నిండా మునిగిపోయాం

ABN , First Publish Date - 2022-05-20T07:15:13+05:30 IST

బొండాలు(ఎమ్‌టీయూ-3626) ధాన్యానికి మార్కెట్‌ లేదని, రబీలో ఆ రకాన్ని సాగుచేస్తే కొనుగోలు చేసే ప్రసక్తే లేదని అధికారులు ఇచ్చిన వార్నింగ్‌లకు అన్నదాత భయపడిపోయాడు. వారి ఒత్తిళ్ల మేరకు సన్నాలు(ఎమ్‌టీయూ-1121) రకాన్ని సాగుచేసి ఇప్పుడు నిండా మునిగిపోయామని రైతులు ఆక్రోషిస్తున్నారు.

నిండా మునిగిపోయాం

కరప, మే 19: బొండాలు(ఎమ్‌టీయూ-3626) ధాన్యానికి మార్కెట్‌ లేదని, రబీలో ఆ రకాన్ని సాగుచేస్తే కొనుగోలు చేసే ప్రసక్తే లేదని అధికారులు ఇచ్చిన వార్నింగ్‌లకు అన్నదాత భయపడిపోయాడు. వారి ఒత్తిళ్ల మేరకు సన్నాలు(ఎమ్‌టీయూ-1121) రకాన్ని సాగుచేసి ఇప్పుడు నిండా మునిగిపోయామని రైతులు ఆక్రోషిస్తున్నారు. బొండాలు రకంతో పోల్చితే దిగుబడి, ధర విషయాల్లో సన్నాలు రకం తేలిపోయింది. సన్నాలు రకం సరిగ్గా పండకపోవడానికి అధికారులు వేరే కారణాలు చూపుతున్నా గానీ బొండాలు వద్దని బలవంతంగా సన్నాలు సాగు చేయించి తమ కొంప ముంచారనే వాదన రైతుల నుంచి బలంగా వినిపిస్తోంది.  

అంతంతమాత్రంగా సన్నాల దిగుబడి

కాకినాడ జిల్లాలో 1,85,000 ఎకరాల్లో రైతులు రబీపంటను సాగుచేశారు.  దిగుబడులు బాగుంటాయని ఏటా రబీ సీజన్‌లో రైతులు బొండాలు రకాన్ని సాగుచేసేవారు. ఎఫ్‌సీఐ బొండాలు ధాన్యాన్ని తీసుకోవడం లేదని, కేరళ మార్కెట్‌ లేదని, అందువల్ల ఈ సీజన్‌ నుంచి అందరూ సన్న రకాలు సాగుచేయాలని వ్యవసాయశాఖాధికారులు రైతులపై ఒత్తిడిపెంచారు. తమ మాట కాదని బొండాలు సాగుచేస్తే కొనుగోలు చేసేది లేదని హెచ్చరించారు. ఇక చేసేది లేక అధికారుల సిఫార్స్‌ మేరకు 70శాతంపైగా విస్తీర్ణంలో ఎమ్‌టీయూ-1121 రకాన్ని సాగుచేశారు. ఇప్పుడు అన్నిచోట్ల కోతలు పూర్తయ్యి ధాన్యం మసూళ్లు జరుగుతున్నాయి. ఎకరాకు 30నుంచి 40బస్తాల మాత్రమే దిగుబడులు వస్తుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో మెజార్టీ సాగుదారులైన కౌలురైతులు కలత చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితుల్లో రైతుకు శిస్తులు ఎలా కట్టాలి అని మనోవేదనకు గురవుతున్నారు. అధికారుల ఆదేశాలతో సన్నాలు సాగుచేసి అన్నిరకాలుగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. 

బొండాలు ధాన్యానికి భలే గిరాకీ

అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా అప్పటికే విత్తనాలు సిద్ధం చేసుకుని ఉండడంతో జిల్లావ్యాప్తంగా 20శాతం విస్తీర్ణంలో రైతులు బొండాలు పండించారు. ఎప్పట్లాగే ఈ రకం ఎకరాకు దాదాపు 50బస్తాల దిగుబడినివ్వడంతోపాటుగా మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. 75కిలోల బస్తా ఏకంగా రూ.1,600 వరకు ధర పలుకుతూ రైతులకు సిరుల పంట కురిపిస్తోంది. సీఎంఆర్‌తో సంబంధం లేకుండా మిల్లర్లు పోటీపడి మరీ ఈ బొండాలు ధాన్నాన్ని క్యాష్‌ రూపంలో ఎక్కువ ధరకు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్ధేశిత ప్రమాణాలున్న సన్నాలు ధాన్యాన్ని రైతుభరోసాకేంద్రాల ద్వారా రూ.1,380కు కొనుగోలు చేస్తున్నారు. అధికారుల మాట విని సన్నాలు సాగుచేయడంతో దిగుబడులు కోల్పోయామని, బొండాలు ధరతో పోల్చితే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్‌ కేసు పెడతామన్నారు

బొండాలు సాగుచేస్తే పోలీస్‌ కేసు పెడతామని వలంటీర్లు బెదిరించారు. ఆ టోల ద్వారా ప్రచారం చేయించి మరీ బలవంతంగా సన్నాలు రకం సాగుచేయించా రు. ఊస తెగులు ఆశించి దిగుబడులు అమాంతం పడిపోయాయి. ఎకరాకు 25నుంచి 30 బస్తాలు దిగుబడి వచ్చింది. రైతుకు శిస్తు ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు.

-పెంకే బూరయ్య, కౌలురైతు కరప

నిండా మునిగిపోయాం

అధికారులు ఒత్తిడితో సన్నాలు రకం సాగు చేసి నిండా మునిగిపోయాం. అధి క వర్షాలతో ఖరీఫ్‌ను కోల్పోయాం. రబీలో సన్నాలు ఊడ్చి దెబ్బతిన్నాం. ఎకరాకు 25 బస్తాలు చొప్పున రైతుకు మగతా కట్టాలి. ఇన్సూరెన్స్‌, రైతుభరోసా వారికే ఇస్తున్నారు. ఇక కౌలు రైతు బతికేది ఎలా.

-పేపకాయల సూరిబాబు, కౌలురైతు, కరప

సన్నాలు రకం 48బస్తాల సరాసరి దిగుబడి

ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నాలు రకాన్ని ప్రోత్సహిం చాం. సాగు ఆలస్యమైన చోట, సారవంతంకాని భూములున్న చోట దిగుబడులు తగ్గి ఉండొచ్చు. జిల్లావ్యాప్తంగా సన్నాలు ధాన్యం 47-48బస్తాల సరాసరి దిగుబడి వచ్చింది. రైతులు ఇబ్బంది పడకూడదనే సన్నాలు వేయమని చెప్పాం.

-విజయ్‌కుమార్‌, వ్యవసాయశాఖ జేడీఏ 

రైతులను మోసం చేస్తున్నారు: పంతం నానాజీ, జనసేన పీఏసీ సభ్యులు

సర్పవరం జంక్షన్‌, మే 19: ధాన్యం కొనుగోళ్లలో రైతులను మిల్లర్లు, దళారులు, అధికారులంతా కలిపి మోసం చేస్తున్నారు. దీనివెనుక పెద కుంభకోణం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అక్రమాలపై అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తూర్పుగోదావరి జిల్లా సమీక్షలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో 17వేలమంది రైతులు ఆధార్‌ లింక్‌ కాలేదు. ఇందులో రైస్‌ మిల్లర్లు, దళారులు, అధికారుల జోక్యం ఉంది. ఆధార్‌ లింక్‌ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారు. బస్తా ధాన్యానికి రూ.200 పక్కకి వెళ్లిపోతున్నాయి. మిల్లర్లు, దళారుల కుంభకోణంపై మొదటినుంచి జనసేన పార్టీ డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బొండాల రకం ధాన్యం సాగు చేయవద్దని చెప్పినా అప్పటి వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఊరూర చాటింపు వేయించారు. ప్రస్తుతం బొండాల ధాన్యం ధర రూ.1500 నుంచి రూ.1600 పలుకుతోంది.

Updated Date - 2022-05-20T07:15:13+05:30 IST