తండ్రికి రెండు కిడ్నీలు ఫెయిల్.. ఇచ్చేందుకు సిద్ధమైన 25 ఏళ్ల కొడుకు.. ఆపరేషన్‌కు సరిగ్గా మూడ్రోజుల ముందు షాకింగ్ సీన్

ABN , First Publish Date - 2021-11-23T16:57:28+05:30 IST

తన కారణంగా కుమారుని జీవితం ఇబ్బందుల్లో..

తండ్రికి రెండు కిడ్నీలు ఫెయిల్.. ఇచ్చేందుకు సిద్ధమైన 25 ఏళ్ల కొడుకు.. ఆపరేషన్‌కు సరిగ్గా మూడ్రోజుల ముందు షాకింగ్ సీన్

తన కారణంగా కుమారుని జీవితం ఇబ్బందుల్లో పడకూడదని భావించిన ఒక తండ్రి చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే అతని రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. రెండు రోజుల తరువాత అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సివుంది. తనకు కిడ్నీలు దానం చేస్తే కుమారుని ఆరోగ్యం పాడవుతుందని ఆ తండ్రి భావించాడు. ఈ నేపధ్యంలోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామీణుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. మృతుడిని భన్వర్‌లాల్ మెవాడా(47)గా పోలీసులు గుర్తించారు. బన్వర్‌లాల్ మెవాడా తన కుటుంబంతో పాటు రాజ్‌సమంద్ పరిధిలోని ఆమెట్‌లో ఉంటున్నాడు. 


అతనికి బెంగళూరులో బంగారం, వెండి ఆభరణాల దుకాణం ఉంది. ప్రస్తుతం అతను ఆమేట్‌లోనే ఉంటున్నాడు. అతనికి భార్య ప్యారీ దేవి(45) కుమారులు రాహుల్(25), సంజయ్(20) కుమార్తె పూజ(22) ఉన్నారు. పెద్ద కుమారుడు రాహుల్ తండ్రికి కిడ్నీలు దానమివ్వాల్సివుంది. రాహుల్, సంజయ్‌లు దుకాణం పనులు చూస్తుంటారు. రాహుల్‌కు వివాహం అయ్యింది. తండ్రి మృతదేహం చెరువులో లభ్యమైన విషయాన్ని పోలీసులు.. కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తరువాత మృతదేహానికి లాల్‌బాగ్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామచంద్ర మాట్లాడుతూ బన్వర్‌లాల్ మేవాడ్‌కు రెండు కిడ్నీలు పాడయ్యాయని, రెండు రోజుల్లో అతనికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరగాల్సివుందన్నారు. అతని కుమారుడు రాహుల్ తన తండ్రికి కిడ్నీ ఇవ్వాల్సివుంది. అయితే కుమారుని నుంచి కిడ్నీ తీసుకోవడం తండ్రికి ఎంతమాత్రం ఇష్టంలేదు. కుమారుడు తనకు కిడ్నీ దానం చేస్తే అతను అనారోగ్యం బారిన పడతాడని తండ్రి భావించాడు. ఈ ఆలోచనతోనే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-11-23T16:57:28+05:30 IST