తండ్రి బాటలోనే పేరు మార్పు

ABN , First Publish Date - 2022-09-25T05:49:51+05:30 IST

తండ్రిబాటలో తనయుడు కూడా పేర్లను మార్చుకుంటూ పోతున్నాడని సీఎం జగనపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు.

తండ్రి బాటలోనే పేరు మార్పు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

సీఎం జగనపై పరిటాల సునీత ఫైర్‌


రామగిరి, సెప్టెంబరు 24: తండ్రిబాటలో తనయుడు కూడా పేర్లను మార్చుకుంటూ పోతున్నాడని సీఎం జగనపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటి పేరు మార్పుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాపురంలో టీడీపీ నాయకులతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. అంతకు మునుపు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును కొనసాగించేవరకు చేపట్టాల్సిన పోరాటాల గురించి పార్టీ నాయకులతో చర్చించారు. ‘అప్పట్లో విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరును మీ నాన్న రాజశేఖర్‌ రెడ్డి తొలగించారు. ఇప్పుడు హెల్త్‌ యూనివర్సిటీ పేరును మీరు మారుస్తున్నారు. ఇది ఎన్టీఆర్‌ను అవమానించడమే..’ అని అన్నారు. ఏం చేసినా ఎన్టీఆర్‌ ఖ్యాతిని తగ్గించలేరని అన్నారు. ఎన్నో సంస్థలు ఉండగా ఎన్టీఆర్‌ పేరునే ఎందుకు మారుస్తున్నారు..? కొత్తగా వాటికి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవచ్చుకదా అని ప్రశ్నించారు. జగన చర్యలతో తెలుగు ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు. కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని తండ్రి పేరు పెట్టుకోవాలని, ఎన్టీఆర్‌ స్థాపించిన యూనివర్సిటీకి పేరు పెట్టుకోడానికి సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నించారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ బీసీ సెల్‌  శ్రీసత్యసాయి  జిల్లా అధ్యక్షుడు రంగయ్య, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బాల నరసింహ యాదవ్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేశ, కనగానపల్లి మండల కన్వీనర్‌ యాతం పోతలయ్య, తెలుగుయువత కనగానపల్లి మండల అధ్యక్షుడు బట్టా సురేశ చౌదరి, సీనియర్‌ నాయకులు సుధాకర్‌ చౌదరి, పసల వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:49:51+05:30 IST