పెళ్లయిన నాలుగేళ్లకే కొడుకు దుర్మరణం.. కోడలినే కూతురిగా భావించి ఏడాదిలోపే మరో పెళ్లి చేసిన అత్తమామలు..!

ABN , First Publish Date - 2022-06-30T21:51:44+05:30 IST

కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ వృద్ధులు తమ కోడలికి తల్లిదండ్రుల్లా మారారు

పెళ్లయిన నాలుగేళ్లకే కొడుకు దుర్మరణం.. కోడలినే కూతురిగా భావించి ఏడాదిలోపే మరో పెళ్లి చేసిన అత్తమామలు..!

కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ వృద్ధులు తమ కోడలికి తల్లిదండ్రుల్లా మారారు. తమ కోడలు ఒంటరిగా ఉండిపోకూడదని ఆమెకు దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. తమ బంధుమిత్రులు, చుట్టుపక్కల వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. బీహార్‌లోని ఛప్రాలో నివసిస్తున్న చాందినీ కుమారికి, చందన్ కుమార్‌తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే గతేడాది ఓ ప్రమాదం కారణంగా చందన్ చనిపోయాడు. దీంతో చాందినీ విషాదంలో మునిగిపోయింది. ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేసేందుకు అత్తమామలు ఎంతగానో ప్రయత్నించినా కుదరలేదు.


కోడలు చాందినీ భవిష్యత్ జీవితం బాగుండాలంటే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని మామగారు సురేంద్ర ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఆమె కోసం అబ్బాయిని వెతకడం ప్రారంభించాడు. చాలా ప్రయత్నాల తర్వాత, రాజస్థాన్‌లోని జుంజును జిల్లాకు చెందిన నవీన్ కుమార్‌తో చాందినీకి వివాహం కుదిర్చారు. పెళ్లిలో మామగారు తండ్రిలా మారి కన్యాదానం చేశారు. తమ కోడలి వివాహానికి బంధువులందరినీ ఆహ్వానించి వైభవంగా పెళ్లి చేశారు. కాగా, మనవడిని తన దగ్గరే ఉంచుకుని కోడలిని కాపురానికి పంపించారు. ఎంతో పెద్ద మనసుతో కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామగారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

Updated Date - 2022-06-30T21:51:44+05:30 IST