తాగ్యాలకు.. విలువేది? ప్రాణ సమానమైన భూములిచ్చాం..

ABN , First Publish Date - 2020-08-08T15:05:31+05:30 IST

రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ ప్రాణ సమానమైన భూములను ఇచ్చామని, ఇప్పుడు త్యాగాలకు విలువ లేకుండా పోతోందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు

తాగ్యాలకు.. విలువేది? ప్రాణ సమానమైన భూములిచ్చాం..

ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి

రాజధాని రైతుల ఆందోళన

234వ రోజుకు చేరిన నిరసనలు 


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి(గుంటూరు): రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ ప్రాణ సమానమైన భూములను ఇచ్చామని, ఇప్పుడు త్యాగాలకు విలువ లేకుండా పోతోందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం శుక్రవారం 234వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిలో ఇప్పటికే రూ.వేల కోట్లతో నిర్మించిన నిర్మాణాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రకటనతో వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. పెట్టుబడుదారులు  రాష్ట్రం వైపు కన్నెత్తి చూసే  పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థలు రైతులు పక్షానే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. శ్రావణశుక్రవారం సందర్భంగా తుళ్లూరు, వెలగపూడి, అబ్బురాజుపాలెం, నీరుకొండ, అనంతవరం, బోరుపాలెం, నేలపాడు, ఐనవోలు, పెదపరిమి తదితర గ్రామాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. న్యాయదేవత ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ వరం ప్రసాదించు తల్లీ అంటూ వేడుకున్నారు.  


ప్రధాని శంకుస్థాపన  చేసిన ఉద్దండ్రాయునిపాలెం ప్రదేశంలో శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు వినూత్న నిరసన తెలిపారు. నలుపు, ఎరుపు, తెలుపు పావురాలను ఎగరవేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో అమరావతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు వెలిగించి మహిళా రైతులు ప్రతిజ్ఞ పూనారు.  తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ మంగళగిరి మండలం యర్రబాలెం రైతులు నిరసన చేపట్టారు. రైతు సంఘ  నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఒకే రాజధానితోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మూడు రాజధానులకు  వ్యతిరేకంగా సీపీఎం రాజధాని డివిజన్‌ నాయకులు  తుళ్లూరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. డివిజన్‌  కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి రాజధాని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో  జొన్నకూటి వీర్లంకయ్య, భాగ్యరాజు, పేరం బాబురావు, గడ్డం కృృష్ణ, కుంభా ఆంజనేయులు, నవీన్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-08T15:05:31+05:30 IST