Pappan Singh Gehlot : లాక్‌డౌన్ సమయంలో కూలీలను విమానాల్లో ఇంటికి పంపిన ఆ రైతు ఇక లేరు... దేవాలయంలో ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-24T20:34:17+05:30 IST

తనతోపాటు తనచుట్టూ ఉన్నవాళ్లు కూడా బావుండాలని కోరుకునే మంచి మనిషి ఆయన.. కొవిడ్ సమయంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ విధిస్తే తన వద్ద పనిచేసే కూలీలను దగ్గరుండి విమానం ఎక్కించి ఇంటికి పంపించి..

Pappan Singh Gehlot : లాక్‌డౌన్ సమయంలో కూలీలను విమానాల్లో ఇంటికి పంపిన ఆ రైతు ఇక లేరు... దేవాలయంలో ఆత్మహత్య

న్యూఢిల్లీ : తనతోపాటు తనచుట్టూ ఉన్నవాళ్లు కూడా బావుండాలని కోరుకునే మంచి మనిషి ఆయన.. కొవిడ్ సమయంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ విధిస్తే తన వద్ద పనిచేసే కూలీలను విమానం ఎక్కించి ఇంటికి పంపించి యావత్ దేశం ప్రశంసలు అందుకున్న ఢిల్లీ రైతు(Farmer) ‘పప్పన్ సింగ్ గెహ్లాట్’ (Pappan Singh Gehlot) ఇకలేరు(Died). 55 ఏళ్ల వయసున్న ఆయన ఢిల్లీ(Delhi)లోని అలీపోర్ ప్రాంతంలో తన ఇంటి ముందున్న దేవాలయంలో తనువు చాలించారు. ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దేవాలయంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారని తెలిపారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ లేఖ లభ్యమైందని, అనారోగ్యంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అందులో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.


కాగా పప్పన్ సింగ్ గెహ్లాట్ ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవారు. పుట్టగొడుగులు సాగు చేసిన ఆయన.. తన వద్ద పనిచేసే కూలీలతో ఉల్లాసంగా గడిపేవారు. కరోనా లాక్‌‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడరాని కష్టాలు పడ్డారు. రవాణా వ్యవస్థ మూతపడడంతో వందలాది కిలోమీటర్లు నడిచి స్వగ్రామాలకు చేరుకున్నవారు ఎందరో ఉన్నారు. కానీ పప్పన్ సింగ్ గెహ్లాట్ మాత్రం తన కూలీలను అక్కున చేర్చుకున్నారు. అందరికీ విమాన టికెట్లు కొనుగోలు చేసి.. దగ్గరుండి మరీ విమానం ఎక్కించి బిహార్‌లోని వారి స్వస్థలాలకు పంపించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగయ్యాక తిరిగి మళ్లీ విమానంలోనే వారిని ఢిల్లీకి తీసుకెళ్లడం ఆయన మంచితనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.


‘‘ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు.. ఎందుకంటే జీవితంలో అద్భుతాలు కొత్తవేమీ కాదు’’ అంటూ మే 12, 2022న ఆయన ట్వీట్‌ని అందరూ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.  ఆయన ఎంత సానుకూల దృక్పథంలో ఉండేవారో ఈ ట్వీట్‌ను బట్టి అర్థంచేసుకోవచ్చునని గుర్తుచేస్తున్నారు.

Updated Date - 2022-08-24T20:34:17+05:30 IST