ఇంటర్‌కు ఫస్టియర్‌ మార్కులే ఆధారం

Jun 16 2021 @ 03:41AM

  • ద్వితీయ సంవత్సరం మార్కుల కేటాయింపునకు అదే ప్రాతిపదిక
  • ప్రభుత్వానికి ఇంటర్‌ బోర్డు సిఫారసు 
  • అనుమతి లభిస్తే వారంలోనే ఫలితాలు 
  • 15 నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు
  • ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ వెల్లడి


హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండియర్‌ మార్కులు కేటాయించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు మంగళవారం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల ఉత్తీర్ణతకు సంబంధించి ఏ ప్రాతిపదిక తీసుకోవాలన్న దానిపై సర్కారు ఓ కమిటీ వేసింది. అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ.. మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండియర్‌ మార్కులు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వారంలోగానే ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.


దీనివల్ల డిగ్రీ ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్‌’ ప్రక్రియ త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. వచ్చేనెల 15 నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. జూలై ఒకటి నుంచి సెకండియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేశారు. దీని కోసం డిజిటల్‌ పాఠాలు ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో 15 రోజుల్లో 25,575 మంది మొదటి ఏడాది ప్రవేశాలు పొందారన్నారు. అక్రెడిటేషన్‌ ఫీజును గతంలో మాదిరిగానే ప్రైవేటు కాలేజీలు  చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి  చెప్పారు. 


పీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు 

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈసెట్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పీఈసెట్‌ కన్వీనర్‌ వి.సత్యనారాయణ రెడ్డి మంగళవారం తెలిపారు. అలాగే ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువును ఈనెల 22 వరకు, లాసెట్‌ దరఖాస్తు గడువును కూడా ఈనెల 25 వరకు పొడిగించారు. 


నేషనల్‌ టాలెంట్‌ ఫలితాల వెల్లడి 

ఫిబ్రవరిలో జరిగిన నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్ఈ) పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను http//bse.telangana.gov.in  వెబ్‌సైట్లో చూడవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్దేశకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.