రైతు బాంధవుడు

May 7 2021 @ 04:18AM

రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్ సింగ్‌తో నాకు దాదాపు అర్ధ శతాబ్దం సంబంధాలున్నాయి. ఆయన తండ్రి చరణ్ సింగ్ 1974లో భారతీయ లోక్‌దళ్‌ను ఏర్పాటు చేసినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ శాఖకు కార్యదర్శిగా వ్యవహరించాను. చరణ్ సింగ్ కుటుంబంలో ఒకడిగా, ఆయన ఆంతరంగికుడుగా మెలిగినందువల్ల అజిత్ సింగ్‌తో కూడా నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఖరగ్‌పూర్ ఐఐటిలో పట్టభద్రుడై, అమెరికాలోని ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన అజిత్ సింగ్ ఐబీఎం కంపెనీలో పనిచేసిన తొలి భారతీయ కంప్యూటర్ నిపుణుల్లో ఒకరు. చరణ్ సింగ్ అస్వస్థతతో ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ రంగాన్ని వదిలిపెట్టి తన తండ్రికి సహాయంగా రాజకీయాల్లో ప్రవేశించారు. 1986లో అజిత్ సింగ్ రాజ్యసభలో ప్రవేశించిన ఏడాదికి చరణ్ సింగ్ కీర్తిశేషుడయ్యారు. 1988లో నేను రాజ్యసభలో ప్రవేశించిన తర్వాత ఇద్దరం కలిసి రైతులకోసం అనేక సార్లు గొంతెత్తాం. లోక్‌దళ్‌కూ, జనతాపార్టీకి అధ్యక్షుడుగా ఉన్న అజిత్ సింగ్ తన పార్టీని జనతాదళ్‌లో విలీనం చేసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1989లో లోక్‌సభకు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి కలిసికట్టుగా ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో అజిత్ సింగ్ భాగ్‌పట్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ నాయకుడిని ఎంపిక చేయడం కోసం అజిత్ సింగ్, జార్జి ఫెర్నాండెజ్ పరిశీలకులుగా లక్నోకు వెళ్లారు. నిజానికి అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెళితే ఉత్తరోత్తరా కేంద్రంలో బలీయమైన నాయకుడుగా ఎదగడగానికి ఆస్కారం ఏర్పడుతుందని అజిత్ సింగ్‌కు జార్జి సూచించారు. అందుకు అజిత్ సింగ్ సుముఖత వ్యక్తం చేయకుండా విపి సింగ్ మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా చేరడం ఆయన స్వభావానికి నిదర్శనం.


చరణ్ సింగ్ మాదిరే అజిత్ సింగ్‌ది కూడా ముక్కు సూటిగా వ్యవహరించే మనస్తత్వం. ఏడు సార్లు ఎంపీగా ఎన్నికై, విపి సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసిన అజిత్ సింగ్ సంకీర్ణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. పీవీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన చక్కెర పరిశ్రమలో భారీ పెట్టుబడులకు వీలు కల్పించే నిర్ణయాలు తీసుకున్నారు.


భారతీయ కిసాన్ కామ్ ఘార్ పార్టీ (బికెకెపి)ని అజిత్ సింగ్ స్థాపించారు. 2001 నుంచి 2003 వరకు వాజపేయి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా అజిత్ సింగ్ రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెంచేందుకు, వ్యవసాయంలో టెక్నాలజీ పాత్రను మెరుగుపరిచేందుకు ఆయన పలు చర్యలు తీసుకున్నారు. వ్యవసాయరంగంలో శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచేందుకు రుణంతో కూడిన సబ్సిడీ పథకం ప్రవేశపెట్టింది అజిత్ సింగే. భారతీయ వ్యవసాయరంగంపై ప్రపంచ వర్తక సంస్థ (డబ్ల్యుటీవో) ప్రభావంపై 2001లో అనేక విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశాల్లో ఆయన, నేను ప్రసంగించాం.


2003లో గుంటూరులో పొగాకు రైతు భవనానికి ఆయన వ్యవసాయమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చరణ్ సింగ్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ‘రైతుకు రుణాలు కావాలంటే బ్యాంకుకు సవాలక్ష దస్తావేజులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అదే ఒక వ్యాపారస్తుడు కారు కొనుక్కోవాలంటే బ్యాంకు మేనేజర్ అతడి ఇంటికే వెళ్లి కారు తాళాలు, లైసెన్స్ అప్పజెప్పే పరిస్థితి ఉన్నది’ అని అజిత్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు. ‘కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినందుకే చరణ్ సింగ్ 12సార్లు మంత్రి పదవులకు, చివరకు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తనయుడు అజిత్ సింగ్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇది కాలానికి సరిపోదేమో..’ అని నేను అదే సమావేశంలో నా ప్రసంగంలో వ్యాఖ్యానించాను. నేను అన్నట్లే సరిగా వారం తిరగకముందే అజిత్ సింగ్ వాజపేయి మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు.


దేశ సమగ్ర అభివృద్ధికి గ్రామీణాభివృద్ధే సరైన నమూనా అని అజిత్ సింగ్ విశ్వసించారు. దేశంలో కాలం చెల్లిన భూ పంపిణీ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నిత్యావసర వస్తువుల చట్టంలో చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చెరకు రైతులతో ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం వెనక్కు తగ్గేలా చేశారు. పెద్ద రాష్ట్రాలను విభజించడం వల్లనే పరిపాలనా సౌలభ్యం ఉంటుందని ఆయన విశ్వసించారు. తన తండ్రి స్థాపించిన కిసాన్ ట్రస్ట్‌కు ఆయన చైర్మన్‌గా జీవించినంతకాలం వ్యవహరించారు.


పదవులు శాశ్వతమని పట్టుకుని వేళ్లాడకుండా, నమ్మింది చెప్పడం, తన వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్లడం అజిత్ సింగ్ నైజం. మతాతీతమైన లౌకిక భావజాలం, రైతాంగ శ్రేయస్సు అజిత్ సింగ్ ఎంచుకున్న మార్గాలు. రాజకీయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు అవసరమైనప్పుడల్లా ఆయన ప్రతిఘటించారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతాంగ పోరాటం అజిత్ సింగ్ అండదండలతోనే ధర్మపోరాటంగా సార్వజనీన రూపు దాల్చింది. పంజాబ్, హర్యానాకు చెందిన సిక్కుల ఉద్యమంగానే కొంతకాలం వరకు ముద్రపడ్డ ఈ పోరాటం యుపి రైతుల ప్రవేశంతో పూర్ణత్వాన్ని సంతరించుకుంది. అజిత్ సింగ్ మంచి వక్తే కాదు, ప్రతిభావంతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయగల రచయిత కూడా. చరణ్ సింగ్ రైతాంగ విధానాలపై నేను రాసిన ‘గాంధీ పథంలో కర్షక ప్రధాని’ అన్న పుస్తకానికి అజిత్ సింగ్ పరిచయ వాక్యాలు రాయడమే కాక గుంటూరుకు వచ్చి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అజిత్ సింగ్ మృతి వ్యక్తిగతంగా నాకే కాదు దేశ రైతాంగానికి తీరని లోటు.

డాక్టర్ యలమంచిలి శివాజీ

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.