రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి

Dec 3 2021 @ 01:27AM
పందుపగండి ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల, డిసెంబరు 2: పందువగండి లాకులు విరిగిపోయి నీరు వృథాగా పోతుండడంతో వాటికి మరమ్మతులు చేపట్టి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్యకర్తలతో కలిసి పందువగండి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా లాకులు విరిగి నీరు వృథాగా పోయిందన్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత పదేళ్ల నుంచి గేట్లు విరిగిపోయి, చెదులుపట్టి లీకులు అవుతున్నా కూడా అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ రిజర్వాయర్‌ మరమ్మతుకు రూ. 1.50కోట్లు మంజూరైనా కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదన్నారు. అప్పుడే పనులు మొదలుపెట్టి ఉంటే ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి హాని జరగకుండా ఉండేదన్నారు. రిజర్వాయర్‌ కింద ఉన్న గండ్లోపల్లి, చెన్నంపల్లి, గన్నవరం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయన్నారు. ఈ గేట్లు పూర్తిగా దెబ్బతింటే సమీపంలోని గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేపట్టాలని కోరారు.  ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, నాయకులు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, కేసరి రమణారెడ్డి, కొండు భాస్కర్‌రెడ్డి, సానా జయపాల్‌రెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

చిట్టడవిలో కాలినడక పయనం

కనిగిరి : పందువగండి ప్రాజెక్టును మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం కాలికనడక వెళ్లి పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు చేరుకోవడానికి రోడ్డు మార్గం లేదు. విధిగా కాలినడకనే వెళ్లాలి. దీంతో ఆయన కాలినడకనే చిల్లచెట్లు, బురధమార్గంలో ముందుకు నడిచారు. ఆయనే కాలినడకన వెళ్లడంతో మిగిలిన టీడీపీ కార్యకర్తలు కూడా విధిగా ఆయన్ను అనుసరించారు. చివరకు ప్రాజెక్టును పరిశీలించి సమస్యకు వెలుగు చూపారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.