నాడు వానలు.. నేడు కోత యంత్రాల కొరత

ABN , First Publish Date - 2021-12-06T05:59:55+05:30 IST

పది రోజుల క్రితం వరకు వాతావరణం అనుకూలంగా లేక వర్షాలు పడి కోతలు కోయడానికి వీలు లేకుండా పోయింది.

నాడు వానలు.. నేడు కోత యంత్రాల కొరత
కాకరపర్రు వద్ద పూర్తిగా పండి కోతకు రాని వరిచేను

అన్నదాతకు తప్పని కష్టాలు

పలుచోట్ల చేనంతా పండిపోయి కోతకు రాని వైనం

అధికారులు కోత యంత్రాలను రప్పించాలని వేడుకోలు

 పది రోజుల క్రితం వరకు వాతావరణం అనుకూలంగా లేక వర్షాలు పడి కోతలు కోయడానికి వీలు లేకుండా పోయింది. అనంతరం కోద్దామనుకుంటే చేలల్లో నీరు నిలిచి కోత మిషన్‌లు దిగేందుకు  ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చేను కోద్దామంటే మిషన్‌లు కొరతగా ఉన్నాయని ఈ లోపులో చేను పూర్తిగా పండిపోయి గింజ రాలిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

పెరవలి, డిసెంబరు 5: వరి చేలు పండిపోయి కోతకు వచ్చిన తరుణంలో కోత మిషన్‌లు దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  వారం రోజులుగా వాతావరణం పొడిగా ఉండి ఎండలు కాస్తుండటంతో  చేను కోద్దామని ప్రయత్నించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. కోత మిషన్‌లు కొరతగా ఉన్నందున గతంలో గంటకు 2 వేల 300 వసూలు చేయగా ప్రస్తుతం గంటకు 3 వేల రూపాయలు రేటు పెంచారని అయినప్పటికి ముందుగా అడ్వాన్సులు చెల్లించిన  వారికి మాత్రమే కోత కోస్తున్నారని వాపోతున్నారు.  ఈ ప్రాంతంలో కొంతమంది కమీషన్‌ ఏజెంట్లు వివిధ జిల్లాల నుంచి కోత మిషన్‌లు రప్పించి కోత కోయిస్తూ ఉంటారు. గతంలో తాము ఒప్పుకున్న రైతులకు మాత్రమే వరుస ప్రకారం కోత కోస్తున్నామని, కొత్తగా అడిగిన రైతులకు సమయం లేక కోయలేకపోతున్నామని చెబుతున్నారు. ఇదే విధంగా ఉంటే మరో నెల రోజులకు కూడా వరి కోతలు పూర్తిఅయ్యే పరిస్థితి  కానరావడం లేదని, అధికారులు వెంటనే స్పందించి కోత మిషన్లు ఇతర ప్రాంతాల నుంచి రప్పించాలని లేదంటే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. 

తణుకు:  ప్రస్తుతం తుఫాన్‌ ప్రభావం ఉండదన్న సమాచారంతో  రైతులు కోతలపై దృష్టి సారించారు. దీంతో ఒక్కసారిగా వరికోత యంత్రాలకు డిమాండ్‌ పెరిగిపోయింది. గతంలో మాదిరిగా సజావుగా కోతలు కోసే వెసులు బాటు వాతావారణం ఇవ్వడం లేదు.  దీంతో ఇప్పుడు చాలా మంది కోతల  పనుల్లో నిమగ్నమయ్యారు.  కొంతమంది రైతులు పెట్టుబడికి సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కోతలు అయ్యేవరకు వాతావరణం అనుకూలిస్తే  రైతులకు ఉపశమనం కలుగుతుంది.

Updated Date - 2021-12-06T05:59:55+05:30 IST