Advertisement

రైతులపై యుద్ధమా?

Nov 28 2020 @ 00:55AM

ప్రవేశికలో వ్యక్తమయిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరుస్తూ, ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న ఎన్నికల తంతు అంటేనే ఏవగింపు కలిగేలా ఉగ్రదుర్భాషల ప్రచారం ఒక వైపు జరుగుతుండగా, దేశానికి ఇప్పుడు జమిలి ఎన్నికలు రప్పించి ఏకస్వామ్యానికి రాచబాట వేయడమే తక్షణావసరమని దేశప్రధాని కొత్త చర్చలకు తెర తీస్తుండగా, లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించి తమ గొంతువినిపించాలని ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించే దాకా బైఠాయించడానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతాంగం చలో ఢిల్లీ పిలుపునిచ్చింది. వారికి సంఘీభావంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైతాంగ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు కూడా రాజధాని చేరారు. మరొకవైపు, గురువారం నాడు అనేక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రక సమ్మెకు, గ్రామీణ సమ్మెకు పిలుపునిచ్చాయి. పది దాకా కార్మిక సంఘాలు, అనేక ప్రజాసంస్థలు సమష్టి ఆస్తులను వ్యక్తులకు, జాతి సంపదను కంపెనీలకు విక్రయించవద్దని అభ్యర్థించడానికి ఈ పిలుపునిచ్చాయి. నూటా ముప్పైకోట్ల జనాభాలో సుమారు పాతిక కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సార్వత్రక సమ్మెలో పాలుపంచుకున్నారు. చరిత్రాత్మక సమ్మె, రైతుల చలో ఢిల్లీ శతాధికకోట్ల మంది ఆకాంక్షలను, ఆవేదనలను ప్రతిధ్వనిస్తున్నవి. అయినా, భద్రజీవులకు, జ్ఞానేంద్రియాలకు తాళాలు బిగించిన వారికి మాత్రం ఇదంతా ఒక ఐపిఎల్ ఆట పాటిది కూడా కాకపోవడం విషాదం. ఏవి నిజమైన సమస్యలో, ఏవి కల్పితమైన కృత్రిమమైన చర్చాంశాలో తెలియనంతగా, రాజకీయాల సంరంభం పెరిగిపోయింది. ఏవి ప్రాధాన్యాలో, ఏవి వార్తలో గుర్తించలేనంతగా మీడియా సమాచారంలో కూరుకుపోయింది


గురువారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర రాజధానులలో ఊరేగింపులు, ర్యాలీలూ జరిగాయి. వాటికి కూడా అనేక నిర్బంధాలు ఎదురయ్యాయి. ఇక, ఢిల్లీ ముట్టడి కోసం వస్తున్న రైతాంగం కోసమైతే, పరాయి ఆక్రమణను నిరోధిస్తున్నంత సన్నద్ధతతో ఢిల్లీ పోలీసు యంత్రాంగం మోహరించింది. ఢిల్లీ నగర పొలిమేరల్లో, పెద్ద పెద్ద బారికేడ్లతో తోపుడు యుద్ధం చేయడం, నీటి ఫిరంగులను ఎదుర్కొనడం రైతులకు వినోదమూ కాదు, కాలక్షేపమూ కాదు. వారిది జీవన్మరణ పోరాటం. దేశభక్తులమని, జాతీయవాదులమని డంబాలు పలికేవారే, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, ప్రపంచమార్కెట్‌కు అంగడిసరుకుగా మార్చినప్పుడు, రైతు ఆక్రోశం అరణ్యరోదనమే. మిత్రపక్షమే తెగించి, ఛీ కొట్టవలసిన పరిస్థితి. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని కొట్టి ఎవరికి దఖలుపరచడానికి విధానాలు రూపొందిస్తున్నారు? ప్రజలు మొరపెట్టుకోవడానికే కదా, రాజభవనాలూ రాజధానులూ ఉండేది! హర్యానా నుంచి ఢిల్లీకి వస్తున్న రైతులను నిరోధించడానికి బాష్పవాయువులు ప్రయోగిస్తారా? హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అయితే, తమ రాష్ట్రం నుంచి రైతులు బయటకు వెళ్లకుండా నిరోధించడానికి అనుసరించని నిర్బంధవిధానం లేదు. లక్షల మంది వస్తున్నారు, వాళ్లను అరెస్టు చేస్తే లాకప్‌లు సరిపోవు, స్టేడియం‌లు కావాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని అడుగుతారా? క్రీడామైదానాల్లో మనుషులను బంధించే లాటిన్ అమెరికా నమూనాలను ఇప్పుడే అమలు చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. రైతులంటే ఉగ్రవాదులా, వాళ్లు చెబుతున్నదేమిటో వినవచ్చును కదా, వాళ్ల డిమాండ్ల మీద చర్చలు జరపవచ్చు కదా అని కేజ్రీవాల్ ప్రభుత్వం వేసిన ప్రశ్నలే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా వేస్తారు. ఏమనుకున్నారో ఏమో, శుక్రవారం మధ్యాహ్నానికి రాజధాని నగరంలోకి రైతులను అనుమతించారు. వివిధ రైతాంగ సంఘాలతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారో లేదో తెలియదు. 

వివాదాస్పదమైన మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలపై ప్రధానంగాను, ఇతర రైతాంగ సమస్యలపైనా రైతాంగం ఆగ్రహంతో ఉన్నది. దానితో పాటు, పారిశ్రామిక రంగంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, పది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు సార్వత్రక సమ్మెకు ఉద్యమించారు. ఈ సమ్మెలో కూడా కార్మికులు, రైతులు కలిసి పెద్దస్థాయిలో పాల్గొనడం విశేషం. ప్రజల సంక్షేమానికి, ప్రభుత్వ నిర్వహణ దక్షతకు మారుపేరుగా ఉన్న జీవిత బీమా సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం చురుకుగా చేస్తున్న ప్రయత్నాలు, అనేక ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఉపాధి భద్రతకు హాని కలిగించే, పని పరిస్థితులను కఠినతరం చేసే చట్టసవరణలు చేయడం-.. వీటన్నిటి కారణంగా కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్వేగపూరితమైన అంశాలతో, మాయమాటలతో పాలకులు ప్రజలను మభ్యపెడుతున్న సమయంలో, వాస్తవ సమస్యలను వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నించినందుకు కార్మిక, కర్షక నేతలను అభినందించాలి.


కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలు రైతులకు గిట్టుబాటు ధర అవకాశాలను దెబ్బతీస్తాయని, వ్యవసాయంపై కార్పొరేట్ల ఆధిపత్యాన్ని నెలకొల్పుతాయని రైతాంగం ఆందోళన చెందుతోంది. ధనిక రైతాంగం ఉన్న రాష్ట్రాలలో ఈ ఆందోళన తీవ్రంగా ఉన్నది. వ్యవసాయ చట్టాల దుష్ఫలితాల నుంచి రక్షణ కోసం విస్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభిస్తే తప్ప, రైతులు సంతృప్తి చెందరు. ఢిల్లీ బైఠాయింపు ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.