ప్రజాశ్రేయస్సుకు చేటు కొత్త సాగు చట్టాలు

ABN , First Publish Date - 2021-01-08T06:21:18+05:30 IST

కొత్త వ్యవసాయచట్టాలు యావత్‌ ప్రజల శ్రేయస్సుకు విఘాతాలు. రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వ్యతిరేకపాలనను, అప్రజాస్వామిక శాసనాలకు ప్రతిఘటించి ప్రజాస్వామ్య సంస్కృతిని....

ప్రజాశ్రేయస్సుకు చేటు కొత్త సాగు చట్టాలు

కొత్త వ్యవసాయచట్టాలు యావత్‌ ప్రజల శ్రేయస్సుకు విఘాతాలు. రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వ్యతిరేకపాలనను, అప్రజాస్వామిక శాసనాలకు ప్రతిఘటించి ప్రజాస్వామ్య సంస్కృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేశప్రజలపై ఉంది.


నిజంగా మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? ప్రజాస్వామ్యంలో బతికితే రైతులతో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని షరతులు విధించి చర్చలకు పిలవడం ఏమిటి? ప్రజలు షరతులు విధిస్తే ప్రజాస్వామ్యం అనవచ్చు కానీ ప్రభుత్వమే షరతులు విధించి వాటికి లోబడే చర్చిస్తామనడం ప్రజాస్వామ్యమని ఎట్లా అనిపించుకుంటుంది? ఢిల్లీలో రైతుల నిరసన ఆరంభమై రెండు నెలలవుతున్నది. ఏడవ రౌండ్‌ చర్చలు కూడ విఫలమై, సుప్రీంకోర్టుకి వెళ్ళండి కాని, చట్టాల రద్దు అసాధ్యం అని మొండిగా చెప్పడం, ప్రభుత్వంలో కనీసంగానైనా రైతు పక్షపాత చలనం రాకపోవడంతో మెదులుతున్న ప్రశ్న ఇది.


ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాలకులను ఎన్నుకునే వరకే. కాదు.. కాదు.. ఓట్లు వేసే వరకే. పాక్షిక మద్దతుతో గద్దెనెక్కిన పాలకులు ప్రజాస్వామ్యం పేరిట పూర్తిగా నియంతృత్వ పాలన సాగించడం దారుణం. రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరే దీనికి నిదర్శనం. ఈ దేశంలో పాలకులు ప్రజల మద్దతుతో పూర్తిగా ప్రజల మేలు కోసమే పరిపాలన చేస్తున్నాం అనడం హాస్యాస్పదమే. నిజానికి ప్రజలను కార్పొరేట్లకు ఎట్లా కట్టబెట్టాలనే తర్కం మీదనే పాలనంతా కొనసాగుతోంది. ప్రభుత్వరంగ సంస్థలలో మెజార్టీ వాటాలను అమ్మడం, ఆ సంస్థలను పైవ్రేటు కంపెనీలకు కట్టబెట్టడం దీనికి సాక్ష్యం. పారిశ్రామిక చట్టాలు తెచ్చేటప్పుడు పారిశ్రామికవేత్తలతో చర్చించే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు మాత్రం ప్రజలతో చర్చించరు. 


కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల కలిగే నష్టాలను రైతులు చాలా సులభంగా వివరించే నిరసన బాట పట్టారు. ఈ చట్టాలలోని సాంకేతికపరమైన అంశాలను కూడా చాలామంది మేధావులు వివరించారు. ఇక్కడ ఒక సూటి ప్రశ్న. ప్రజల కొరకు, రైతుల మేలు కోసమే ఈ మూడు చట్టాలను తీసుకువచ్చామంటున్న పాలకులు ఆ రైతులే వద్దంటున్నప్పుడు వారిపై వాటిని బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? ‘‘నిత్యావసర సరుకుల విషయంలో నిబంధనల ప్రకారం నిల్వల పరిమితి దాటితే (అది కూడా అత్యవసర పరిస్థితులలో) జోక్యం చేసుకుంటామని చట్టం చేసిన ప్రభుత్వం, ఇంతకంటే తక్కువ ధరకు కొంటె శిక్షిస్తామ’’ని ఎందుకు చట్టం చేయటం లేదు? ప్రజల కోసమే పాలించే ప్రభుత్వమయితే రైతులు కోరుకున్నట్టు ఆ మూడు చట్టాలను రద్దు చేసి వారి డిమాండ్లను ఒప్పుకునేది. కానీ అందుకు విరుద్ధంగా, నిరసన తెలుపుతున్న రైతులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి తన దమననీతిని, ప్రజావ్యతిరేక బుద్ధిని చాటుకుంది. ఈ కారణం చేతనే నిరసనలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం వ్యవసాయాన్ని అంబానీ, అదానీలకు కుదువ పెట్టిందని బాహాటంగా విమర్శిస్తున్నారు.


‘శిరసు వంచి, చేతులెత్తి మొక్కుతున్నా చర్చలకు రండి’ అని రైతులను ఆహ్వానించిన ప్రధాని, ఎవరి తరపున శిరసు వంచి, చేతులెత్తి మొక్కుతున్నారు. ‘మన్‌ కీ బాత్‌’ అని తన మనసులోని మాటలను నిత్యం ప్రజలకు బలవంతంగా వినిపిస్తున్న ఆయన, ప్రజలు, రైతుల మనసులోని మాటను వినడానికి సిద్ధంగా లేరెందుకు? కొంతమంది కుహనా మేధావులు అంటున్నట్లు ఈ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే నష్టం చేసే చట్టాలు కావు. మొత్తంగా సామాన్య ప్రజానీకాన్ని అమితంగా దెబ్బతీసేవనడం నిస్సందేహం. రోజువారీ జీవితంలో నిత్యావసర సరుకులను వినియోగించే సామాన్య మధ్యతరగతి, పేద ప్రజానీకం అత్యధిక ఆర్థిక భారాన్ని మోయవలసి ఉంటుంది. పేదవారు మరింత పేదవారిగా మారడానికి, వ్యాపారస్తులు మరింత లాభార్జన పొందడానికి ఉపకరించడమే ఈ మూడు చట్టాల అసలు లక్ష్యం. ప్రస్తుత ఉద్యమాన్ని పంజాబ్‌, హర్యానా రైతుల ఉద్యమంగా కుదించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో కేంద్రీకృతమైన ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా కొన్ని సంఘాల వారు, ప్రజలు సంఘీభావ నిరసనలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇది పూర్తిస్థాయి దేశవ్యాప్త ఉద్యమంగా ఉధృతం కావడం లేదు. అందుకే ప్రభుత్వం కూడా, ఎన్ని రోజులు నిరసన తెలుపుతారో వేచి చూద్దాం అనే ధోరణిలో చర్చలను కావాలని సాగదీస్తోంది. కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలలో రైతుసంఘాల నాయకులు రైతులను సమన్వయపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను ఒప్పుకుంటుంది.


ఢిల్లీ ఉద్యమాన్ని కేవలం రైతుల సమస్యగా చూడకుండా దేశ ప్రజలందరి సమస్యగా పరిగణించి అందరూ కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వ్యతిరేక పాలన విధానాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ చట్టాలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని, భిన్నత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉంది.


దిలీప్‌.వి

మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్‌ జిల్లా

Updated Date - 2021-01-08T06:21:18+05:30 IST