గుండెజల్లు

ABN , First Publish Date - 2020-11-13T07:03:34+05:30 IST

అతివృష్టి రైతుల ఉసురుతీస్తోంది.

గుండెజల్లు
భారీ వర్షాల హెచ్చరికలతో రైతులు బెంబేలు

భారీ వర్షాల హెచ్చరికలతో రైతులు బెంబేలు

కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి

ఇప్పటికే భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు

మళ్లీ వర్షాలంటే కష్టమే..

అతివృష్టి రైతుల ఉసురుతీస్తోంది. ఇప్పటికే అక్టోబరులో సంభవించిన భారీ వర్షాలు, వరదలకు కోలుకోలేని దెబ్బతిన్న అన్నదాతలు తాజా భారీ వర్షాల హెచ్చరికలతో భయాందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. 

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : ఈనెల 16వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా రైతులు వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీనికితోడు దీపావళి అమావాస్య రానుండటంతో వర్షాలు మరింత కురుస్తాయని రైతులు పేర్కొంటున్నారు. వరి, పత్తి పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళనలో పడ్డారు. రెండు రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. గురువారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతుల్లో వణుకు ప్రారంభమైంది. 

పంట చేతికొచ్చే దశలో..

ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2.41 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. వరిపైరు కోత దశకు చేరింది. అమావాస్య అనంతరం కోతలు కోసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ తరుణంలో వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో రైతుల్లో అలజడి మొదలైంది. వరిపైరు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు పడితే పైరు నేలరాలుతుందని, కిందపడిన పైరుపై వర్షపునీరు చేరితే వరి కంకులు మొలకెత్తుతాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది సన్నరకం వరి వంగడాలను రైతులు అధికంగా సాగు చేశారు. సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాల కారణంగా వరిపైరు ఎత్తుగా ఎదగడంతో దుబ్బులు బలహీనపడ్డాయని, కంకులు పాలుపోసుకున్నాక పైరు నేలవాలిందని, ఇప్పటికే కంకులు నీటిలో తేలియాడుతున్నాయని, ఇప్పుడు వర్షం కురిస్తే కంకులు మొలకెత్తుతాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది వరి పొలాల్లో ఆరుదల లేకపోవడంతో పైరు దుబ్బు చేయలేదని, దీంతో దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. భారీ వర్షం కురిస్తే ఎకరాకు నాలుగు నుంచి ఐదు బస్తాల దిగుబడి తగ్గుతుందంటున్నారు. వరిసాగు నిమిత్తం  ఎకరాకు రూ.18వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేశామని, పంట చేతికి రాకుంటే సాగు నిమిత్తం పెట్టిన పెట్టుబడిని కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. 

పత్తికి మరింత నష్టం

జిల్లాలో పత్తి 47వేల హెక్టార్లలో సాగవుతోంది. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే దె బ్బతిందని రైతులు చెబుతున్నారు. నందిగామ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైరును లాగేశారు. ఎకరాకు రూ.15వేలు కౌలుగా, మరో రూ.15వేలు పెట్టుబడిగా పెట్టామని, తీతదశకు వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో  పెట్టుబడిపై ఆశలు వదులుకోవాల్సిన స్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.   ఇప్పటికే పత్తిసాగులో పెట్టుబడులు పూర్తిస్థాయిలో పెట్టామని, పత్తితీతలు ప్రారంభమై విక్రయించే సమయంలో వాతావరణం అనుకూలంగా లేదని రైతులు లబోదిబోమంటున్నారు. భారీవర్షం కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న పత్తి నీటిలో తడిచి రంగు మారిపోతుందని, దీంతో ధర తగ్గుతుందంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా 6,666 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రూ.192.72 కోట్ల మేర రైతులు నష్టపోయారు. వరి, పత్తి 22,849  ఎకరాల్లో దెబ్బతినగా, రైతులు రూ.183.30 కోట్లను నష్ట్టపోయారు. వర్షాలు పడి మళ్లీ నష్టం జరిగితే ఈ ఏడాది తాము కోలుకోవడం కష్టమేనని రైతులు భయపడుతున్నారు. 

Updated Date - 2020-11-13T07:03:34+05:30 IST