అప్పుల ఊబిలో అన్నదాతలు

Published: Mon, 27 Jun 2022 01:08:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అప్పుల ఊబిలో అన్నదాతలు

కష్టాల కడలిలో కర్షకులు


ప్రభుత్వ నిర్దయపై ఆందోళన

ఉచిత పంటల బీమాపై ఆక్రోశం

తడిసిమోపెడవుతున్న వ్యవసాయ ఖర్చులు

దుక్కికి సాహసించని వైనం...

అనంత రైతన్న వేదనిదీ....


అనంతపురం,  ఆంధ్రజ్యోతి

వ్యవసాయమే జీవనాధారంగా బతుకు వెల్లదీస్తున్న కరువు రైతును సమస్యలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం శ్రమించినా... కడుపునింపుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వ్యవసాయ సంక్షోభంలో అన్నదాతలు కూరుకుపోతున్నా... కళ్లెదుటే వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నా... పాలకులు కనికరం చూపడం లేదు. పంట పెట్టుబడిసాగు మినహా... ప్రభుత్వం రైతులకు ఏ మేరకు ప్రయోజనాలు సమకూరుస్తోందన్న ప్రశ్న రైతు సంఘాల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతర వర్గాలకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌, స్ర్పింక్లర్లు అందజేస్తే... వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దుచేయడంతో బోరుబావుల కింద పంటలు సాగుచేసుకునే రైతులు బోరుమంటున్నారు. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతే పంటనష్ట పరిహారం అందజేసి కరువు రైతుకు గత ప్రభుత్వం బాసటగా నిలిస్తే.... వైసీపీ ప్రభుత్వం ఆ ఇనఫుట్‌ సబ్సిడీ విషయంలో అన్యాయం చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6.57 లక్షల మందికిపైగా రైతులు వివిధ రకాల పంటలు సాగుచేస్తే... అందులో 4.03 లక్షల మందికి మాత్రమే ఉచిత పంటల బీమా ద్వారా అరకొర లబ్ధి చేకూర్చారు. మిగిలిన లక్షలాది మంది రైతులకు బీమా అందలేదు.  పంటల బీమా పంపిణీలోనూ అనేక లోపాలు బట్టబయలయ్యాయి. ఒకే పంటను సాగుచేసిన రైతుల్లో ఒక రైతుకు రూ. లక్షల్లో... మరో రైతుకు వేలల్లో పరిహారం సొమ్ము వారి ఖాతాలకు జమ కావడమే ఇందుకు నిదర్శనం. పాలకులు, అధికారుల తీరుపై బాధిత రైతులు తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో లేకపోలేదు. ఆ క్రమంలో అన్నదాతలు రోడ్డెక్కడంతో ఉచిత పంటల బీమా నమోదుకు శ్రీకారం చుట్టారు.  రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవడం మినహా... బయటి మార్కెట్‌కంటే ధరలు ఏ మాత్రం తక్కువ లేకపోవడంతో ఆ కేంద్రాలను రైతులు ఆశ్రయించడం లేదు. ఇదిలా ఉండగా... హంద్రీనీవా ద్వారా చెరువులను కృష్ణాజలాలతో నింపి పంటలకు నీరందిస్తామని మూడేళ్లుగా పాలకులు చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో ఆ మేరకు అమలు కావడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లోని చెరువులు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటితో చెరువులు కాస్త.. కుంటలను తలపిస్తున్నాయి. 


బీళ్లుగా మారిన పొలాలు...

వ్యవసాయ సంక్షోభంలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటలు సాగుచేసినా... తీరా పంట కోతకొచ్చే సరికి కరువు రైతును అతివృష్టి, అనావృష్టి వెంటా డుతోంది. దీంతో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో సాయమందకపోవడంతో అప్పు ల ఊబిలో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు దిగుబడిరాక మరోవైపు పంట పరిహారం అందకపోవడంతో చివరికి వ్యవసాయం చేసేదానికంటే బీళ్లుగా ఉంచేదే మేలనే యోచనలో రైతన్నలు ఉన్నారు. ఉదాహరణకు... గుత్తి మండలంలోని నేమతాబాద్‌లో రెడ్డి అనే రైతు తన మూడెకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చేవాడు. వర్షాలు సరిగా రాక పంటలు పండకపోవడం, కౌలు రైతుల  నుంచి కౌలు డబ్బులు అందకపోవడం తదితర కారణాలతో ఈ ఏడాది తన పొలాన్ని బీడుగా పెట్టారు. అదే విధంగా ఉరవకొండ మండలం శేక్షానుపల్లి గ్రామంలో రామకృష్ణ అనే రైతు రెండున్నర ఎకరాల పొలాన్ని పంట పెట్టకుండా వదిలేశాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వందలాది ఎకరాలను పంటసాగు చేయకుండా బీడుగా వదిలేస్తున్న పరిస్థితులు లేకపోలేదు. 


తగ్గుతున్న సాగు విస్తీర్ణం..

      వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఎలాంటి రాయితీలు కల్పించకపోవడంతో జిల్లాలో దుక్కికి రైతన్నలు ముందుకు రావడం లేదు. దీనికితోడు పొలం దుక్కితో పాటు విత్తు, పంట కోతల వరకూ వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతుండటమూ మరో కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో... ఏడాదికేడాదికి పంటసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6.71 లక్షల హెక్టార్లుండగా... గతేడాది ఖరీ్‌ఫలో 6.40 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ లెక్కన ఖరీ్‌ఫలో 31 వేల హెక్టార్లలో పంటలు సాగుచేయలేదు. తాజాగా ఈ ఖరీ్‌ఫలో ఇప్పటి వరకూ 10 వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగుచేశారు. దీన్నిబట్టి చూస్తే.. ఏడాదికేడాదికి సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. రబీలోనూ అదే పరిస్థితి. సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లుండగా... సాగుచేసింది 1.30 లక్షల హెక్టార్లలో మాత్రమే. దీన్నిబట్టి చూస్తే సబ్సిడీ డ్రిప్పు ఎత్తివేయడమే సాగు విస్తీర్ణం తగ్గిపోవ డానికి ప్రధాన కారణమనే అభిప్రాయాన్ని రైతన్నలే వ్యక్తం చేస్తున్నారు. 


పెరిగిన పెట్టుబడి ఖర్చులు..

- జిల్లాలో ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి రూపంలో అన్నదాతలు పంటనష్టపో తున్నారు. ఉదాహరణకు గతేడాది ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశనగ పంట కోతదశలో వరుస తుఫానలతో పొలాల్లోనే పంట కుళ్లిపోవడంతో పూర్తిస్థాయిలో పంటలు నష్టపోయారు. ప్రభుత్వం నుంచి పంటనష్టపరిహారం అందకపో వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీనికితోడు అప్పులు చేసి పంటసాగుచేసినా... చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు సరిపడా డబ్బులు చేతికందడం లేదు. ఇవన్నీ ఒకెత్తయితే... పంటలు సాగుచేసేందుకు వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. గతంలో కాడెద్దులతో పొలం దుక్కిచేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రాక్టర్లతోనే దుక్కి చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఓవైపు డీజల్‌ ధరలు పెరగడంతో... ఎకరా దుక్కికి ట్రాక్టర్‌ బాడుగను రూ. 1100 చెల్లించాల్సిన పరిస్థితిని రైతన్న ఎదుర్కొంటున్నారు. అదే విధంగా విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో రైతన్నపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో ఎకరా వేరుశనగ పంట సాగుచేయాలంటే దాదాపు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకూ ఖర్చులు వస్తుండటంతో పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాగుకింద రూ. 13500లతో సరిపె ట్టుకుంటోంది. ఇంతకు మినహా... రైతన్నకు ఏ విధమైన రాయితీలను ఇవ్వక పోవడంతో వ్యవసా యం భారమనే అభిప్రాయంలో రైతన్నలు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో.అప్పుల ఊబిలో అన్నదాతలు

సాయం గోరంతే...

రైతు ప్రభుత్వమని వైసీపీ ప్రభుత్వం గొప్పలు పోతోందేగానీ... రైతులకు చేసిందేమీ లేదు. గత ఏడాది ఖరీఫ్‌లో 5 ఎకరాల్లో రూ. లక్షకుపైగా పెట్టుబడి పెట్టి వేరుశనగ పంట సాగుచేశాను. పంట కోతదశలో వర్షం రావడంతో వేరుశనగ పూర్తిగా తడిసిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వం నుంచి పంటల బీమా రూపంలో రూ. 5 వేలు వచ్చింది. నాకు నష్టం కొండంత జరిగితే... ప్రభుత్వం నుంచి సాయమందింది మాత్రం గోరంతే. నాలాంటి వేరుశనగ పంట సాగుచేసిన రైతులకు ప్రతిఏడాది ఇదే పరిస్థితి ప్రభుత్వం నుంచి ఎదురవుతోంది.

-మేడాపురం రమణ, కోటంక, గార్లదిన్నె మండలం 

అప్పుల ఊబిలో అన్నదాతలు

ఎలాంటి సాయమూ లేదు..

నేను గతేడాదిలో నాకున్న ఎనిమిది ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశాను. అధిక వర్షాలు రావడంతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరాకు ఒక క్వింటా దిగుబడి రాలేదు.పంటసాగు కోసం రూ. 2 లక్షలు ఖర్చు చేశాను. వచ్చిన అరకొర పంటను అమ్ముకోగా... రూ. 50 వేలు చేతికొచ్చింది. దీంతో రూ. 1.50 లక్షలు నష్టపోయాను. పంటనష్టపోయిన నాకు పంటనష్టపరిహారం వస్తుందేమోనని ఆశించాను. ఒక్క రూపాయి రాలేదు.  మరో నాలుగెకరాల్లో సాగుచేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో మరింత నష్టపోయాను. పప్పుశనగ, పత్తి పంటలు నష్టపోయినా... పరిహారం రాలేదు. 

- శివప్రసాద్‌, విడపనకల్లు

అప్పుల ఊబిలో అన్నదాతలు

పరిహారం అందలేదు...

నాకున్న 16 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రూ. 10 లక్షలదాకా పెట్టుబడి పెట్టాను. గత ఏడాది నవంబరు నెలలో కురిసిన అధిక వర్షాలు, తద్వారా సోకిన తెగుళ్ల కారణంగా పంట నష్టపోయాను. మరో 13 ఎకరాల్లో పప్పుశనగ సాగుచేశాను. ఆ పంట కూడా దెబ్బతింది. ఈ రెండు పంటలకు దాదాపు రూ. 15 లక్షలు ఖర్చు చేశాను. ఇంత నష్టపోయిన నాకు ఎలాంటి పరిహారంగానీ అందలేదు. - నేలపాటి రాంబాబు, నింబగల్లు

అప్పుల ఊబిలో అన్నదాతలు

ఈ క్రాప్‌ నమోదు చేసినా...

మూడు ఎకరాల పొలంలో మిరప పంటను సాగు చేశాను. అధిక వర్షాలతో తేమశాతం ఎక్కువై తెగుళ్లు రావడంతో పంటంతా నష్టపోయాను. సుమారు రూ.2 లక్షల పైగా ఖర్చుచేశాను. అధికారులు వచ్చి ఈ-క్రాప్‌ నమోదు చేశారు. అయినా ఉచిత పంటల బీమా పరిహారం అందలేదు. 

-తిప్పన్న, ఎర్రగుడి,బెళుగుప్ప మండలం

అప్పుల ఊబిలో అన్నదాతలు

3.7 ఎకరాలకు రూ.3200 వచ్చింది....

నాకున్న రూ.3.7ఎకరాల్లో రూ. లక్షదాకా పెట్టుబడి పెట్టి వేరుశనగ పంట సాగుచేశాను. పంట పూర్తిగా నష్టపోయాను. పంట నష్టపరిహారం అయినా దక్కుతుందనుకుంటే రూ.3200 నా ఖాతాలో వేశారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే పంటల బీమాలో నాకు అన్యాయం జరిగింది. పంటల బీమాలో న్యాయం జరిగి ఉంటే పంట సాగుకు ఇబ్బందులు ఉండేవి కావు.

- విఠేంద్రరెడ్డి, పుప్పాలతండా, యాడికి మండలం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.