అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన

ABN , First Publish Date - 2021-03-08T21:14:05+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన కొనసాగుతోంది.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన

తాడేపల్లి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి ఎండలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతున్నారు. ఏపీ సచివాలయం వైపు కవాతుగా వెళ్లేందుకు రైతులు సిద్ధపడ్డారు. అయితే రైతులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వెలగపూడి శిబిరంవైపు కవాతుగా వెళతామని చెప్పడంతో పోలీసులు అనుమతించారు. 


ఇవాళ ఉదయం ఆరుగంటల నుంచి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు అమ్మవారి గుడికి, అలాగే మేరీమాత చర్చికి వెళ్లాలని బయలుదేరారు. అయితే వారిని పోలీసులు మార్గమద్యలో ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొద్దిమంది ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 


 ఈ సందర్భంగా మహిళలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మేమేం పాపం చేసాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన పొట్టపై పొడిచారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదన్నారు.


జగన్‌కు పరిపాలన చేయడం చేతకావడంలేదని, ఇంత వరకు రాజధాని నిర్మాణం చేయలేదని మహిళలు విమర్శించారు. మహిళలను హింసపెడుతున్న దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీసులు, ఉద్యోగులను అడ్డంపెట్టుకుని డబ్బులు కుమ్మరించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం తప్పా అని మహిళలు నిలదీశారు.

Updated Date - 2021-03-08T21:14:05+05:30 IST