ఎర్రకోట హింస వెనుక కేంద్రం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-02-28T21:53:41+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మూడు నెలలుగా..

ఎర్రకోట హింస వెనుక కేంద్రం: కేజ్రీవాల్

మీరట్: కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మూడు నెలలుగా జరుపుతున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన మద్దతు ప్రకటించారు. మీరట్‌లో ఆదివారం నిర్వహించిన 'కిసాన్ మహాపంచాయత్'లో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని రైతులు సంతోషంగా లేరని అన్నారు. దేశ రాజధాని సమీపంలో 90 రోజులకు పైగా రైతులు తమ కుటుంబాలతో సహా ఆందోళనలు జరుపుతున్నారని అన్నారు. ఈ మూడు నెలల్లోనే 250 మందికి పైగా రైతులు మరణించినా కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు.


జనవరి 26న చోటుచేసుకున్న ఎర్రకోట హింసకు కేంద్రాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఎర్రకోట హింస వెనుక ఉన్నది కేంద్రమే కానీ, రైతులు కారని అన్నారు. అసలు జరిగిందేమిటో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనకు తెలుసునని పేర్కొన్నారు. 'ఎర్రకోట హింస వెనుక ఉన్నది కేంద్రం, రైతులు కాదు. రైతులకు ఢిల్లీ రోడ్లు కూడా తెలియవు. అలాంటి వాళ్లను కేంద్రం తప్పుదారి పట్టించింది' అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆందోళన జరుపుతున్న రైతులు అనేక వేధింపులకు గురవుతున్నారని, బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటివి జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు.


'నిరసనకారులపై ఇప్పుడు తప్పుడు కేసులు కూడా బనాయిస్తున్నారు. రైతులు ఏవైనా కావచ్చు కానీ, ద్రోహులు మాత్రం కారు. అయినప్పటికీ వారిపై దేశద్రోహం అభియోగాలు మోపుతున్నారు. దేశమాత ఇద్దరి పుత్రుల్లో ఒకరు దేశ సరిహద్దులను కాపాడటంలో నిమగ్నమై ఉంట, ఇంకొకరు (రైతు) ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నాడు' అని కేజ్రీవాల్ అన్నప్పుడు సభలో 'జై జవాన్, జై కిసాన్' నినాదాలు హోరెత్తాయి. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు ఆప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మీరట్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-02-28T21:53:41+05:30 IST