అన్నదాతలో అలజడి!

ABN , First Publish Date - 2022-05-22T05:09:29+05:30 IST

జిల్లా పరిధిలో 1.96 లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయడానికి విద్యుత శాఖ రంగం సిద్ధం చేస్తోంది.

అన్నదాతలో  అలజడి!

వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఏర్పాటు

సర్వం సిద్ధం చేస్తున్న ట్రాన్సకో

ప్రభుత్వ నిర్ణయంపై కర్షకుల ఆగ్రహం


వ్యవసాయ విద్యుత సర్వీసులకు మీటర్ల ఏర్పాటు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కరెంటు వినియోగం జరుగుతోందో తెలుసుకోవడానికే అమర్చుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. ఈ మీటర్లు తమకు యమపాశాలు అవుతాయనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేని ప్రస్తుత పరిస్థితుల్లో మీటర్ల వ్యవహారం తమకు గుదిబండగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. పైగా భవిష్యత్తులో ఆర్థిక పరంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మండిపడుతున్నారు.


నెల్లూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిధిలో 1.96 లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయడానికి విద్యుత శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మీటర్ల ఏర్పాటు పూర్తి అయ్యింది. జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 


ప్రభుత్వం భరోసా ఇది 


వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత వినియోగిస్తున్నారో ఖచ్చితమైన లెక్క తేల్చడానికే మీటర్లు బిగిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు అంటున్నారు. వ్యవసాయ విద్యుత పూర్తిగా ఉచితమేనని, మీటర్ల రీడింగ్‌ ఆధారంగా వినియోగించిన విద్యుతకు సరిపడా మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుందని, ఆ ఖాతా నుంచి విద్యుత శాఖకు బదలాయించబడుతుందని అంటున్నారు. 


రైతుల వాదన ఇది


అయితే ప్రభుత్వ వాదనను రైతులు విశ్వసించడం లేదు. పైగా మీటర్ల ఏర్పాటుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్ల కోసం ప్రత్యేకంగా ఫీడర్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా మోటార్లకు ఎంత విద్యుత ఖర్చు అవుతుందో ప్రాంతాల వారీగా విద్యుత శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని 1.96 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, నెలకు 21.85 మిలియన యూనిట్లు విద్యుత వాడకం జరుగుతోంది. వినియోగపు లెక్కలు పక్కాగా ఉన్నప్పుడు మళ్లీ సర్వీసుల వారీగా మీటర్ల ఏర్పాటు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక నెలవారీ బిల్లులు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే నిర్ణయం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత సరఫరాకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటోంది. బిల్లులకు రైతులకు సంబంధం లేదు. గత 28 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ వ్యవహారాన్ని చూసుకొంటున్నాయి. ఇప్పుడు బిల్లులు రైతుల ఖాతాలకు జమ చేయాలనుకునే నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పుకున్నట్లు అవుతుంది. బిల్లులు రైతులు చెల్లించే పక్షంలో వినియోగదారుడిగా రైతులు, విక్రయదారుగా విద్యుత శాఖ మారుతుంది. పైగా నెల బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత రైతుపై పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం రైతు ఖాతాలో డబ్బులు జమ చేయని పక్షంలో ఆ కనెక్షన్లు తాత్కాలికంగా తొలగించే అధికారం విద్యుత శాఖకు లేకపోలేదు. నాలుగు రోజులు నీటి తడులు పడకుంటే చాలు పంట కోసం పడిన శ్రమ, పెట్టుబడి మొత్తం వృధా అవుతుంది. బిల్లుల చెల్లింపు ఆలస్యం అయితే ప్రభుత్వ కార్యాలయాలకే విద్యుత సరఫరా ఆపివేస్తున్న క్రమంలో రైతులు ఒక లెక్కా! 


సబ్సిడీ ‘గ్యాస్‌’గా మారితే..


వ్యవసాయ విద్యుతకు సంబంధించిన పూర్తి బిల్లు ప్రభుత్వం రైతు ఖాతాలో వేస్తుందా!? లేదా క్రమంగా తగ్గించుకొంటూ వస్తుందా!? అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి వంట గ్యాస్‌ సబ్సిడీనే ఉదాహరణగా రైతులు చూపిస్తున్నారు. గ్యాస్‌ ధర అమాంతం పెంచేసి సబ్సిడీని 18 రూపాయలకు తగ్గించారు. రేపు విద్యుత శాఖ కూడా విద్యుత ధరలు కూడా అమాంతం పెంచేసి, ప్రభుత్వం రైతు ఖాతాలో జమచేసే మొత్తాన్ని తగ్గించినా, లేదా పాత ధర ప్రకారమే జమ చేసినా రైతులపై భారం పడక తప్పదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని వ్యవసాయ మోటార్ల కరెంటు బిల్లు రూపంలో గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రమారమి 420 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు డిస్కం అధికారుల సమాచారం. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో వ్యవసాయ విద్యుత బిల్లుల భారం మోయడం సాధ్యం కాని పరిస్థితులు వస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగా, వ్యవసాయ సర్వీసులకు మీటర్ల బిగింపు పర్యవసానం ఎలా ఉంటుంది. ప్రభుత్వం విధానాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆ విధానాలేవి స్పష్టంగా తెలియజేయకుండానే, అవగాహన కల్పించకుండానే మీటర్ల బిగింపు ప్రక్రియకు రంగం సిద్ధం చేయడం పట్ల రైతు వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. 


రైతుల నెత్తిన పెనుభారం


వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల నెత్తిన భారం మోపడమే. దిగుబడి, గిట్టుబాటు ధరల్లేక ఏటా రైతు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అలాంటి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. 

- గడ్డం రవీంద్ర, మిట్టపల్లి, ఉదయగిరి



బిగిస్తే ఇబ్బందులే.. 


రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్త్తే రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు. ఇప్పటికే అతివృష్ట అనావృష్టిలతో ప్రతి ఏడాది నష్టాలపాలవుతున్నారు. పంటలు పండించుకోవడానికి చెరువుపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లమీదే ఆధార పడిన రైతులకు నాణ్యమైన విద్యుత్‌  ఇవ్వకపోవడంతోపాటు రూల్స్‌ పెట్టి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదు.

 -ముప్పవరపు కొండపనాయుడు, పోలంపాడు, కలిగిరి 



మీటర్లు బిగిస్తే రైతుకు ఉరే


వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తే రైతు మెడకు ఉరి తాడు బిగించినట్లే. నాకు తరుణవాయి పరిధిలో మోటారు పంపు సెట్‌ కింద నాలుగు ఎకరాల పొలం ఉంది. ఉచిత కరెంటు కావడంతో రబీ సీజన్‌లో వరిసాగు చేస్తున్నాం. మీటర్లు బిగించుకుంటే మొదట్లో ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందంటారు. ఆ తరువాత ముందు మీరు చెల్లించండి ఆ తరువాత మీ ఖాతాలకు నగదు జమ చేస్తామంటారు. అది జరిగితే గ్యాస్‌ సిలిండర్ల పరిస్థితే అవుతుంది.  మీటర్లు ఏర్పాటు చేస్తే వరి సాగు కాదు, బిల్లు కట్టలేక ఆరుతడి పంటలు కూడా సాగు చేయలేక సాగు మానేయాల్సిన పరిస్థితి వస్తుంది.

- గుర్తి రాజ, రైతు, తరుణవాయి/సంగం


Updated Date - 2022-05-22T05:09:29+05:30 IST