పుంత రోడ్లను స్వచ్ఛందంగా అభివృద్ధి చేసుకున్న రైతులు
స్వచ్ఛందంగా పుంత రోడ్లు నిర్మించుకున్న రైతులు
పెంటపాడు, మార్చి 27: పొలాలకు వెళ్ళేందుకు, ధాన్యాన్ని తరలించుకునేందుకు పుంత రోడ్లు సరిగా లేక ఆ రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏఎంసీ నుంచి వచ్చే నిధులతో పుంత రోడ్లు అభివృద్ధి చెందుతాయని ఎదురు చూశారు. అయితే సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో వారే స్వచ్ఛందంగా పుంత రోడ్ల అభివృద్ధికి నడుం బిగించారు. దర్శిపర్రు రైతులంతా రూ. 10 లక్షలతో మురుగు కాలువ గట్టు వద్ద 2 కిలోమీటర్లు, సాహెబ్ల చెరువు వద్ద 2 కిలోమీటర్లు, కుంట వద్ద 1 కిలోమీటరు మొత్తం 5 కిలోమీటర్ల పుంత రోడ్డును స్వచ్ఛందంగా నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షుడు రుద్ర కాశీ, ఉప సర్పంచ్ కోలా మార్కండేయులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో రైతులంతా స్వచ్ఛందంగా రహదారిని నిర్మించుకున్నామన్నారు.