వేగంగా సెకండ్‌వేవ్
ప్రజల్లో కనిపించని జాగ్రత్తలు
మే వరకూ కరోనా ఎఫెక్ట్..?
కడప, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాలో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 8గంటల్లోపు 149 మందిలో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటినలో వెల్లడించింది. ఈ ఏడాది ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే వైరస్ ఎంత తీవ్రంగా ప్రబలుతోందో అర్థమవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 56,460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 534 మంది మృతి చెందారు. కరోనా నుంచి 55,440 మంది కోలుకున్నారు.
సెకండ్ వేవ్ ఉధృతం
జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్ చుట్టేస్తోంది. బుధవారం నమోదైన కేసులను చూస్తే కడప, రామరాజుపల్లె, ఎన్జీవో కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 27 కేసులు నమోదయ్యాయి. రాయచోటిలో 10, ప్రొద్దుటూరు పారంతంలో 15 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జమ్మలమడుగు, పులివెందుల, వేముల, లక్కిరెడ్డిపల్లె, ఖాజీపేట, నందిమండలంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ సోకింది. కడప నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 36 మంది కరోనా బారిన పడ్డారు. వారందరినీ హోం ఐసోలేషనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సీకేదిన్నె, పెండ్లిమర్రి, రాయచోటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నారు. వైద్యాధికారులు ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే మరికొంత మంది కరోనా బారిన పడతారు.
జనంలో లెక్కలేనితనం
జిల్లాలో మార్చి నెలలో మొత్తం 445 కేసులు నమోదైతే, ఏప్రిల్ 1 నుంచి 7 లోపే 467 మంది వైరస్ బారిన పడ్డారు. దీన్ని బట్టి చూస్తే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది. సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ జనం లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా పత్రికాప్రకటనలకే పరిమితమవుతోంది. షాపింగ్‌కాంప్లెక్స్‌లు, సూపర్మార్కెట్లు, హోటల్స్, సినిమాథియేటర్లలో కనీస కరోనా నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ కొందరు విచ్చలవిడిగా తిరిగే స్తూ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతున్నారు.
మే వరకూ ఇదే పరిస్థితి
కరోనా వైరస్ ఉధృతి మే చివరి వరకు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు రోజుకు 300 దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. లక్షణాలు లేకపోవడంతో ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి నెలకొంది. వైర్‌సను కట్టడి చేయాలంటే వ్యాక్సినతో పాటు కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.
వారం రోజుల్లో నమోదైన కేసులు
తేది కేసులు
1 63
2 21
3 75
4 54
5 31
6 74
7 149
కరోనాపై యుద్ధానికి సిద్ధం..!
కడప సర్వజన ఆసుపత్రిలో 310 పడకలు
ఇప్పటికై హజ్ హౌస్ అందుబాటులో
కరోనా కట్టడికి వ్యాక్సిన కీలకం
కడప(సెవెనరోడ్స్), ఏప్రిల్ 7: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కొవిడ్-19 తగ్గుతున్నట్లు తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి కడప సర్వజన ఆసుపత్రిని సిద్ధం చేశారు. గత ఏడాది కరోనా మొదటి దశలో జిల్లా యంత్రాంగం, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తూ కొంతవరకు కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడారని చెప్పవచ్చు. ప్రస్తుతం సెకండ్ వేవ్ మొదలై క్రమేణా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సర్వజన ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై ప్రత్యేకంగా కొవిడ్ వార్డులను, ఆక్సిజన బెడ్లతో కూడుకున్న పడకలను ఏర్పాటు చేశారు. అనునిత్యం అందుబాటులో ఉండే వైద్యులు, వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 310 పడకలతో సిద్ధంగా ఉంది. అందులో 200 బెడ్లు వెంటిలేటర్లతో ఉన్నాయి. అలాగే 520 బెడ్లతో ఫాతిమా మెడికల్ కాలేజిని తిరిగి వినియోగంలోకి తేవడానికి పరిశీలిస్తున్నారు. అందులో 500 ఆక్సిజన బెడ్లు ఉన్నాయి. ఇప్పటికే హజ్‌హౌస్‌ను కూడా వినియోగించుకుంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఎక్కువ మంది హోం క్వారంటైనలోనే ఉన్నారు. కాగా.. గత సంవత్సరం వైరస్ ఉధృతంగా ఉన్నప్పుడు తాత్కాలిక వైద్య సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. వైరస్ ఉధృతి తగ్గడంతో వారి సేవలను ఆపారు. మళ్లీ వైరస్ ఉధృతి పెరుగుతుండడంతో అవసరమైతే వైద్యసిబ్బందిని మూడు నెలల కాల పరిమితికి తీసుకోవడానికి జిల్లా అఽఽధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
వ్యాక్సినతో కరోనా కట్టడి
కరోనా నివారణకు వచ్చిన వ్యాక్సిన తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల కరోనా సోకినప్పటికీ మనిషి శరీరంపై వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రజలు భయాందోళనలు, అపోహలు వీడి వ్యాక్సిన వేయించుకోవడానికి ముందుకు రావాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు వ్యాక్సిన వేయడానికి వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారు. వ్యాక్సిన వేయించుకోవాలి అనుకున్న 45 ఏళ్లు దాటిన వారు ఆధార్ కార్డు తీసుకెళ్లి చూపిస్తే ఉచితంగా వ్యాక్సిన వేస్తారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో వ్యాక్సిన తీసుకుని యాంటీబాడీస్ పెంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
భయాందోళనలు వద్దు
- డాక్టర్ ప్రసాద్‌రావు, రిమ్స్ సూపరింటెండెంట్
ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటికీ ప్రజలు వ్యక్తిగత శుభ్రత, శానిటేషన, సోషల్ డిస్టెన్స పాటిస్తూ ముఖ్యంగా మాస్కులు ధరిస్తూ ఉంటే కొంతవరకు వైర్‌సను అరికట్టవచ్చు. వైరస్ దృష్ట్యా సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే దాదాపు 10 వేల మందికి వ్యాక్సిన వేశాము. ఆసుపత్రిలో వ్యాక్సిన తీసుకున్న ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదు. ప్రజలు ఎటువంటి భయాలకు గురికాకుండా వ్యాక్సిన తీసుకోవడం వల్ల కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆక్సిజన కొరత లేకుండా ఆక్సిజన నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాము. అవసరమైతే కొవిడ్ సెంటర్లను కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.