ఊళ్లోంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి.. ఎనిమిదేళ్ల తర్వాత సొంతూరికి రావడమే వాళ్లు చేసిన తప్పయింది..!

Jun 22 2021 @ 13:45PM

వాళ్లిద్దరిదీ ఒకే ఊరు. వేరు వేరు మతాలు. కానీ మనసులు మాత్రం కలిశాయి. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ యువతి తండ్రి మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో ఆ యువకుడు ఆమెను తీసుకుని ఊళ్లో నుంచి వెళ్లిపోయాడు. ముంబైకి తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఆ సిటీలోనే ఓ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ, వారిద్దరూ మేజర్లు కావడంతో కేసు నమోదు చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఎనిమిదేళ్ల తర్వాత అతడు భార్యాపిల్లలతో కలిసి సొంతూరికి వెళ్లాడు. అదే అతడు చేసిన తప్పయింది. ఆమె తన తండ్రి కంట పడింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జి్లలా చిల్లియా ప్రాంత పరిధిలోని ఖల్సా గ్రామానికి చెందిన విశ్వనాథ్ శర్మకు సునీతా శర్మ అనే 28 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అనే యువకుడిని ప్రేమించింది. ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఎనిమిదేళ్ల క్రితమే ఆ ఊరు నుంచి అతడితో కలిసి వెళ్లిపోయింది. అబ్దుల్, సునీతా శర్మ ముంబైకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారు. తన కూతురిని కిడ్నాప్ చేశాడంటూ అబ్దుల్‌పై విశ్వనాథ్ కేసు పెట్టినప్పటికీ విషయం ఏంటో తెలిసి పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇద్దరూ మేజర్లు కావడంతో తామేం చేయలేమనీ, వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని పోలీసులు విశ్వనాథ్‌కు సూచించారు. దీంతో విశ్వనాథ్ మిన్నకుండిపోయాడు. అటు అబ్దుల్, సునితీ శర్మ ఎనిమిదేళ్లుగా ముంబైలోనే జీవనం సాగిస్తున్నారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయితే ఇటీవలే తన కుటుంబ సమస్యల కారణంగా అబ్దుల్ తన భార్యతో సహా స్వగ్రామానికి వచ్చాడు. మూడు వారాల పాటు గ్రామంలోనే ఉన్నాడు. ఆ తర్వాత భార్యాపిల్లలను తన తండ్రి ఇంట్లోనే ఉంచి వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని భార్యకు చెప్పి ముంబై వెళ్లిపోయాడు. 


ఈ క్రమంలోనే కూతురు ఊళ్లోనే ఉందని విశ్వనాథ్‌కు తెలిసింది. అతడిని వదిలేసి ఇంటికి వచ్చేయాలని కూతురితో కొద్ది రోజులుగా గొడవ పడుతూ ఉన్నాడు. ఆమె ససేమిరా అనడంతో విశ్వనాథ్ కోపం పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం సునీత తన మామయ్య ఇంటి ముందు నిలబడి ఉంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న విశ్వనాథ్ కుమార్తె వద్దకు వెళ్లాడు. వారిద్దరి మధ్య మళ్లీ అదే విషయమై గొడవ జరిగింది. ఈ గొడవలోనే సహనం కోల్పోయిన విశ్వనాథ్ పక్కనే ఉన్న రాయితో సునీత తలపై మోదాడు. దీంతో సునీత అక్కడికక్కడే స్పృహతప్పి కింద పడిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఈలోపే ఆమె మరణించిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై అబ్దుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య మృతి గురించి ముంబైలో ఉన్న అబ్దుల్‌కు తెలియజేశారు. అబ్దుల్ తిరిగి స్వగ్రామానికి చేరుకున్న తర్వాత సోమవారం సునీత అంత్యక్రియలు జరిగాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న ఎనిమిదేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన ఆమె.. ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి. 


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.