల్లో పంట చేలు ముంపులో ఉన్నాయి. దాంతో అన్న దాతలు విలవిల్లాడిపోతున్నారు. చేలల్లో ఎక్కడ నీరు అక్కడే ఉండడంతో పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నా యని ఆందోళన చెందుతున్నారు. ప్రధా నంగా మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లతోపాటు బోదెలు ఎక్కడికక్కడే ఆక్రమణలకు గురి కావడంతో ముంపునీరు దిగేమార్గం లేక చేలల్లోనే నిలిచిపోతోంది. దానికితోడు గత పది రోజులుగా రికార్డు స్థాయిలో కురి సిన వర్షాలకు ఖరీఫ్‌ సాగులో రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వరదల కారణంగా గోదావరి నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల వాటికి అనుసంధానంగా ఉన్న డ్రెయిన్లన్నీ ఉప్పొంగిపోయాయి. దీంతో డ్రెయిన్ల పరీవాహక పంట పొలాలన్నీ ఇప్పటికే ముంపుబారిన పడ్డాయి. వర్షపునీరు చేలల్లో నిల్వ ఉండడంతో వరి కంకులు ఎదుగుదల పూర్తిగా మందగించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


కోనసీమలోని ప్రధానమైన కూనవరం, వాసాలతిప్ప, దేశికోడు, లోయర్‌కౌశిక, అప్పర్‌కౌశిక, కుమ్మరికాల్వ, దసరాబుల్లోడు కోడు వంటి అనేక మేజర్‌ డ్రెయిన్లలో ముంపునీటి ప్రవాహం దిగే మార్గాలు మూసుకుపోవడంతో పంట చేలల్లో నీరు నిలిచిపోతోంది. ముఖ్యంగా కుమ్మరికాల్వ డ్రెయిన్‌ కారణంగా అమలాపురం రూరల్‌ మండలం పరిధిలోని నల్లమిల్లి, జనుపల్లి, ఎ.వేమవరం, నల్లచెరువుతోపాటు అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న వందలాది ఎకరాల భూములు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. అదేవిధంగా కూనవరం మేజర్‌ డ్రెయిన్‌, వాడపర్రు పంటకాల్వను ఆనుకుని ఉన్న సుమారు 200 ఎకరాల పంటచేలు ఇంకా నీట మునిగే ఉన్నాయి.


ఆక్వా సేద్యం వల్ల మురుగునీటి కాల్వలు ఆక్రమణకు గురికావడంతో ముంపు నీరు చేలల్లోంచి దిగే మార్గాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే వరదల వల్ల వందల ఎకరాల్లో ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడు భారీవర్షాల తాకిడికి చేలల్లో నీరు నిలిచిపోయి ఖరీఫ్‌ పంటకు తీవ్రనష్టం కలిగిస్తోంది. వర్షాలు వల్ల పంట నష్టపోయిన రైతుల దుస్థితిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి ఆదుకోవాలని రైతు నాయకుడు మట్టా మహలక్ష్మిప్రభాకర్‌ కోరారు. 

Updated Date - 2020-09-23T07:26:25+05:30 IST