కోయలేం.. తొక్కించేద్దాం

ABN , First Publish Date - 2020-11-21T06:09:01+05:30 IST

ఆరుగాలం కష్టించిన పంట పండించిన రైతుకు నష్టమే మిగిలింది. వరికోత కోసినా తాము పెట్టిన పెట్టుబడులు కాదు కదా? కనీసం ఖర్చులు కూడా రావని, దాంతో కోత కోయటం కంటే ట్రాక్టర్‌తో తొక్కించటమే మేలని రైతులంటున్నారు.

కోయలేం.. తొక్కించేద్దాం
వర్షానికి దెబ్బతిన్న వరిని పరిశీలిస్తున్న రైతులు

వరి కోత కోసినా కూలి ఖర్చులు కూడా రావు 

ప్రభుత్వమే ఆదుకోవాలి : రైతుల ఆవేదన

పెడన రూరల్‌ : ఆరుగాలం కష్టించిన పంట పండించిన రైతుకు నష్టమే మిగిలింది. వరికోత కోసినా తాము పెట్టిన పెట్టుబడులు కాదు కదా? కనీసం ఖర్చులు కూడా రావని, దాంతో కోత కోయటం కంటే ట్రాక్టర్‌తో తొక్కించటమే మేలని రైతులంటున్నారు. మండలంలో సుమారు 150 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఎకరాకు 20 వేలు రూపాయలు ఖర్చుచేశామని  పాతబల్లిపర్రు, మడక రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలినాళ్లలో దిగుబడి బాగుంటుందని భావించారు.  దాళ్వాలో కనీస ధాన్యం 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. అయితే ప్రకృతి వారి ఆశలపై నీళ్లు చల్లింది. అధిక వర్షాలతో పొలాలు నీట మునిగాయి. దీనికి తోడు మురుగు కాల్వలు సరిగా లాగకపోవటంతో పంట ముంపునకు గురైంది.  పంట ఈత దశకు చేరిన సమయంలో మళ్లీ వర్షాలు పడటంతో పంట నాశనమైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


 నేల వాలిన వరితో రెట్టింపైన ఖర్చు

తోట్లవల్లూరు : వరికోతలకు ఖర్చులు భారీగా పెరగంటతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎకరంలో వరికోత కోస్తే రూ.3,500 కూలి చెల్లించే వారు. కోతలకు ముందు ఒకరోజు గాలివాన రావటంతో వరి పొలాలు చాపలాగా నేలకు వాలిపోయాయి. దీంతో కోత రేట్లు రూ.5,000లకు పెరిగాయి. యంత్రాలకు కూడా రేటు భారీగానే పెంచారని రైతులు చెపుతున్నారు.


రూ. రెండు లక్షలు పెట్టుబడి పెట్టా..

పామర్తి వెంకటరమణ, కౌలు రైతు, బల్లిపర్రు

పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. ఎకరాకు 20 వేలు ఖర్చయింది. పంట చేతి కొచ్చే సమయంలో వర్షాల కారణంగా  పంట నాశనమైంది. కౌలు ఎలా చెల్లించాలి. వరి కోత కోసినా కూలి ఖర్చులు రావు.  అందుకే దున్నించాలనుకుంటున్నాం.


ఖర్చులు కూడా రాలేదు..

వెంకటసుబ్బారావు, బల్లిపర్రు

ప్రభుత్వం సాయ మందించినా నష్టమే. పడిన కష్టం వృథా..  మురుగు పోయే దారిలేక పొలాలు ముంపుబారిన పడ్డాయి. నాలుగు ఎకరాలు సాగు చేస్తే  80 వేలు రూపాయల నష్టం వచ్చింది. 




Updated Date - 2020-11-21T06:09:01+05:30 IST