రైతును ఆదుకోలేని పాలకులెందుకు?

ABN , First Publish Date - 2021-01-22T06:44:18+05:30 IST

రైతు కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు.

రైతును ఆదుకోలేని పాలకులెందుకు?
గుడ్లవల్లేరులో ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్న కొనకళ్ల తదితరులు

మాజీ ఎంపీ కొనకళ్ల ఆగ్రహం

గుడ్లవల్లేరులో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

గుడ్లవల్లేరు, జనవరి 21 : రైతు కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. గురువారం గుడ్లవల్లేరులో మండల రైతులకు మద్దతుగా టీడీపీ నిర్వహిం చిన మహాధర్నా, ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతులకు అండగా ఉంటామని చెప్పిన జగన్మోహనరెడ్డి, అధికారంలోకి వచ్చాక రైతులను నిలువునా ముంచార న్నారు. గుడ్లవల్లేరు మండలంలో 38,500 ఎకరాల పంట నష్టపోతే 3,150 ఎకరాలకు మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారని, మిగిలిన రైతుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, వెంటనే రైతులకు డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరావు మాట్లాడుతూ, పంటల బీమాను వెంటనే విడుదల చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించాలని కోరారు. మండల టీడీపీ కార్యాలయం నుంచి గుడ్లవల్లేరు ప్రధాన కూడలివరకూ ట్రాక్టర్లు, బైక్‌లతో రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌, గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి, ఆర్‌ఐకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఏఎంసీ మాజీ చైర్మన్‌ వల్లభనేని వెంకట్రావు, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు జె.మోహననావు, మచిలీపట్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T06:44:18+05:30 IST