రైతన్న పొలం బాట

ABN , First Publish Date - 2022-06-27T05:48:17+05:30 IST

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తా చల్లబడింది. ఆకాశం మేగావృతమవుతూ చిరుజల్లులు పడుతుండడంతో రైతన్నల్లో ఆనందం నెలకొంటుంది. వానాకాలం సాగుకు సిద్ధమవుతూ రైతన్నలు పొలం బాట పడుతున్నారు.

రైతన్న పొలం బాట
జిల్లాలో ఎడ్ల నాగలితో దుక్కులు దున్నుతున్న దృశ్యాలు

- వానాకాలం పంట సాగులో నిమగ్నమైన జిల్లా రైతులు 

- జిల్లాలో కురుస్తున్న వర్షాలు

- ఇప్పటి వరకు 142.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

- పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాలను విత్తుతున్న రైతులు

- నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు

- బాన్సువాడ డివిజన్‌లో మొదలైన వరి నాట్లు

- ఈ సీజన్‌లో 5.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం


కామారెడ్డి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తా చల్లబడింది. ఆకాశం  మేగావృతమవుతూ చిరుజల్లులు పడుతుండడంతో రైతన్నల్లో ఆనందం నెలకొంటుంది. వానాకాలం సాగుకు సిద్ధమవుతూ రైతన్నలు పొలం బాట పడుతున్నారు. తొలకరి జల్లులు పడడంతో పంటల సాగుకు దుక్కులు దున్నుతూ నేలను చదును చేస్తున్నారు. బోరు బావుల కింద వరి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పు దినుసులు అలికేందుకు గ్రామీణ రైతులు నాగళ్లతో నల్లరేగళ్లను దున్నుతూ విత్తనాలను విత్తుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 142.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇటు రైతులు, ప్రజలు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జిల్లా యంత్రాంగం సైతం వానాకాలం సాగు కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ వానాకాలంలో 5.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ ప్రణాళికకు తగ్గటుగా సబ్సిడీ విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతుబంధు డబ్బులను ఖాతాలో జమ చేయకపోవడం, యాసంగిలో అమ్మిన ధాన్యం డబ్బులు రాకపోవడంతో పంటల సాగు పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

దుక్కులు దున్నుతూ.. నారుమళ్లు సిద్ధం చేస్తున్న రైతులు

వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెలరోజులు కావస్తోంది. వారం రోజుల నుంచి జిల్లాలో సాధారణం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడడం, ఆకాశం మొత్తం మేఘావృతం అవుతూ వస్తోంది.  జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. విత్తనాలను విత్తుకోవడానికి ముందస్తుగానే తెచ్చి పెట్టుకున్నారు. తొలకరి జల్లులు కురవడంతో పంట పొలాల్లో దుక్కులను దున్నుతూ భూమిని చదును చేస్తున్నారు. పత్తి, సోయా, పప్పు దినుసులు, మొక్కజొన్న లాంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, బిచ్కుంద, జుక్కల్‌, పిట్లం, మద్నూర్‌ లాంటి మండలాల్లో రైతులు సోయ, పత్తి, మొక్కజొన్న విత్తనాలను విత్తుతున్నారు. అదేవిధంగా  భూసారం పెంచేందుకు జీలుగు, జనుము లాంటి, పచ్చిరొట్టె ఎరువులను వేస్తున్నారు. బోరు బావుల కింద వరి నారుమళ్లను నీటితో పెట్టి డ్రమ్ము చేయిస్తున్నారు. వరి విత్తనాలు మొలకెత్తగానే వాటిని చల్లేందుకు రైతులు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు.




ఇప్పటి వరకు జిల్లాలో 142.8 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లాలో జూన్‌ మాసంలో ఇప్పటి వరకు 142.8 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. గత 4 రోజుల నుంచి జిల్లాలోని ఆకాశం మేఘావృతం కావడంతో చిరుజల్లులు పడడంతో వాతావరణం చల్లబడుతోంది. ఆదివారం జిల్లాలో 31.0 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఈ జూన్‌ నెలలో ఇప్పటి వరకు మండలాల వారీగా కురిసిన వర్షపాతం ఇలా ఉంది. మద్నూర్‌లో 248.4 మిల్లీమీటర్లు, బీర్కూర్‌లో 196.4, జుక్కల్‌లో 154.2, బాన్సువాడలో 233.8, సదాశివనగర్‌లో 142.0, బిచ్కుందలో 106.8, నిజాంసాగర్‌లో 136.8, దోమకోండలో 170.4, మాచారెడ్డిలో 143.6, తాడ్వాయిలో 156.0, కామారెడ్డిలో 119.2, పిట్లంలో 145.2, గాంధారిలో 144.0, భిక్కనూరులో 197.8, నాగిరెడ్డిపేట్‌లో 186.4, ఎల్లారెడ్డిలో 104.2, లింగంపేట్‌లో 81.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

5.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం

జిల్లా వ్యవసాయశాఖ సైతం వానాకాలం పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే వానాకాలంలో 5.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వరి 2,48,150 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, మొక్కజొన్న 86,205 ఎకరాలలో, పత్తి 73,545 ఎకరాలలో, సోయాబిన్‌ 72,878 ఎకరాలలో, కందులు 22,151 ఎకరాలలో, పెసర్లు 10,900 ఎకరాలలో, మినుములు 10,500 ఎకరాలలో, చెరుకు 4,100 ఎకరాలలో, జొన్నలు 300 ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ వానాకాలం సీజన్‌లో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను సైతం అందుబాటులో జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. 60,313 క్వింటాళ్లలో వరి, 18,083 క్వింటాళ్లలో సోయాబిన్‌, 70,256 పత్తి ప్యాకెట్లు, మొక్కజొన్న 4,667 క్వింటాళ్లలో, కందులు 1,054 క్వింటాళ్లలో, పెసర 1,440 క్వింటాళ్లలో, మినుములు 880 క్వింటాళ్లలో విత్తనాలు అవసరం కానున్నాయి. అయితే ఈ విత్తనాలకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీని ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేట్‌ డీలర్ల వద్ద ఈ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున సొసైటీల ద్వారా జనుము, జిలుగు విత్తనాలను రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు సబ్సిడీపై 10,700 క్వింటాళ్లలో, జనుము, జీలుగు విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే జిల్లాలో ఎక్కువగా వరి తర్వాత సోయాబిన్‌, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తుంటారు.

పెట్టుబడుల కోసం ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావస్తోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకడం వర్షాలు పడుతుండడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పత్తి, సోయా, మొక్కజొన్న, కందులు లాంటి పంటలను సాగు చేసేందుకు విత్తనాలను విత్తుతున్నారు. వరి నారుమళ్లు సైతం సిద్ధం చేసుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అంతేకాకుండా యాసంగిలో అమ్మిన ఽధాన్యం డబ్బులు సకాలంలో రాకపోవడంతో పంట పెట్టుబడులకై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగు పెట్టుబడుల కోసం అన్నదాతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలే సాగు పెట్టుబడి ఖర్చులు రెండింతలు కావడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం ధాన్యం డబ్బులు అందిస్తే కాస్తా ఊరట ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు.

Updated Date - 2022-06-27T05:48:17+05:30 IST