పత్తి రైతుకు ఎంత కష్టం!

ABN , First Publish Date - 2020-11-13T07:05:47+05:30 IST

పత్తి రైతు తెల్లబోయాడు. కొంత పైరును గులాబీ రంగు పురుగు తినేయగా, మిగిలిన పంటను భారీ వర్షాలు ముంచేశాయి.

పత్తి రైతుకు ఎంత కష్టం!

తొలుత గులాబీ రంగు పురుగు

ఆపై భారీవర్షాల దెబ్బ

నీరుగారిన పత్తి రైతు ఆశలు

వెలవెలబోతున్న రైతుల లోగిళ్లు

పత్తి రైతు తెల్లబోయాడు. కొంత పైరును గులాబీ రంగు పురుగు తినేయగా, మిగిలిన పంటను భారీ వర్షాలు ముంచేశాయి. ఆరేడు అడుగుల ఎత్తు పెరిగిన చేలు కకావికలమయ్యాయి. దీపావళికి పత్తి నిల్వలతో కళకళలాడాల్సిన రైతుల లోగిళ్లు వెలవెలపోతున్నాయి. కిలో దిగుబడి కూడా రాని దయనీయ దుస్థితిలో, దుఃఖాన్ని దిగమింగుతూ రైతులు పైరును దున్నేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితి మునుపెన్నడూ దాపురించలేదు.

కంచికచర్ల : జిల్లాలో ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఎకరానికి కౌలుతో కలుపుకుని 35 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. పైరు ఆరేడు అడుగుల ఎత్తు పెరిగింది. కాపు బాగుండటంతో ఈ ఏడు మంచి దిగుబడి వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఈ ఆశ ఎన్నో రోజులు నిలవలేదు. సెప్టెంబరులో గులాబీ రంగు పురుగు కనిపించింది. పురుగు నివారణకు రైతులు వేలాది రూపాయల ఖర్చు చేసి, పురుగు మందులు పిచికారి చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇంతలోనే భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురిశాయి. ఆ తరువాత కొద్ది రోజులు సూర్యుడి జాడ లేదు. గాలి లేదు.. తేమ ఆరలేదు. అడుగు భాగంలో కాయలు బూజు పట్టి మొత్తం నల్లగా మారిపోయాయి. కొన్ని కాయలు ముడుచుకుపోయాయి.  గూడ, పూత, పిందెలు కూడా రాలిపోయాయి. పచ్చగా ఉండాల్సిన తోటల రంగు మారిపోయింది. చెట్లు పూర్తిగా గిడసబారాయి. ఈలోగా మహమ్మారిలా దాపురించిన గులాబీ రంగు పురుగు ఉధృతమైంది. చెట్టుకున్న అన్ని కాయలకూ పురుగు వ్యాపించింది. ఆశలు తుడిచిపెట్టుకుపోగా, దెబ్బతిన్న పైరును రైతులు దున్నేసేందుకు ఉపక్రమించారు. 

వెలవెలపోతున్న సీసీఐ కేంద్రం

కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ నెల ఐదో తేదీన భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. వారం గడిచినా యార్డుకు కిలో పత్తి కూడా రాలేదు. పత్తి మద్దతు ధర రూ.5,850. గత సీజన్‌తో పోల్చితే మద్దతు ధర మూడు వందలు పెరిగింది. నాణ్యత లేని పత్తిని సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనదు. 

కళ తప్పిన చేలు

సాధారణంగా దీపావళికి పత్తి తీతలు ముమ్మరంగా జరుగుతుంటాయి. రైతుల ఇళ్లు పత్తి నిల్వలతో కళకళలాడుతుంటాయి. అలాంటిది ఇప్పటి వరకు కిలో పత్తి కూడా రాలేదు. కొద్ది మంది రైతులు తీస్తున్నప్పటికీ మంచి పత్తి కనిపించటం లేదు. రంగు మారిన, నాణ్యత లేని పత్తిని క్వింటా రెండు వేలకు కూడా తీసుకోవటం లేదు. కూలీల ఖర్చు కూడా రాని దుస్థితి నెలకొన్నది. పచ్చని మొక్కల మధ్య తెల్లగా మెరుస్తూ ఉండాల్సిన పత్తి నల్లగా మాడిపోయి కనిపిస్తోంది. ఇక పైరంతా గులాబీ రంగు పురుగు మయంగా మారింది. మరల కాపు వస్తుందని, మంచి పత్తి వస్తుందనే నమ్మకం లేదు. దీంతో గత్యంతర లేక  రైతులు కన్నీళ్లు పెడుతూ చేలను ట్రాక్టర్లతో  దున్నేస్తు న్నారు. 

వెలవెలపోతున్న సీసీఐ కేంద్రం

కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ నెల ఐదో తేదీన భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. వారం గడిచినా యార్డుకు కిలో పత్తి కూడా రాలేదు. పత్తి మద్దతు ధర రూ.5,850. గత సీజన్‌తో పోల్చితే మద్దతు ధర మూడు వందలు పెరిగింది. నాణ్యత లేని పత్తిని సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనదు. 


లక్షల్లో నష్టం

ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు 35 వేలు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు పది క్వింటాళ్లకు తగ్గకుండ పత్తి దిగుబడి వస్తుందని ఆశించాను. కిలో కూడా రాలేదు. రెండు లక్షలకు పైగా నష్టపోయాను. దిగుబడి వచ్చే పరిస్థితి లేనందున చేలను దున్నేశాను. శనగ లేదా తెల్లజొన్న సాగు చేద్దామనుకుంటున్నాను. - కోగంటి వీరారావు, చెవిటికల్లు


పత్తి రైతులను ఆదుకోవాలి

మెట్ట ప్రాంతంలో పత్తి రైతులకు జరిగిన నష్టం చెప్పనలవి కాదు. ఇంతటి దారుణమైన, విపత్కర పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. కిలో పత్తి కూడా రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.  పత్తి సాగు చేసిన రైతులందరూ నట్టేట మునిగారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను పాలకులు స్పందించి ఆదుకోవాలి. - నన్నపనేని నారాయణరావు, కంచికచర్ల


Updated Date - 2020-11-13T07:05:47+05:30 IST