పోరు బాటలో రైతు

ABN , First Publish Date - 2022-06-28T08:58:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు.

పోరు బాటలో రైతు

బకాయిలు, బీమా పరిహారం కోసం టీడీపీ నేతృత్వంలో నిరసన


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని, అర్హులందరికీ పంట బీమా పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, బిందు, తుంపర సేద్యం పరికరాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఆకివీడులో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో రైతులు దీక్షబూనారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిని దిగ్బంధించారు.


ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటల బీమా వర్తించని రైతులందరికీ పంటనష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కదిరిలో రైతులతో కలిసి 300కు పైగా ట్రాక్టర్లతో ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.టీడీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి కపిలతీర్థం సర్కిల్లో వినూత్న నిరసన జరిగింది. పలువురు గోవింద మాల ధారణతో తిరుమల కొండవైపు చూస్తూ రాష్ట్రాన్ని కాపాడాలంటూ వేడుకున్నారు. టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ప్రసాద్‌ వెంకటేశ్వర స్వామి వేషంతో దర్శనమిచ్చి.. త్వరలోనే లోక కల్యాణం జరగబోతోందంటూ చెప్పారు.

Updated Date - 2022-06-28T08:58:25+05:30 IST