అప్పటి వరకు ఆందోళన ఆగదు: స్పష్టం చేసిన రైతు సంఘాలు

ABN , First Publish Date - 2021-11-21T23:07:19+05:30 IST

సాగు చట్టాల రద్దుపై రైతు సంఘాలంతా కలిసి చర్చించాయి. ఈ చర్చలో మేం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆందోళనను ఇంకా కొనసాగించాలని అనుకున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకున్నాం...

అప్పటి వరకు ఆందోళన ఆగదు: స్పష్టం చేసిన రైతు సంఘాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినప్పటికీ.. వాటిని చట్ట సభల్లో అధికారంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరపై (ఎమ్‌ఎస్‌పీ) చట్టం చేసినప్పుడే తమ ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. రైతులను అంచనా వేయడంలో విఫలమయ్యామని, వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే రైతులు ప్రధాని చేసిన ప్రకటనతో సంతృప్తి చెందడం లేదు. సాగు చట్టాల రద్దును అధికారంగా కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వని కనీస మద్దతు ధరపై చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నారు.


‘‘సాగు చట్టాల రద్దుపై రైతు సంఘాలంతా కలిసి చర్చించాయి. ఈ చర్చలో మేం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆందోళనను ఇంకా కొనసాగించాలని అనుకున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఐక్య వేదిక) ఆధ్వర్యంలో తదుపరి ఆందోళన కొనసాగుతుంది’’ అని ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతంలో ఉన్న సింఘు ప్రదేశంలో ఆందోళన నిర్వహిస్తున్న బల్బీర్ సింగ్ రాజేవల్ అనే రైతు నేత స్పష్టం చేశారు.


కాగా, సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవడం పట్ల పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణమని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సుధీర్ఘ కాలంగా నిరసనలో ఉన్న రైతుల్లో సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. అయితే వీటిని ఎంత మాత్రం లెక్క చేయమని ప్రభుత్వం ఎన్నికలకు భయపడే చట్టాల్ని వెనక్కి తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2021-11-21T23:07:19+05:30 IST