రైతుల ఆందోళనలకు స్వస్తి!

Dec 8 2021 @ 01:56AM

నేడు ఎస్‌కేఎం ప్రకటన చేసే అవకాశం

సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి?

అన్ని డిమాండ్లపై కేంద్రం ఓకే.. సంఘాలకు లేఖ

వెల్లడించిన రైతు నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు

‘మద్దతు ధరకు చట్టబద్ధత’ కమిటీపై అభ్యంతరాలు

ఆందోళనలపై నేడే తుదినిర్ణయం: టికాయత్‌ 


న్యూఢిల్లీ, డిసెంబరు 7: ఢిల్లీ శివార్లలో సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో రైతులతో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు సంఘాలు తమ నిరసనకు ఇక ముగింపు పలికే అవకాశాలున్నాయి. ఈ మేరకు తమ భవిష్యత్తు కార్యాచరణపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) బుధవారం కీలక ప్రకటన చేయనుంది. రైతు సమస్యలపై  రైతు సంఘాలు లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, మున్ముందు లేవనెత్తాల్సిన సమస్యలు, ఆందోళనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రైతు నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఎస్‌కేఎం తరఫున ప్రకటన చేస్తామని వెల్లడించారు. తాము లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్ల పరిష్కారంపై కేంద్ర సర్కారు నుంచి లేఖ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 40 రైతు సంఘాలతో కూడిన ఎస్‌కేఎం ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడి, కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆందోళనలకు ముగింపు పలికి రైతులంతా తిరిగి ఇళ్లకు వెళ్లాలనే కేంద్రం చేసిన ప్రతిపాదనపై సమావేశంలో ప్రతినిధులు చర్చించినట్లు తెలిసింది. అనంతరం కుల్వంత్‌ సంధు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాగా రైతు సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఆందోళలకు సంఘాలు బుధవారంతో ముగింపు పలికే అవకాశాలున్నాయని ఎస్‌కేఎంకు చెందిన ఓ నేత పేర్కొన్నారు. భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయత్‌ కూడా ఓ ఆంగ్ల చానల్‌తో మాట్లాడుతూ రైతు ఆందోళనపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన ఉత్తరాఖండ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొనలేదు. అయితే బుధవారం జరిగే సమావేశంలో టికాయత్‌ పాల్గొననున్నారు. ఏదిఏమైనా ఈ విషయంలో ఎస్‌కేఎం బుధవారం ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రకటనకు ముందు ఎస్‌కేఎం మరోసారి సమావేశం  కానుంది.  కాగా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనపై తమకు అభ్యంతరాలున్నాయని ఎస్‌కేఎం నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ స్పష్టం చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై ప్రభుత్వమే ఒక ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.  


పరిహారం, కొలువులు ఇవ్వాలి: రాహుల్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణా లు కోల్పోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబీకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో శూన్యగంటలో ఈ విషయాన్ని రాహుల్‌ లేవనెత్తారు. నిరసనల్లో ఎంతమంది రైతులు మృతిచెందారనే విషయమ్మీద కేంద్రం వద్ద ఏ వివరాలు లేవని కేంద్ర వ్యవసా య మంత్రి పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.