దేవులపల్లిలో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-08T05:11:04+05:30 IST

అటవీ శాఖ పరిధిలోని భూమిలో సాగు చేసిన పంటను అధికారులు ధ్వంసం చేయగా.. యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని దేవులపల్లిలో ఆదివారం చోటు చేసుకున్నది.

దేవులపల్లిలో రైతు ఆత్మహత్యాయత్నం
పంటను ధ్వంసం చేయొద్దని అధికారుల కాళ్లు పట్టుకుంటున్న శ్రీశైలం

 30 ఏళ్లుగా అటవీ భూమిలో సాగు..

 పంటను ధ్వంసం చేసిన అధికారులు

 సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగిన రైతు

 గ్రామ సర్పంచే కారణమంటూ ఆరోపణ


కౌడిపల్లి, ఆగస్టు 7: అటవీ శాఖ పరిధిలోని భూమిలో సాగు చేసిన పంటను అధికారులు ధ్వంసం చేయగా.. యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని దేవులపల్లిలో ఆదివారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక కంసమ్మ భర్త చనిపోవడంతో తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. పేద కుటుంబం కావడంతో 30 ఏళ్ల నుంచి అటవీ శాఖ పరిధిలో కొంత భూమిని చదును చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కంసమ్మ కుమారుడు శ్రీశైలం నాలుగేళ్ల క్రితం మరికొంత అటవీ భూమిని చదును చేసి అరుతడి పంటలు వేశాడు. కాగా గ్రామ పంచాయతీ పరిధిలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు శ్రీశైలం సాగుచేసుకుంటున్న భూమిని ఎంపిక చేశారు. దీంతో శనివారం ఆ భూమిలోని మిరప పంటను ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ అధికారి రాజమణి ఆధ్వర్యంలో ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. వద్దని శ్రీశైలం వేడుకున్నా వినలేదు. అంతేకాకుండా ఫారెస్టు ఉన్నతాధికారులు శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో జింకల కంసమ్మ, శ్రీశైలం, అతడి భార్య రాధికపై ఫిర్యాదు చేశారు. 


దీంతో మనస్థాపానికి గురైన శ్రీశైలం ఆదివారం ఉదయం అదే పొలం సమీపంలో సెల్ఫీ వీడియో రికార్డు చేసి, పురుగుల మందు తాగాడు. తనపై అక్కసుతో గ్రామ సర్పంచ్‌ అటవీ అధికారులతో కలిసి రూ.50 వేలతో సాగు చేస్తున్న మిరప పంటను ధ్వంసం చేశారని వాపోయాడు. తన పిల్లలకు న్యాయం చేయాలని సెల్ఫీలో కోరాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం మెదక్‌ ఏరియా అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం కోలుకుంటున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయమై ఫారెస్టు అధికారులను వివరణ అడిగేందుకు ఫోన్‌లో యత్నించినా అందుబాటులోకి రాలేదు. కాగా మెదక్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీశైలంను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పరామర్శించారు. 


 


Updated Date - 2022-08-08T05:11:04+05:30 IST