హైదరాబాద్‌లో సంచలనం రేపిన హత్యకేసు మిస్టరీ వీడింది..

ABN , First Publish Date - 2021-04-19T13:14:07+05:30 IST

సంచలనం రేపిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సత్నామ్‌సింగ్‌ హత్యకేసును

హైదరాబాద్‌లో సంచలనం రేపిన హత్యకేసు మిస్టరీ వీడింది..

  • పంజాబ్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. రిమాండ్‌


హైదరాబాద్/చిక్కడపల్లి : నగరంలో సంచలనం రేపిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సత్నామ్‌సింగ్‌ హత్యకేసును చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. ఈనెల 1న తెల్లవారురజామున చిక్కడపల్లి సూర్యనగర్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే సత్నామ్‌సింగ్‌ను గొంతుకోసి హత్యచేసి, పరారైన ఘటనలో ముగ్గురు నిందితులను అరె్‌స్టచేసి రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ చల్లా శ్రీధర్‌ చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకరరావు, డీఐ హెచ్‌ ప్రభాకర్‌తో కలిసి వివరాలను ఆదివారం వెల్లడించారు. 


పంజాబ్‌ తర్న్‌ తరన్‌కు చెందిన శర్వాన్‌ సింగ్‌(42), బల్జీత్‌కౌర్‌(32)కు పదిహేనేళ్ల కిందట వివాహం జరిగింది. శర్వాన్‌సింగ్‌ చిన్నాన్నకొడుకు సత్నామ్‌సింగ్‌ వదిన వరసైన బల్జీత్‌కౌర్‌పై కన్నేశాడు.అప్పటికే శర్వాన్‌సింగ్‌, బల్జీత్‌కౌర్‌కు ఐదేళ్ల కొడుకు నిషాన్‌సింగ్‌ ఉన్నాడు. పదేళ్లకిందట సత్నామ్‌సింగ్‌, బల్జీత్‌కౌర్‌ను తీసుకొని పంజాబ్‌ నుంచి పారిపోయారు. దీంతో శర్వాన్‌సింగ్‌తోపాటు ఆయన కుమారుడు నిషాన్‌సింగ్‌ సత్నామ్‌సింగ్‌పై పగ పెంచుకున్నారు.  వారికోసం పదేళ్లుగా గాలిస్తున్నారు. సత్నామ్‌సింగ్‌ సోదరుడి సెల్‌ఫోన్‌ద్వారా వారు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు  2019 మార్చిలో  తెలుసుకున్నారు. శర్వాన్‌సింగ్‌ కుమారుడి ద్వారా సత్నామ్‌సింగ్‌, బల్జీత్‌కౌర్‌కు గతనెల ఫోన్‌ చేయించి తనను చూసేవారే లేకుండా పోయారని తనకు ఏదైనా పని ఇప్పించాలని కోరాడు. 


గతనెల 7న సత్నామ్‌సింగ్‌ నిర్వహిస్తున్న నారాయణగూడ పంజాబ్‌ ఫుడ్‌హౌ్‌సలో తల్లి అంగీకారంతో నిషాన్‌సింగ్‌ పనికి కుదిరాడు.  ఇటీవల బల్జీత్‌కౌర్‌ కొడుకుతో అఫ్జల్‌గంజ్‌లోని గురుద్వారాకు వెళ్లి అక్కడే సేవలందిస్తూ క్వార్టర్లలో నివసిస్తోంది. గమనించిన నిషాన్‌సింగ్‌ తన తండ్రికి సమాచారం ఇచ్చి సత్నామ్‌సింగ్‌ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడని చెప్పాడు. శర్వాన్‌సింగ్‌ తన చెల్లెలి కొడుకు అర్షదీప్‌ సింగ్‌(20)తో కలిసి పంజాబ్‌ నుంచి 31న సికింద్రాబాద్‌కు వచ్చారు. ఉదయం 11 గంటలకు  రైల్వేస్టేషన్‌లో కలిసిన నిషాన్‌సింగ్‌ వారిని సూర్యానగర్‌కు తీసుకుని వచ్చి సత్నామ్‌సింగ్‌  ఉంటున్న ఇంటిని చూపించాడు. ఏమీ తెలియనట్లుగా సత్నామ్‌సింగ్‌తో కలిసి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లిపోయాడు.


రాత్రి 11.45 గంటలకు నిషాన్‌సింగ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో శర్వాన్‌సింగ్‌, అర్షదీ్‌పసింగ్‌ సూర్యనగర్‌లోని సత్నామ్‌సింగ్‌ ఇంటికి చేరుకున్నారు. అర్షదీ్‌పసింగ్‌ తలుపువద్ద కాపలా ఉండగా శర్వాన్‌సింగ్‌, నిషాన్‌సింగ్‌లు సత్నామ్‌సింగ్‌ను కొట్టి కింద పడేశారు. నిషాన్‌సింగ్‌ పెద్ద కత్తితో శర్వాన్‌సింగ్‌ మరో కత్తితో సత్నామ్‌సింగ్‌ గొంతు కోస చంపేశారు. రాత్రి 12.36 గంటలకు హతుడి సెల్‌ఫోన్‌ తీసుకుని ముగ్గురు నిందితులు అక్కడినుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లిపోయి రాత్రి అక్కడే ఉన్నారు. ఈనెల 2న ఢిల్లీకి చేరుకున్నారు.  అక్కడ హతుడి ఫోన్‌ అమ్మేందుకు ప్రయత్నించగా బిల్‌, ఐడీ ప్రూఫ్‌ను షాప్‌వారు అడగడంతో ఆ ఫోన్‌ను అక్కడే పడేసి పంజాబ్‌కు చేరుకున్నారు. 


మృతుడి భార్య బల్జీత్‌కౌర్‌ ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను, నిందితుల కాల్‌డేటాలను పరిశీలించిన పోలీసులు కేసును దర్యాప్తు ప్రారంభించారు. పంజాబ్‌కు రెండు ప్రత్యేకబృందాలను పంపించారు. హత్య జరిగిన 17 రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన అదనపు ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌.ప్రభాకర్‌, ఎస్‌ఐ కోటేష్‌, కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, సందీప్‌, రామాంజనేయప్రసాద్‌కు రివార్డులు అందజేస్తామన్నారు. 

Updated Date - 2021-04-19T13:14:07+05:30 IST