రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాడతాం: ఫారూఖ్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2021-12-06T00:42:47+05:30 IST

ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఫారూఖ్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఉన్న పెద్ద వ్యక్తి కశ్మీర్ టూరిజం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కశ్మీర్ అంటే టూరిజం మాత్రమేనా? కశ్మీరీలకు ఇస్తామన్న 50 వేల ఉద్యోగాల మాట ఏమైంది?..

రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాడతాం: ఫారూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌ కోల్పోయిన హక్కుల్ని తిరిగి సాధించుకోవడానికి రైతుల ఆందోళన తరహాలో ఉద్యమిస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు. తన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు అయిన షేక్ అబ్దుల్లా జయంతి సందర్భంగా ఆదివారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఫారూఖ్ ప్రసంగించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


‘‘నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. 700 మంది రైతులు ప్రాణ త్యాగం చేస్తే కానీ నల్ల చట్టాలు రద్దవ్వలేదు. రైతుల స్ఫూర్తితోనే మనం కూడా పోరాటం చేద్దాం. దేనికీ వెనకడుగు వేసేది లేదు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రస్థాయి హోదాతో పాటు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పునరుద్ధరణ జరిగే వరకు పోరాడదాం. దానికోసం ఎలాంటి త్యాగానికైనా మనం సిద్దమై ఉండాలి’’ అని ఫారూఖ్ అన్నారు.


ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఫారూఖ్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఉన్న పెద్ద వ్యక్తి కశ్మీర్ టూరిజం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కశ్మీర్ అంటే టూరిజం మాత్రమేనా? కశ్మీరీలకు ఇస్తామన్న 50 వేల ఉద్యోగాల మాట ఏమైంది? ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉన్న ఉద్యోగాలనే నాశనం చేశారు. ఇక కొత్తవేం ఇస్తారు?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఫారూఖ్ విమర్శించారు.

Updated Date - 2021-12-06T00:42:47+05:30 IST