ప్రభుత్వ సాయం కోసం రైతుల ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-09-16T04:31:25+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వ సాయం కోసం రైతుల ఎదురుచూపు
పాత మంచిర్యాలలో గోదావరి వరదలో మునిగిన పత్తి పంట(ఫైల్‌)

- భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు
-జిల్లాలో 3 వేల ఎకరాల పైబడి నష్టం
-అంచనాలు రూపొందించిన వ్యవసాయశాఖ

మంచిర్యాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది  మంచి దిగుబడి వస్తుందని సంబర పడ్డ రైతన్న ఆశలన్నీ ప్రకృతి వైపరీత్యం కారణంగా అడియాశలయ్యాయి. ఇటీవల కురిసిన  వర్షాలకు భారీ వరదలతో రైతుల రెక్కల కష్టం వరద పాలైంది. జిల్లాలో నమోదైన వర్షాల కంటే ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి పెద్ద మొత్తంలో వరద చేరి అధిక నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హాజీపూర్‌ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో గోదావరి ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లోని చేలలోకి భారీగా వరద చేరింది. చెన్నూరు మండలంలోని అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెల మొదటి వారంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 3 వేల పై చిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవ సాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  
పంట నష్టం ఇలా..
అకాల వర్షాల కారణంగా జిల్లాలో 3486 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారు చేసి ప్రభు త్వానికి సమర్పించారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన 1918 మంది రైతులకు సంబంధించిన సుమారు రూ. 94 లక్షల విలువ గల పత్తి, వరి, కంది పంటలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లింది. వరదల కారణంగా పత్తి పంటకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లగా రెండో స్థానంలో వరి ఉంది. వివిధ మండలాల్లో కలిగిన నష్టం వివరాలు ఇలా ఉన్నాయి...
మండలం          రైతుల సంఖ్య    నష్టం ఎకరాల్లో
------------------------------------------------------------------
మంచిర్యాల     47         179
నస్పూర్‌          3          21
లక్షెట్టిపేట      5           7
హాజీపూర్‌      4           1.20
దండేపల్లి        149         159
జన్నారం        109         130
చెన్నూరు        817        1226
జైపూర్‌        258         513
కోటపల్లి        459         894
బెల్లంపల్లి          6          10
కాసిపేట        10           8
భీమిని        40         329
కన్నెపల్లి        11           9
             ------        ------------
మొత్తం           1918         3486.20
            ---------         ------------
అత్యధికంగా చెన్నూరు మండలంలో..
అకాల వర్షాల కారణంగా జిల్లాలో అత్యధికంగా చెన్నూరు మండలంలో అధిక నష్టం వాటిల్లగా, కోటపల్లిలోనూ భారీ నష్టం వాటిల్లింది. అన్నారం బ్యాక్‌ వాటర్‌ కారణంగా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో వేలాది ఎకరాల పంట నీట మునగగా, కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి ఉప్పొంగి జిల్లా కేంధ్రంలోని పాత మంచిర్యాల వద్ద దాదాపు 180 ఎకరాల మేర పత్తి పూర్తిగా నీట మునిగింది. ఏపుగా పెరిగిన పంట ఒక్కసారిగా వరద పాలు కావడంతో రైతులు విలవిలలాడుతున్నారు. అప్పో, సప్పో చేసి సాగు చేస్తే ప్రకృతి వైపరీత్యం కారణంగా చేతికి చిల్లి గవ్వ వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ,వ్యవసాయ శాఖలు పంట నష్టం అంచనా వేసినందున ప్రభుత్వం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
రెండెకరాల పత్తి నీట మునిగింది..
 పిల్లి రాజేష్‌, రైతు, కోటపల్లి మండలం రాంపూర్‌

భారీ వర్షాలకు రెండెకరాల పత్తి పూర్తిగా నీట మునిగింది. పంట సాగుకు ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశాం.  ఆరుగాలం శ్రమిం చి పత్తిసాగు చేస్తే మొలకల దశలోనే తీరని నష్టం వాటిల్లింది. నష్టపో యిన పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
పత్తి, వరి పంటలకు నష్టం..
వినోద్‌కుమార్‌, వ్యవసాయశాఖ జిల్లా అధికారి

భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా పత్తి, వరి, కంది పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్‌  ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో నష్టపోయిన పంట అంచనా రూపొందించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశాం.

Updated Date - 2021-09-16T04:31:25+05:30 IST