రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-02T06:50:51+05:30 IST

అప్పుల బాధ తాళలేక మండలంలోని లచ్చుంపల్లె గ్రామానికి చెందిన రైతు దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
మృతురాలు మాదేవి (ఫైల్‌), రామక్రిష్ణ (ఫైల్‌)

  1. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం 

డోన్‌(రూరల్‌), మార్చి 1: అప్పుల బాధ తాళలేక మండలంలోని లచ్చుంపల్లె గ్రామానికి చెందిన రైతు దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రామక్రిష్ణ అనే రైతుకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. దీనికితోడు మల్లెంపల్లెలో నాలుగెకరాలు, ఎర్రగుంట్లలో మరో పదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్న పొలాల్లో బోర్లు వేయించడానికి అప్పులు చేశాడు. బోర్లలో సరైన నీరు పడకపోవడంతో మూడేళ్లుగా వర్షాధారంగా కౌలు భూములలో ఉల్లి, మిర్చి టమోట, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఏటా పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు రూ.15 లక్షలకు పైగా పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో భార్యాభర్తలకు మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి పంటల కోసం తెచ్చుకున్న పురుగు మందును భార్యాభర్తలు ఇంట్లోనే తాగారు. చుట్టుపక్కల వారు వారిని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మాదేవి (36) కోలుకోలేక మృతి చెందింది. రామక్రిష్ణ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామక్రిష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగన్మోహన్‌ పదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు రామలింగం 8వ తరగతి చదువుతున్నాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T06:50:51+05:30 IST