కల్లాలపై రైతుల అనాసక్తి

ABN , First Publish Date - 2021-04-23T06:42:21+05:30 IST

: రైతులు తమ ధాన్యాన్ని సొంత పొలంలో ఆరబెట్టుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా రైతులు అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో జిల్లాలో పంట కల్లాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.

కల్లాలపై రైతుల అనాసక్తి
అర్వపల్లి మండలంలో అసంపూర్తిగా ఉన్న పంట కల్లం

 నిర్మాణానికి ఆసక్తి చూపని రైతులు 

15 శాతం కూడా పూర్తికాని వైనం 

రోడ్లపైనే ధాన్యం ఆరబోత

అర్వపల్లి, ఏప్రిల్‌ 22 : రైతులు తమ ధాన్యాన్ని సొంత పొలంలో ఆరబెట్టుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా రైతులు అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో జిల్లాలో పంట కల్లాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. కల్లాల ఏర్పాటుకు 2020 ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. తొమ్మిది నెలలు గడిచినా 15 శాతం కూడా పంట కల్లాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో రైతులు తమ పంటలను రోడ్లపైనే ఆరబెడుతున్నారు. జిల్లాలో 3,814 కల్లాలు మంజూరు కాగా ఇప్పటివరకు 555 మాత్రమే పూర్తయ్యాయి. 1,061 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.

మూడు భాగాలుగా విభజన

పంట కల్లాలను మూడు భాగాలుగా (50, 60, 75 చదరపు మీట ర్లు)గా విభజించారు. 50 చ.మీటర్లకు రూ.56,187, 60 చ.మీటర్లకు రూ.68 వేలు, 75 చ.మీటర్లకు రూ.85,001లు ప్రభుత్వం చెల్లిస్తోంది. కల్లాల నిర్మాణానికి రైతులు తమ వాటాగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా నిధులు ఉపాధిహామీ పథకం ద్వారా విడుదల చేస్తారు. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పంట కల్లాలు నత్తనడకన సాగుతున్నాయి. అర్వపల్లి మండలానికి 222 పంటకల్లాలు మంజూరు కాగా కేవలం 16 మాత్రమే పూర్తయ్యాయి. 45  వివిధ దశల్లో ఉన్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న పొలాలకు 1,200 పంట కల్లాలు మంజూరైనా 200 కల్లాల నిర్మాణం కూడా పూర్తికాలేదు. శ్రీరాంసాగర్‌ కాల్వ కింద ఉన్న వ్యవసాయ      భూముల్లో 400 కల్లాలను నిర్మించగా, 600 నిర్మాణంలో ఉన్నాయి. బోరు బావులున్న కింద ఉన్న వ్యవసాయ భూముల్లో మాత్రమే పంటకల్లాల నిర్మాణానికి రైతులు ముందుకు వస్తున్నారు. కాల్వల వద్ద ఉన్న భూముల్లో పంటకల్లాలు నిర్మించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు పంట కల్లాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. రోడ్లపై ధాన్యం ఆరబెడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు త్వరగా పంట కల్లాలను ఏర్పాటు చేసుకునేలా వెంటనే నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

 పంట కల్లాలపై అవగాహన కల్పిస్తున్నాం 

వ్యవసాయ క్షేత్రాల వద్ద పంట కల్లాలు నిర్మిం చుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉపాధిహామీ పథకం కింద రూ.85వేలు మంజూరు చేసినా కల్లాల నిర్మాణానికి రైతులు ముందుకు రావడం లేదు.  ఎంత చెప్పినా రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోస్తున్నారు   వచ్చే ఏడాదికి పంట కల్లాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.

- శైలజ, ఏపీవో, అర్వపల్లి

నిధులు త్వరగా మంజూరు చేయాలి

వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకునే పంట కల్లాలకు ప్రభుత్వం నిధులు త్వరగా మంజూరు చేయాలి. ఉపాధిహామీ పథకం ద్వారా సరైన  సమయానికి నిధులు మంజూరుకావడం లేదు. అందుకే కల్లాలు రైతులు నిర్మించుకోలేకపోతున్నారు.

 బైరబోయిన సైదులు, రైతు, అర్వపల్లి







Updated Date - 2021-04-23T06:42:21+05:30 IST