రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి

ABN , First Publish Date - 2020-12-02T05:48:04+05:30 IST

వరద ముంపుకు గురై రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని మిన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు.

రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన


పాపన్నపేట, డిసెంబరు 1: వరద ముంపుకు గురై రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని మిన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. మెదక్‌–బొడ్మట్‌పల్లి రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంజీరా నది ఉప్పొంగి ప్రవహించడంతో నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ తమ పొలాలను ముంచేసిందని పేర్కొన్నారు. పంట చేతికొచ్చే సమయంలో ముంపుకు గురైన ధాన్యం రంగు మారిపోయిందన్నారు. ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వడ్లను సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతో పడిగాపులు పడాల్సి వస్తున్నదని వారు వాపోయారు. దొడ్డు వడ్లకు, సన్న వడ్లకు ఒకే ధర ఉండటం ఎప్పుడైనా జరిగిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ సూచన మేరకు సన్నరకం వరి పండిస్తే దిగుబడి లేక, మద్దతు ధర లభించక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వడ్లకు అధిక ధర చెల్లించి ప్రభుత్వమే సేకరించాలని కోరారు. రైతుల ధర్నాతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పాపన్నపేట హెడ్‌కానిస్టేబుల్‌ సంగయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా వినని రైతులు ఆర్డీవో, తహసీల్దార్‌ రావాల్సిందేనని భీష్మించారు. అధికారులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలియజేసిన పోలీసులు, ఫోన్‌లో మెదక్‌ ఆర్డీవో సాయిరాంను రైతులతో మాట్లాడించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలిస్తామని, మండల పరిధిలో వరద ముంపుకు గురై రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.

Updated Date - 2020-12-02T05:48:04+05:30 IST