కేంద్ర చట్టాలపై రైతుల కన్నెర్ర

ABN , First Publish Date - 2020-12-04T05:15:56+05:30 IST

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు.

కేంద్ర చట్టాలపై  రైతుల కన్నెర్ర
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా ఒంగోలులో ప్రదర్శన నిర్వహిస్తున్న వివిధ రైతుసంఘాల నేతలు

జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు

ఢిల్లీలో రైతు ఉద్యమానికి సంఘీభావం

వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

ఒంగోలు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. తక్షణం కేంద్రం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు, నిరసనలు తెలిపారు. రైతుసంఘాల వారితో కలిసి సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు, కార్మిక ప్రజాసంఘాలు ఈ ఆందోళనలు నిర్వహించాయి. ఒంగోలులో రైతు సంఘర్షణ సమితి, వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూల్‌ రోడ్‌ ఫ్లైఓవర్‌ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రైతు సంఘర్షణ సమితి జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, సీపీఐ, వామపక్ష పార్టీల జిల్లా నాయకులు ఎంఎల్‌ నారాయణ, పూనాటి ఆంజనేయులు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎం. లలితకుమారి, రైతుసంఘాల ప్రతినిధులు చుంచు శేషయ్య, హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పామూరులో వామపక్షాల కార్యకర్తలు హైవేపై రాస్తారోకో చేయగా, సీపీఎం పశ్చిమ జిల్లా కమిటీ కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురంలో సీపీఎం ప్రజాసంఘాల కార్యకర్తలు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. అలాగే చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి, వీవీపాలెం, సీఎస్‌పురం, తర్లుపాడుతోపాటు పలు ప్రాంతాల్లోను ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కేంద్రచట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి రైతుల పక్షాన వైసీపీ ప్రభుత్వం నిలవాలని కోరారు. 

 

Updated Date - 2020-12-04T05:15:56+05:30 IST