రైతన్న మృత్యు ఘోష

ABN , First Publish Date - 2022-05-06T08:09:35+05:30 IST

రైతులకు మట్టి బంధం తీరిపోతోంది. కష్టమే జీవితంగా మారిన కర్షకులు ముందు కాడిని, ఆపై ప్రాణాలనూ వదిలేస్తున్నారు.

రైతన్న మృత్యు ఘోష

ఆత్మహత్య లెక్కలూ దాచేసిన జగన్‌ సర్కారు

మూడేళ్లలో వేలల్లోనే బలవన్మరణాలు

రైతులకు సాయంపై ఆర్భాటంగా ప్రకటనలు

ఘనంగా విపత్తు నిధి.. విదిలించింది కొంతే

కౌలు రైతులకు సాయంలో పూర్తి నిర్లక్ష్యం

కాడి వదిలేస్తున్న వాస్తవ సాగుదారులు

విపత్తులు, తెగుళ్లతో నష్టాలు 

మద్దతు ధరా అంతంతమాత్రమే 

ఏమాత్రం ఆదుకోని ‘రైతు భరోసా’ 

ఎక్స్‌గ్రేషియాకు అరకొరగానే నిధులు 

విచారణ పేరుతో అంతులేని జాప్యం 

వైఎ్‌సఆర్‌ రైతు బీమా పథకం కింద 

బాధితులకు ఎంతకూ అందని పరిహారం 

రైతు మరణంతో కుటుంబాల్లో దీనస్థితి


రైతులకు మట్టి బంధం తీరిపోతోంది. కష్టమే జీవితంగా మారిన కర్షకులు ముందు కాడిని, ఆపై ప్రాణాలనూ వదిలేస్తున్నారు. అతివృష్టి లేక అనావృష్టి నిలువునా ముంచేస్తుంటే.. చేసిన అప్పులు కొండలా పెరిగిపోతుంటే.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి! పెరుగుతున్న ఎరువుల ధరలు.. మార్కెట్‌కు తీసుకెళ్లినా పంటకు గిట్టుబాటు ధర లభించక.. ప్రభుత్వ పథకాలు భరోసా ఇవ్వక.. అప్పులోళ్లకు మోహం చూపించలేక పొలాల్లోనే తనువు చాలిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఎట్టి పరిస్థితుల్లోనూ బలవన్మరణానికి పాల్పడకూడదు.. దురదృష్టవశాత్తు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అలాంటి కుటుంబానికి తక్షణ సాయం అందించాలి’’ ఇదీ ముఖ్యమంత్రి నిర్దేశం. కానీ ఆచరణలో సాయం అందించడంలోని ఆలస్యం, అలసత్వం రైతన్నను మళ్లీ మళ్లీ చంపుతూనే ఉన్నాయి. కేంద్ర సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం రైతుల్ని సంతృప్తిపర్చలేకపోతోంది. వాస్తవ సాగుదారుల్లో 82 శాతం సన్న, చిన్నకారు రైతులుండగా, అందులో కౌలు రైతులే 70శాతం మంది ఉన్నారు. కానీ వీరికి ప్రభుత్వం నుంచి పిసరంత సాయమూ అందడం లేదు. కనీసం రాయితీలు వర్తిస్తాయన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. మొక్కుబడిగా పంట రుణాలు, నానాఅవస్థలు పెట్టి ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు ఎంతోకొంత అందుతోంది. అదే సమంలో సాగుదారు హక్కుపత్రం (సీసీఆర్సీ), ఈ-క్రాప్‌ పేరిట కౌలురైతులకు మాత్రం ఆ మాత్రం లబ్ధీ అందకుండా చేస్తున్నారు. విపత్తులు వచ్చినా.. పంటలకు ధర లేకపోయినా.. అప్పుల పాలై ఆర్ధిక సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడేవారిలో కౌలు రైతులే ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం!


గత ప్రభుత్వాల్లో.. 

రాష్ట్రంలో 2004నుంచి 2014వరకు 1,987 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పట్లో నియమించిన డీసీఆర్బీ రిపోర్టు ప్రకారం ఈ కాలంలో 1,160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక 454 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కమిటీల నివేదికలను అధికారంలోకొచ్చిన ఏడాదిలోపే వైసీపీ ప్రభుత్వం బయటపెట్టింది. కానీ.. గత మూడేళ్ల పాలనలో చోటుచేసుకున్న బలవన్మరణాలను మాత్రం దాచిపెట్టేసింది. కనీసం ఎంత మందికి పరిహారం అందిందనేది కూడా బయటపెట్టలేదు. వేలాది మందే ఈ కాలమంతా ఆత్మహత్య చేసుకున్నట్టు అనధికార లెక్కలు ఘోషిస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్న జగనన్న మాటలను ఇప్పుడు అంతా గుర్తుచేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.7లక్షలకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ 2021-22 బడ్జెట్‌లో రూ.20కోట్లు మాత్రమే  కేటాయించడం గమనార్హం. 


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు మచ్చా నాగరాజు అప్పుల బాధ భరించలేక 2021 సెప్టెంబరులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజుకు 9 ఎకరాల పొలం ఉంది. వేరుశనగతో పాటు ఇతర పంటలు సాగుచేస్తూ వచ్చాడు. అవి ఎండిపోకుండా కాపాడుకునేందుకు 5 బోర్లు వేశాడు. ఇందుకోసం రూ.15లక్షల వరకూ అప్పు చేశాడు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలేక కుదేలయ్యాడు. చేసిన అప్పు తీర్చలేక... మరోవైపు కుటుంబాన్ని పోషించలేక పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడికి భార్య అరుణమ్మ, ఇద్దరు పిల్లలు సంతానం. నాగరాజు చనిపోయి 8 నెలలు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద రూ.లక్ష అందించారే తప్ప... పూర్తిగా పరిహారం ఇవ్వలేదని భార్య అరుణమ్మ వాపోతోంది. 


ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని పిటికాయగుళ్ల గ్రామానికి చెందిన రైతు చిలకల ఈశ్వరరెడ్డి(55) అప్పుల బాధతో ఈ ఏడాది జనవరి 3న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారికున్న 4ఎకరాలతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు వేయగా అవి చేతికి రాలేదు. సుమారు రూ.18లక్షల వరకూ అప్పులపాలై ఈశ్వరరెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరి కుటుంబానికి నేటికీ పరిహారం అందలేదు. 


కడప జిల్లా పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లెకు చెందిన రైతు తోట నాగేంద్ర 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. సాగుకోసం రూ.10 లక్షలు అప్పు చేశాడు. పంట దెబ్బతినడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ఈ ఏడాది మార్చి 22న పురుగుల మందు తాగి ఆత్మహత్య చే సుకున్నాడు. భార్య చంద్రకళ కూలి పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఇప్పటి వరకు వీరికి రూ.లక్ష మాత్రమే ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, లేకుంటే పిల్లలతో సహా ఆత్మహత్య చే సుకుంటానని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేసింది. 


విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతానపల్లి గ్రామంలో 2020 మార్చి 10న నొడగలి రామకృష్ణ(59) పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 1.5 ఎకరాల భూమిలో వరి సాగుచేశాడు. వర్షాలు పడక పంటకు నష్టం వచ్చింది. కుటుంబ పోషణ, వ్యవసాయం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరగడంతో పురుగు మందు తాగి మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. 


కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన పుచ్చలదిన్నె ఉరుకుందు(45) మూడున్నర ఎకరాల రైతు. ఐదారేళ్లుగా పత్తి, మిరప, వేరుశనగ సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు మూడింతలు పెరగడం.. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంటలు దెబ్బతినడం.. చేతికొచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలు దాటాయి. వడ్డీలు కలిపితే రూ.7-8 లక్షలకు చేరాయి. దీంతో గతేడాది అక్టోబరు 21న ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతుకు 70 ఏళ్ల తల్లి, ఏడవ తరగతి చదివే 14ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వైఎ్‌సఆర్‌ రైతు భీమా రూ.7లక్షల సాయం నేటికీ అందలేదు. 


అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామానికి చెందిన వెన్నలకోట అర్జున(49)కు 12 సెంట్లు మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. మరో 2ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు, వరి సాగు చేశాడు. వరుసగా మూడేళ్లు పంటలు దెబ్బతినడంతో సాగుకోసం చేసిన అప్పులు, వాటికి వడ్డీలు కలిపి రూ.5 లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే దారి లేకపోవడంతో గతేడాది అక్టోబరు 14న పురుగు మందు తాగి మృతిచెందాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని అర్జున భార్య సత్యవతి వాపోయారు. 


గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన ముద్రబోయి నాగరాజు(30) కౌలుకు తీసుకొని 12.80 ఎకరాల్లో మిర్చి, దోస, పత్తి సాగుచేయగా రూ.11.38 లక్షల నష్టం వాటిల్లింది. దాంతో ఆయన 2021 మార్చి 5న గడ్డిమందు తాడి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు. 


ఆత్మహత్యలకు ఇన్ని కారణాలు

బోరు బావుల వైఫల్యం 

వాణిజ్య పంటలపై పెరిగిన పెట్టుబడులు

పంటలకు కొరవడిన గిట్టుబాటు ధర

కౌలు రైతుకు దక్కని గుర్తింపుకార్డులు, బ్యాంక్‌ రుణాలు

రూ.లక్షపైన రుణాలకు వర్తించని పావలా వడ్డీ 

సహకార సంఘాల్లో రీషెడ్యూలింగ్‌ తప్ప మంజూరు కాని కొత్త రుణాలు 

కౌలురైతులు పంటల పెట్టుబడికోసం అధిక వడ్డీకి తెస్తున్న అప్పులు

కరువు, ప్రకృతి వైపరిత్యాలు, తెగుళ్ల దాడి

పిల్లల చదువులు, పెళ్లిళ్లకు చేసే అప్పులు


ఇంతేనా సాయం!

రైతుల్ని ఆదుకునేందుకు గత ప్రభుత్వం రుణమాఫీ, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఉచిత సూక్ష్మపోషకాలు, అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సాయం, మిర్చి, మామిడి వంటి పంటలకు అర్హులైన రైతన్నలకు బోనస్‌ అందజేసింది. అసంపూర్తిగా మిగిలిన రుణమాఫీని జగన్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. రైతుభరోసా-పీఎంకిసాన్‌ పథకం కింద ఒక్కోరైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున ఇస్తున్నట్లు సర్కారు చెబుతోంది. కానీ, 2019-20 రబీలో 49.45లక్షల రైతులకు, 2020-21లో 51.95లక్షల రైతుల ఖాతాలకు, 2021-22లో 52.38లక్షల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేసినట్లు రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు గుప్పించింది. అలాగే పంటల బీమా కింద 2019 ఖరీ్‌ఫలో రూ.1,252కోట్లు, 2020ఖరీ్‌ఫలో రూ.1,739కోట్లు ఇవ్వగా, 2021-22లో ఈ-క్రాప్‌ ద్వారా గుర్తించిన పంటలకు త్వరలో క్లెయిములు చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్‌లో రూ.1802.04కోట్లు ప్రతిపాదించింది. నెలరోజుల్లో ఖరీఫ్‌ మొదలవుతున్నా.. ఇంకా చెల్లింపులు జరపలేదు. 2019-20లో విపత్తులతో జరిగిన అన్ని రకాల పంటల నష్టానికి కలిపి 1.56లక్షల మంది రైతులకు రూ.123.69కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2020-21లో జూన్‌-అక్టోబరు మధ్య 4.65లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 3.80లక్షల రైతులు రూ.285.51కోట్లు ఇచ్చారు. 

Read more