సాగు పనుల్లో రైతులు బిజీబిజీ

ABN , First Publish Date - 2021-06-20T04:08:40+05:30 IST

సంవృద్ధిగా కురుస్తున్న వర్షాలతో జిల్లా రైతాంగం సాగు పనుల్లో తలమునకలయ్యారు.

సాగు పనుల్లో రైతులు బిజీబిజీ

-కిటకిటలాడుతున్న విత్తన, ఎరువుల దుకాణాలు 

-జిల్లాలో ఇప్పటికే 40శాతం విత్తనాలు నాటారు

-ఎర్రనేలల్లో మరికొంత సమయం పట్టే అవకాశం

-ఈ నెలాఖరుకు విత్తే ప్రక్రియ పూర్తి అవుతుందంటున్న అధికారులు

-డిమాండుకు తగ్గట్టుగా అందుబాటులో ఎరువులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

సంవృద్ధిగా కురుస్తున్న వర్షాలతో జిల్లా రైతాంగం సాగు పనుల్లో తలమునకలయ్యారు. జిల్లాలో ఈ ఏడాది కూడా పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాగు పనులు ప్రారంభమైన దరిమిలా వ్యవసాయశాఖ రైతుల డిమాండుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులను జిల్లాలోని 12వ్యవసాయ సహాకార పరపతి సంఘాలు, తొమ్మిది అగ్రోరైతు సేవాసంఘాల్లో సరిపడిన స్థాయిలో అందుబాటులో ఉంచింది. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల డిమాండును ఖరారు చేసి ఆ మొత్తాన్ని వీలైనంత తొందరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ దఫా జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన 4,46,777 ఎకరాలకు గాను, పత్తి, కంది, జొన్న, పెసర, సోయా, చిక్కుడు వంటి పంటలతో పాటు వాంకిడి, కెరమెరి, రెబ్బెన, చింతలమానేపల్లి, కాగజ్‌నగర్‌ మండలాల్లో కూరగాయాల సాగు కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తారన్న అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జిల్లాలో 3,35,000 ఎకరాల్లో  పత్తి, 54,611 ఎకరాల్లో వరి, 46వేల ఎకరాల్లో కంది, 3వేల ఎకరాల్లో జొన్న, మరో 3వేల ఎకరాల్లో పెసర, 5నుంచి 6వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు అవుతాయని తేల్చారు. ఇక ఎరువుల విషయానికి వస్తే సాగు ప్రణాళిక ప్రకారం వానాకాలం సీజన్‌ ఆరంభం నుంచి అక్టోబరు వరకు డిమాండుకు తగ్గట్టుగా అవసరాన్ని బట్టి ఎరువుల నిల్వలను అందుబాటులోకి తెచ్చేందు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో 1.35లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువును వినియోగిస్తారని అంచనా వేయగా ఇందులో యూరియా 46వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 23వేల మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 23వేల మెట్రిక్‌ టన్నులు, ఇతర కాంప్లెక్సు ఎరువులు 23వేల మెట్రిక్‌ టన్నులు, సూపర్‌ పాస్ఫెట్‌ 23వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కావచ్చని అంచనా వేశారు. కాగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలోని 12పీఏసీఎస్‌ల్లో 20మెట్రిక్‌ టన్నుల యూరియాకు గాను 16వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాలో ఉంది. అలాగే మొత్తం 20వేల మెట్రిక్‌ టన్నులకు గాను 1566 మెట్రిక్‌ టన్నులు ప్యాక్స్‌, రైతు సేవా కేంద్రాల వద్ద ఉండగా మిగితా మొత్తం ప్రయివేటు వ్యాపారుల వద్ద అందు బాటులో ఉందంటున్నారు. ఇక యూరియా ఆఫ్‌ పొటాష్‌ ప్రస్తుతం 450మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే మరిన్నినిల్వలు వచ్చే అవకాశాలు ఉందం టున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 40శాతం విత్తనాలు సాగు పూర్తి కావడంతో రైతులు తదుపరి ఎరువుల కోసం ఎదురు చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఆంధ్రజ్యోతి ప్రతినిధికి వెల్లడించారు. మండలాల వారిగా వానాకాలం సాగు పనుల సమాచారం ఇలా ఉంది.

ఆసిఫాబాద్‌ మండలంలో..

ఆసిఫాబాద్‌ రూరల్‌: మండలంలో 46500 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పత్తి పంట 35వేల ఎకరాలు, కంది 6500 ఎకరాలు, వరి 1300 ఎకరాలు, పెసర 120 ఎకరాలు, మినుములు 10ఎకరాల్లో, కూరగాయలు 110, 3వేల ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇందు కోసం యూరియా 6272 టన్నులు, డీఏపీ 3138 టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 1500 వాడనున్నారు. వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో పంట పొలాల్లో రైతన్నలు బీజీబిజీగా ఉన్నారు. 

పెంచికల్‌పేటలో..

పెంచికల్‌పేట: మండలంలో 16889 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి5వేలు, కంది250, పెసర64, పత్తి 10,500 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 439 మెట్రిక్‌ టన్నులు యూరియా, కాంప్లెక్సు ఎరువులు అందుబాటులో ఉంచారు. 

బెజ్జూరులో..

బెజ్జూరు: మండలంలో 31,500సాగు పంటలు సాగు చేస్తున్నారు. వరి7661 ఎకరాల్లో, కంది 1000 ఎకరాలు, పెసర50, సోయాబీన్‌ 300ఎకరాల్లో సాగు చేయనున్నారు. పత్తి22,500 సాగు చేస్తున్నారు. గతేడాది కంటే పత్తి పంట 350 ఎకరాల్లో విస్తీర్ణం తగ్గింది.

చింతలమానేపల్లిలో..

చింతలమానేపల్లి: మండలంలో మొత్తం 34,622 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి 3700 ఎకరాలు, కంది 400, పెసర450, సోయాబీన్‌ 500, పత్తి 20300, ఇతర పంటలు 210 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

దహెగాంలో..

దహెగాం: మండలంలో 36,100 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.  పత్తి 26వేల ఎకరాలు, వరి 8,100 ఎకరాలు, కంది 2200 ఎకరాల్లో సాగు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురియడంతో మండలంలో ఇప్పటికే 1000 ఎకరాల్లో పత్తి పంటను వేశారు. 

వాంకిడిలో..

వాంకిడి: మండలంలో 43వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పత్తి 32వేల ఎకరాల్లో వేశారు. 8 వేల ఎకరాల్లో కందులు వేయగా 3వేల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తున్నారు. వర్షాలు విస్తారంగా కురియడంతో పత్తి, కందులు, పెసర పంటలు వేసేందుకు అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రెబ్బెనలో..

రెబ్బెన: మండలంలో 15,198 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. 12వేల ఎకరాల్లో పత్తి, 2500 ఎకరాల్లో వరి, 698 ఎకరాల్లో పప్పు దినుసు పంటు వేశారు.

Updated Date - 2021-06-20T04:08:40+05:30 IST