కోర్టు ముందు కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. మమ్మల్ని విడదీయొద్దంటూ ఆ ఆరేళ్ల కొడుకు తండ్రిని హత్తుకుని ఏడుస్తూ..

ABN , First Publish Date - 2022-06-29T20:24:59+05:30 IST

ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. వరకట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై భార్య కేసు వేసింది..

కోర్టు ముందు కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. మమ్మల్ని విడదీయొద్దంటూ ఆ ఆరేళ్ల కొడుకు తండ్రిని హత్తుకుని ఏడుస్తూ..

ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. వరకట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై భార్య కేసు వేసింది.. భర్త దగ్గర ఉన్న తన కొడుకును తనకు అప్పగించాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేసింది.. కేసు విచారించిన కోర్టు ఆరేళ్ల కొడుకు బాధ్యతను తల్లికే అప్పగించింది.. దీంతో విడిపోతున్న తండ్రీకొడుకులు కన్నీరుమున్నీరయ్యారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక కోర్టులోనే భోరున విలపించారు.. ఈ ఘటన అక్కడున్న అందరినీ కలిచి వేసింది.. రాజస్థాన్‌లోని జుంజును జిల్లా చిరావా ఎస్‌డీఎం కోర్టులో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

రెండు పక్కపక్క ఇళ్లల్లో 9 మృతదేహాల కేసులో షాకింగ్ ట్విస్ట్.. వాళ్లందరిదీ ఆత్మహత్య కాదు.. చంపింది ఎవరంటే..


ఖపర్వాస్‌లో నివాసముంటున్న ప్రీత్ పచరంగియా (39)కు 2015లో సుమన్ (28)తో వివాహం జరిగింది. ఆ తర్వాతి ఏడాది వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు జతిన్. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018లో ప్రీత్, సుమన్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత ఆ దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమన్ తన అత్తమామలు, భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కూతురు జియాను తీసుకుని సుమన్ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.  


కొడుకు జతిన్ మాత్రం తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. వరకట్న వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడంతో, కుమారుడు జతిన్‌ను తనకు అప్పగించాలని సుమన్‌ పిటీషన్‌ వేసింది. ఈ పిటీషన్‌ను విచారించిన కోర్టు సుమన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కొడుకు కస్టడీని తల్లికి అప్పగించింది. ఈ తీర్పు విన్న జతిన్, ప్రీత్ కోర్టు ఆవరణలోనే కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకరిని కౌగిలించుకుని మరొకరు ఏడుస్తూ ఉండిపోయారు. తనను, తండ్రిని విడదీయొద్దని జతిన్ ఏడుస్తూ వేడుకున్నాడు. చివరకు జతిన్‌ను తల్లి తీసుకెళ్లిపోయాక కోర్టు ఆవరణలోనే ప్రీత్ స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకెళ్లారు. 

Updated Date - 2022-06-29T20:24:59+05:30 IST