ధాన్యం డబ్బులు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-06-28T05:07:40+05:30 IST

రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారని కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఉపా ధ్యక్షుడు కేతా గోపాలన్‌ అన్నారు.

ధాన్యం డబ్బులు ఇవ్వండి
వడలి రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న కౌలు రైతులు

రైతు, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన


పెనుగొండ, జూన్‌ 27: రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నారని కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఉపా ధ్యక్షుడు కేతా గోపాలన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు ధాన్యం అమ్మి మూడు నెలలు కావస్తున్నా డబ్బులు చెల్లించలేదని వడలి గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వడలి గ్రామ సెంటర్‌లో  రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం డబ్బులు చెల్లించాలని నినాదాలు చేశారు. రైతుల సొమ్ము ప్రభుత్వం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. తక్షణం ధాన్యం సొమ్ము చెల్లించకపోతే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. తొంటా సత్యనారాయణ, చిటికెన చిన బ్రహ్మయ్య, మరుకుర్తి నాగేశ్వరరావు, కూనా భూపతిరావు, తొంటా జమిందార్‌ పాల్గొన్నారు.


పెంటపాడు: దాళ్వా సొమ్ము తక్షణమే చెల్లించాలని రైతు సంఘం జిల్లా నాయకులు చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసరెడ్డి  డిమాండ్‌ చేశారు. సోమవారం పెంటపాడు ఆర్బీకే  వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడారు. అనంతరం వీఏఏ ఝాన్సీకి వినతిపత్రం అందజేశారు.  చిర్ల సత్యనారాయణరెడ్డి, వెలగల దానిరెడ్డి, పెనగంటి దుర్గారావు, వెలగల శ్రీనివాసరెడ్డి, బర్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


పోడూరు: ధాన్యం బకాయిలను తక్షణమే జమ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పోడూరు మండల రైతుసంఘం నాయకులు, రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. రైతు సంఘం మండల కార్యదర్శి నెక్కంటి తిరుపతిరాయుడు మాట్లాడుతూ 50రోజులు దాటినా ధాన్యం సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వా సీజన్‌ ప్రారంభం అవు తున్నా ధాన్యం సొమ్ములు రాకపోవడం దురదృష్టకరమన్నారు. దేవస్థాన భూ ముల్లో కౌలుకు ఊడ్చిన రైతులు దేవదాయ అధికారులతో మాట పడాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి ధాన్యం బకాయిలు జమచేయకపోతే పంట విరామం తప్పదన్నారు. రైతుసంఘం నాయకులు, రైతులు రుద్రరాజు వరహాలరాజు, రుద్రరాజు రమేష్‌బాబు, మండా వెంకటరెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, ఎం.రఘురా మరెడ్డి, ఎం.సూర్యనారాయణరెడ్డి, డి.జగన్నాదరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం టౌన్‌: రైతులు విక్రయించిన ధాన్యానికి సొమ్ములు చెల్లిం చాలని, ఉపాధి కార్మికులకు వేతనాలు అందించాలంటూ మల్లవరం గ్రామ సచివాలయం వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతులకు సకాలం లో సొమ్ము చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్ర మంలో రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్‌, ఎం.రామాంజనేయులు, కామేశ్వర రావు, శ్రీనివాస్‌, ఏసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:07:40+05:30 IST