బిజీబిజీ..

ABN , First Publish Date - 2022-08-03T05:45:20+05:30 IST

బిజీబిజీ..

బిజీబిజీ..
కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లిలో వరినాటు వేస్తున్న మహిళలు

జిల్లాలో ఊపందుకున్న వరినాట్లు

వ్యవసాయ పనుల్లో రైతులు 

ఇప్పటికే 64,425 ఎకరాల్లో పొలం నాటు

నిండిన చెరువులు, కుంటలు

ఇంకా ప్రారంభం కానీ మిర్చి తోటలు

విరామం ఇచ్చిన వర్షాలు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఆగస్టు 2 : రైతులు వ్యవసా య పనుల్లో బిజీబిజీ అయ్యారు. జిల్లాలో వరినాట్లు ఊపందుకుంటున్నాయి. వర్షాలు వస్తున్న కారణంగా నాట్లు ఆలస్యమయ్యాయి. అయితే గత రెండ్రోజులుగా వానలు తగ్గుముఖం పట్టి, ఎండలు కొడుతోండటంతో సాగు జోరు పెరిగింది. దీం తో నాట్లు వేయడానికి రైతులు దుక్కులు దున్నుతూ మడులను సిద్ధం చేస్తున్నారు. మరికొందరు నాట్లు వేస్తున్నారు. 


ఆలస్యం..

ఈ వానాలకాలం ప్రారంభంలోనే జూన్‌ నెలలో వర్షాలు కురుస్తాయని భావించినప్పటికి వర్షాలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. జూన్‌ చివరిలో ప్రారంభమైన వర్షాలు కురుస్తూ వచ్చాయి. జూలై 2 నుంచి ఏకధాటిగా వర్షాలు కురియడం.. రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా అతిభారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు, కుంటలు రెండు, మూడు మండలాల్లో తప్ప మొత్తం దాదాపుగా నిండాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలు గత రెండ్రోజుల నుంచి విరామమిచ్చాయి. ఎండలు కొడుతోండటంతో భూమి ఆరిపోయి ఉండటం వల్ల రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ..బిజీగా మారారు. కొంతమంది దుక్కులు దున్నుతుండగా మరికొందరు నాట్లు వేస్తున్నారు. మరి కొంతమంది చేలలో పెరిగిన కలుపును తీస్తూ కన్పిస్తున్నారు. 


1,27,943 ఎకరాల్లో వరి సాగు..

ఈ ఖరీఫ్‌లో వరినాట్లు ఆలస్యంగానైనా ఊపందుకుంటున్నాయి. 1,27,943 ఎకరాల్లో వరిసాగు అవుతుందని వ్యవసాయాధికారులు సాధారణ విస్తీర్ణంలో అంచనావేశారు. అయితే ఇప్పటి వరకు 64,425 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఇప్పుడిప్పుడే నాట్లు విస్తృతంగా వేస్తున్నారు. వరి 1,27,943 సాధారణ విస్తీర్ణం కాగా, 64,425 ఎకరాల్లో ఇప్పటి వరకు సాగు చేశారు. పత్తి 97,561 ఎకరాలకు గాను, 100994 ఎకరాల్లోనూ, మొక్కజొన్నలు 32,581కిగాను 29,317 ఎకరాల్లోనూ, పెసర్లు 15,782లకు గాను 5648 ఎకరాల్లో వేశారు.


మినుములు 140 ఎకరాలకు గాను 10 ఎకరాల్లోనూ, కందులు 4,908లకు గాను 7,848 ఎకరాల్లో, జొన్నలు 31 ఎకరాలకు గాను 255 ఎకరాల్లో, వేరుశెనగ 330 ఎకరాలకు గాను 52 ఎకరాల్లో, పసుపు 8,526కు గాను 1,770 ఎకరాల్లో, నువ్వులు 98 ఎకరాలకు గాను 10 ఎకరాల్లో వెరసి 330118 ఎకరాలకు గాను 2,19,939 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 


42,179 ఎకరాల్లో మిర్చి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు వర్షాల కారణంగా ఒక్క ఎకరం కూడ మిర్చి సాగు చేయలేదు. ఇప్పుడిప్పుడే నారు పోసుకుంటున్నారు. పొగాకు, చెరుకు పంటలు కూడ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ సాగు చేయలేదు. అయితే పత్తి మాత్రం కొద్దిగానే పెరిగింది. అలాగే కందులు సాగు కూడా పెరిగాయి. కాగా, ఆలస్యంగా వేస్తున్న వరినాట్ల వల్ల అధిక సంఖ్యలో తెగుళ్లు దిగుబడి తగ్గే అవకాశం ఉందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


మళ్లీ నాలుగు రోజుల పాటు వర్షాలు..

జిల్లాలో మళ్లీ నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు వర్షాలతో బేజారెత్తిన రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి చేలలో నిలిచిన వర్షపు నీటిని కాల్వలు తీస్తూ ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికి కొన్ని పత్తిచేలు జాలువారి పడి కొంతమేర దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెండ్రోజులుగా ఎండలు కొడుతుండంతో మొక్కలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. గత వర్షాల కు పత్తివిత్తాక భారీ వర్షాలు కురియడంతో విత్తనాలు మొలకెత్తకుండా పోయాయి. అలాగే వరినారు మడులు కూడ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు పాత నారుబడిని వదిలేసి కొత్త నారుమడులను వేసుకున్నారు. దీని వల్ల రైతులు కొత్తమేర ఆర్ధికంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు తగ్గాయని రైతులుసంతోషపడుతున్న సమయంలోనే కొన్ని మండలాల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు పరేషాన్‌కు గురవుతున్నారు. 



Updated Date - 2022-08-03T05:45:20+05:30 IST